అక్రమాలపై ఆధిపత్యాల ముసుగు!
ABN , First Publish Date - 2023-02-08T02:06:46+05:30 IST
‘అదానీ వ్యవహారం చివరికి టీ కప్‌లో తుఫానుగా మారుతుంది. మోదీ పులుకడిగిన ముత్యంలా బయటకు వస్తారు. షేర్ మార్కెట్‌లో ఏమైనా జరిగితే ప్రజలకేం పట్టింపు?’ అని రెండు రోజుల క్రితం...
‘అదానీ వ్యవహారం చివరికి టీ కప్‌లో తుఫానుగా మారుతుంది. మోదీ పులుకడిగిన ముత్యంలా బయటకు వస్తారు. షేర్ మార్కెట్‌లో ఏమైనా జరిగితే ప్రజలకేం పట్టింపు?’ అని రెండు రోజుల క్రితం ఒక జాతీయ పత్రిక విలేఖరి వ్యాఖ్యానించారు. ఇది, మోదీ నాయకత్వంపై విశ్వాసమో, లేక అభిమానమో చెప్పలేము. కానీ ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుని మోదీ బయటకు రాగలరన్న భరోసా వ్యక్తం చేస్తున్న వారిని ఎలా అర్థం చేసుకోవాలి? సమాజంలో సంభవిస్తున్న పరిణామాలపై ప్రశ్నించడం ఆ వ్యక్తులకు ఇష్టంలేదనో, లేక ప్రశ్నించినా జరిగేదేముందని నిరాశా నిస్పృహలు వారిని ఆవహించాయనో అనుకోవల్సివస్తోంది. మరోవైపు అదానీ పరిణామంతో మోదీ సర్కార్ కుప్పకూలిపోతుందని, ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయితే ప్రజలు వారికి మద్దతునిస్తారన్న అతి విశ్వాసం వ్యక్తం చేసేవారూ అనేకమంది కనపడుతున్నారు. ప్రశ్నలకు ఆస్కారం లేని సమాజంలో ఎవరి ఊహలు వారివి కదా!
దేశ పరిస్థితులు చూస్తుంటే వందేళ్ల క్రితం ఇటాలియన్ తత్వవేత్త ఆంటోనియో గ్రాంసీ (1891–1937) అన్న మాటలు నిజమవుతున్నాయా అని అనిపిస్తున్నది. సాంస్కృతిక ఆధిపత్యం అనేది సైద్ధాంతిక, సాంస్కృతిక మార్గాల్లో సమాజంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుందని, అందుకోసం విలువలు, ఆలోచనలు, అంచనాలు, ప్రాపంచిక దృక్పథం, సమాజం ప్రవర్తనను బలంగా ప్రభావితం చేసేందుకు అధికారంలో ఉన్నవారు సామాజిక సంస్థలను ఉపయోగించుకుంటారని ఆయన అన్నారు. అధికార వర్గం ప్రాపంచిక దృక్పథాన్ని రూపొందించే ఈ సాంస్కృతిక జాతీయవాదం సమాజంలో అందరి ప్రయోజనం కోసమే సామాజిక ఆర్థిక నిర్మాణాలు ఉంటాయని చెబుతుంది. అయితే ఈ నిర్మాణాలు అధికారంలో ఉన్న వారి ప్రయోజనం కోసమే పనిచేస్తాయి. సైనిక నియంతృత్వం లాంటివి అవసరం లేకుండానే సిద్ధాంతం, సంస్కృతి ఈ పనిచేస్తాయి. విశ్వాసాలు, అంచనాలు, విలువలు ఆధిపత్య సామాజిక వర్గానికి అనుకూలంగా మారేందుకు సంస్థలు, వ్యవస్థలు తోడ్పడతాయి ఈ సంస్థలు.
వ్యవస్థలను నియంత్రించే ఆధిపత్య వర్గం సమాజంపై పట్టు బిగుస్తుందని గ్రాంసీ సూత్రీకరించారు. మారుతున్న ఆర్థిక, సామాజిక పరిస్థితులు సహజమైనవని, తప్పనిసరి అని నమ్మించే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఒక నిర్దిష్ట సామాజిక, ఆర్థిక, రాజకీయ క్రమంలో ఈ పరిస్థితులను తమ లాంటి స్వార్థపర శక్తులే సృజించిన విషయం వారికి తెలియనిది కాదు అని గ్రాంసీ అన్నారు.
‘20వ శతాబ్దం, ఆ మాటకొస్తే 21వ శతాబ్దంలో కూడా రాజకీయ ప్రాధాన్యత గల మూడు పరిణామాలు జరిగాయి. ఒకటి– ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందడం; రెండు– కార్పొరేట్ శక్తి పెంపొందడం; మూడు– ప్రజాస్వామ్యం నుంచి కార్పొరేట్ శక్తిని కాపాడేందుకు కార్పొరేట్ ప్రచారాన్ని ఉపయోగించడం’ అని ఆస్ట్రేలియన్ మేధావి అలెక్స్ కేరీ అన్న మాటల్ని అమెరికన్ మేధావి నోమ్ చామ్ స్కీ ఒక సందర్భంలో ఉటంకించారు. అడ్డూ ఆపు లేని వ్యక్తి, రాజ్యం, కార్పొరేట్ శక్తులు, అగ్రవర్ణాలు... ఎవరి చేతుల్లో అధికారం కేంద్రీకృతం అయినా ప్రమాదకరమేనని భావించే చామ్ స్కీ రాజ్యం మద్దతుతో ప్రైవేట్ శక్తి ఎదగడం కొత్తరకం నియంతృత్వమని అభివర్ణించారు.
సాంస్కృతిక పెత్తనం, కార్పొరేట్ అధిపత్యం రెండూ ఒకటైతే ఏం జరుగుతోందో మనం ఇప్పుడు అదానీ వ్యవహారంలో చూస్తున్నాం. అందుకే హిండెన్ బర్గ్ నివేదిక ‘దేశీయ స్వతంత్ర సంస్థల ఆలంబనతో అభివృద్ధి చెందాలన్న భారత దేశ మహత్వాకాంక్షపై దాడి’ అని అదానీ ధైర్యంగా అభివర్ణించగలిగారు. ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్’ కూడా ఇవే మాటల్ని పరోక్షంగా పేర్కొంది. అదానీ గ్రూపుపై దాడి భారతీయ ఆర్థిక వ్యవస్థపై దాడి అని, చైనాకు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ దాడి జరుగుతోందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. భారతీయ కంపెనీల విశ్వసనీయతను దెబ్బతీసి అనుమానాలు వ్యాప్తి చేసేందుకు, నిధులు సేకరించకుండా దెబ్బతీసేందుకే ఈ దాడి జరుగుతోందని పేర్కొంది.
బలంగా పెనవేసుకున్న సాంస్కృతిక, కార్పొరేట్ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడం కష్టమే. అయితే అంత మాత్రాన ఏమీ జరగదని, ప్రశ్నించడం అవసరం లేదని ఊరుకోగలమా? ప్రస్తుతం సంభవిస్తున్న పరిణామాలు కేవలం అదానీ భవిష్యత్‌కు సంబంధించినవి మాత్రమే కావు. మోదీ సర్కార్ అనుసరిస్తున్న కార్పొరేట్ పాలనకు సంబంధించినవని కూడా స్పష్టంగా చెప్పవచ్చు. దేశ మౌలిక సదుపాయాలను కొద్దిమంది సంపన్నులకు స్వహస్తాలతో అప్పగించి, దాన్నే ఆత్మనిర్భరత, దేశ భక్తి, అభివృద్ధికి నమూనాగా చెప్పుకుంటున్న మోదీ సర్కార్ నిజాయితీకి సంబంధించిన వ్యవహారమది.
అందుకే హిండెన్ బర్గ్ నివేదిక వచ్చినప్పటి నుంచీ ప్రభుత్వంలో నీరవ నిశ్శబ్దం నెలకొంది. విచిత్రమేమంటే ప్రతి నెలా ‘మన్ కీ బాత్’ పేరిట ఉపన్యాసాలు ఇస్తూ, ప్రతి రోజూ ఏదో ఒక ప్రసంగం చేసే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంతవరకూ ఈ విషయంపై ఏమి మాట్లాడాలో తేల్చుకోలేకపోతున్నారు. భావోద్వేగాలతో ముడిపెట్టి ఏదో ఒకటి ఎప్పటిలా మాట్లాడినా హాస్యాస్పదంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. అందువల్ల పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం ఇస్తూ ఆయన ఏమి మాట్లాడతారో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
ఎందుకంటే హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ ఉదంతాల వలే అదానీ కంపెనీ షేర్ల సంక్షోభం కేవలం స్టాక్ మార్కెట్ వ్యవహారం కాదు. అది భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయం. 1992లో హర్షద్ మెహతా నకిలీ బ్యాంకు రసీదుల ద్వారా భారీ రుణాలు తీసుకుని ఆ డబ్బును షేర్ మార్కెట్‌లో మదుపు చేసి షేర్ల ధరలు భారీగా పెరిగేందుకు కారణమయ్యారు. పలువురు పారిశ్రామికవేత్తలు కూడా ఇందుకు దోహదం చేశారు. ఇది బయటపడడంతో బ్యాంకులు రూ. 1800 కోట్ల మేరకు నష్టపోయాయి. ఆనాడు విపరీతంగా హంగామా సృష్టించిన బిజెపి, నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ‘ఇందిర అవినీతికి వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమించినట్లే, బోఫోర్స్ కేసులో రాజీవ్‌పై విపిసింగ్ పోరాడినట్లే, అవినీతికి వ్యతిరేకంగా బిజెపి శంఖారావం ఊదుతుంది’ అని ఆనాడు బిజెపి నేత ఆడ్వాణీ ప్రకటించారు. ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ద్వారా దర్యాప్తు చేయించేవరకూ బిజెపి ఊరుకోలేదు. హర్షద్ మెహతా వ్యవహారం కంటే కొన్ని వేల రెట్లు పెద్దదైన అదానీ బాగోతంలో జెపిసి కాదు కదా కనీసం మాట్లాడడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడకపోవడాన్ని ఏమనాలి? అదే కేతన్ పరేఖ్ అనే మరో స్టాక్ బ్రోకర్ 2001లో అదానీ వంటి ఇతర వ్యాపారులతో కలిసి మళ్ళీ షేర్ మార్కెట్ ధరలు కృత్రిమంగా ఆకాశాన్నంటేందుకు కారణమైనప్పుడు వాజపేయి ప్రభుత్వం జెపిసి ద్వారా విచారణకు ఆదేశించింది. రిజర్వు బ్యాంకు, సెబి, సిబిఐ వంటి సంస్థలు బలంగా పనిచేయడంతో హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ ఇద్దరూ విచారణకు గురై జైలు పాలయ్యారు. ఇప్పుడు మహాభూతంలా కనిపిస్తున్న అదానీ కుంభకోణంపై ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ఫైలు అయినా కదులుతుందా అన్నది సందేహాస్పదమే.
నిజానికి అదానీ వ్యాపార లావాదేవీలపై దాడి భారత దేశంపై దాడి కాదు. ఆ మొత్తం వ్యవహారంపై సత్యనిష్ఠతో తగిన చర్యలు తీసుకోకపోవడమే అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ఉరకలు వేస్తున్న భారత్ ప్రతిష్ఠకు సవాల్ వంటిది. అదానీ వ్యాపారాలపై జరుగుతున్న దాడి ఒక కుట్ర అని ప్రచారం చేయడం ద్వారా భారత్ ప్రతిష్ఠ పెరిగే అవకాశం లేదు. పై పెచ్చు అంతర్జాతీయంగా ‘బ్రాండ్ మోదీ’ గురించి జరుగుతున్న ప్రచారానికి విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయి. అదానీ గ్రూపును కాపాడేందుకు భారత్ ప్రతిష్ఠను పణంగా పెట్టాల్సిన అవసరం ఉన్నదా? ఈ విషయమై నిశితంగా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అదానీకి ఇప్పటికే విమానాశ్రయాలు, రేవులు, విద్యుత్‌తో సహా దేశంలోని మౌలిక సదుపాయాల్లో అత్యధికం అప్పజెప్పడంతో పాటు వేల కోట్ల రుణాలు పొందేందుకు, బ్యాంకులు, అతర ఆర్థిక సంస్థలు అదానీ గ్రూపులో భారీ పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కింది. ఈ నిర్ణయాల్లో తప్పు లేదని మోదీ సర్కార్ నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అదానీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి నియంత్రణ సంస్థలు చేతులు ముడుచుకుని కూర్చుంటే, ఇతర ప్రభుత్వాలతో పోలిస్తే తమది విశిష్టమైన ప్రభుత్వం అని, ‘తాను తినను, మరొకరిని తిననివ్వను’ అని చెప్పే మోదీ ప్రతిష్ఠకు భంగకరం అవుతుంది. తన హయాంలో కార్పొరేట్ చరిత్రలోనే పెద్ద కుంభకోణం జరిగిందనే పేరు రావడం మోదీకి మంచిదవుతుందా? ముఖ్యంగా జి–20 దేశాలకు భారత్ అధ్యక్షత వహిస్తున్న సమయంలో, సెప్టెంబర్‌లో జి–20 సదస్సుకు అగ్రదేశాలన్నీ తరలివస్తున్న తరుణంలో భారతదేశంలో కార్పొరేట్ పాలన ప్రశ్నార్థకం అయితే ఇది విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపదా? అందువల్ల మోదీ ప్రభుత్వం సరైన దిశలో చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.
అంతేకాదు, ఈ ఏడాది పది రాష్ట్రాలకు, వచ్చే ఏడాది లోక్‌సభకు ఎన్నికలు జరుగనున్నాయి. అదానీ గ్రూపు పెరుగుదలకు, భారతదేశ అభివృద్ధికీ ముడివడి ఉన్నందువల్ల హిండెన్ బర్గ్ నివేదిక రాజకీయ ప్రభావం పడకుండా చూసుకోవాలి. సాంస్కృతిక, కార్పొరేట్ ఆధిపత్యం మూలంగా మోదీకేమీ జరగదనే అభిప్రాయంతో ఆయన అభిమానులు, నిరాశాజీవులు ఉండవచ్చు. కాని ఏ ఆధిపత్యాలూ శాశ్వతం కావనేది ఒక కఠోర సత్యం.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)