దేశ అస్తిత్వాన్ని ప్రతిబింబించే పేరు ‘భారత్’

ABN , First Publish Date - 2023-09-12T02:34:18+05:30 IST

సింధునది ప్రవహించే ప్రాంతం కాబట్టి, దాన్ని ఉచ్చరించడం చేతకాని విదేశీయులు ‘ఇండస్’ అన్నారు కాబట్టి, ఈ ప్రాంతం ‘ఇండియా’ అయ్యిందనే వారికి ఈ దేశ మూల చరిత్ర తెలియదనుకోవాలి...

దేశ అస్తిత్వాన్ని ప్రతిబింబించే పేరు ‘భారత్’

సింధునది ప్రవహించే ప్రాంతం కాబట్టి, దాన్ని ఉచ్చరించడం చేతకాని విదేశీయులు ‘ఇండస్’ అన్నారు కాబట్టి, ఈ ప్రాంతం ‘ఇండియా’ అయ్యిందనే వారికి ఈ దేశ మూల చరిత్ర తెలియదనుకోవాలి. బ్రిటీష్ వారి దాడి కన్నా ముందు మహమ్మదీయుల దాడి జరిగింది. వారు మన భూభాగాన్ని హిందుస్థాన్ అనే పిలిచేవారు. దానికి కారణం సింధు నది పరీవాహక ప్రాంతంలో అంతకుముందే పరిఢవిల్లిన నాగరికత హిందూ నాగరికత కావడం. అది మనం ఉన్న ప్రస్తుత దేశాన్ని దాటుకొని ఇతర దేశాల్లో సైతం వెళ్ళూనుకొన్న సంస్కృతి.

హిందూ ధర్మం సనాతన ధర్మంలో అంతర్లీనం. ఇతర మతాలు చొరబడే కంటే ముందు నుంచే హిందూ జీవన విధానంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు సరస్వతి, లక్ష్మి, పార్వతులను, ఇతర దేవతా మూర్తులను కొలవడం భాగంగా ఉండేది. మన దేశ చరిత్ర దృష్ట్యా ‘భరతుడు పాలించిన నేలను భారత దేశం’గా పిలిచారు. మన తెలుగు వారికి అర్థం అయ్యే విధంగా చెప్పాలంటే గుంటూరు జిల్లాలోని చుండూరుని బ్రిటీష్‌వారు ఇంగ్లీష్‌లో ‘TSUNDURU’ అని రాసిన ఆనవాళ్ళు నేటికీ అక్కడ రైల్వేస్టేషన్ వద్ద దర్శనమిస్తూంది. బ్రిటీష్ వారికి నోరుతిరగక రాసిన ఉరి పేరు బోర్డును ఇప్పటికీ అలాగే పెట్టుకొని వేలాడుతున్న మనం సింధూ సంస్కృతి నుంచి వచ్చిన హిందూ అనే పదాన్ని బ్రిటిష్‌వారు ‘ఇండ్’గా తీసుకొని, ఇండియాగా మారిస్తే, అదే పదాన్ని పట్టుకొని వేలాడుతున్నాం. మన మూలాలను కాపాడుకోవలసిన బాధ్యత మనదే.

నేడు మేధావుల ముసుగులో దేశాన్ని ఆర్యులు లేదా ద్రవిడులని విభజించే ప్రయత్నం చేసేవారు ఆలోచించవలసినది ఒక్కటే. ఆర్యులలో ఎంత శాతం మంది, ద్రవిడులలో ఎంత శాతం మంది హిందూ దేవతా మూర్తులను కొలుస్తున్నారు? రాజకీయాలను పక్కనపెట్టి ఆలోచిస్తే మన దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ప్రాంతాల్లో శివుడు – పార్వతి, విష్ణువు – శ్రీలక్ష్మి దేవి అంశల్లోని దేవ దేవి మూర్తులను 75నుంచి 80శాతం మంది ప్రజలు కొలుస్తున్నారంటే అర్థం ఏమిటి? ఆర్యులు లేదా ద్రవిడులనేది నేడు కేవలం రాజకీయ లబ్ధికోసం చేసే విభజన మాత్రమే. ఇది మరింత కాలం కొనసాగదు. సనాతన ధర్మం ఈ విభజన రేఖలను చెరిపివేస్తుంది. హిందూ మతం సనాతన ధర్మంలో విడదీయలేని భాగం. అలాగే భారతదేశ జ్ఞాన సంపద, సహజ సంపద, ఆర్థిక సంపద మీద కన్నుపడిన మహ్మదీయుల, బ్రిటీషర్ల ప్రభావం వల్ల వచ్చిన ఇస్లాం, క్రైస్తవ మతాలను ఆచరించే వారిని కూడా మన హిందూ భావజాలం కలిగిన సమాజం అక్కున చేర్చుకున్నది. అయితే భారత సమాజానికి గల ఈ ఉదాత్త భావాన్ని ఉదాసీనతగా భావించి, సనాతన ధర్మాన్ని అవమానిస్తే మాత్రం దాన్ని తీవ్రంగా పరిగణించక తప్పదు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రజలను జాగృతపరచాల్సిన అవసరం ఉంది.


ఈ మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ‘హిందూ సనాతన ధర్మం’ గురించి ప్రతికూలంగా మాట్లాడి నాలుక కరచుకొని తన భావం వేరని ప్రకటించుకునే పరిస్థితి వచ్చింది వాస్తవం. నాడు మహమ్మదీయుల, బ్రిటీషర్ల దండయాత్రల అనంతరం వందల ఏళ్ళ వారి పాలన ప్రభావం వల్ల 20 నుండి 25 శాతం హిందువులను మతం మార్చగలిగారు, నేటి సూడో సెక్యులర్లు దాన్ని పెంచే ప్రయత్నంలో ఉన్నారు. వారే బ్రిటీష్‌వారు చేసిన నామకరణాన్ని తీసివేయడాన్ని నిరాకరిస్తున్నారు. మన దేశ మూలాలను ప్రతిబింబించే విధంగా, ఇప్పటికే భారతదేశ రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా మన దేశాన్ని ‘భారత్’ పేరుతో పిలవాలని ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టేవారు ఈ దేశ సంస్కృతిని దెబ్బతీసిన మెకాలే వారసులుగా మిగిలిపోతారు.

మన దేశాన్ని పిలవడానికి ‘భారత్’ అనే పదం రాజ్యాంగంలోనే పొందుపరచబడినప్పుడు ఇక కొత్తగా ఈ పేరు పెట్టారనడం ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఏ దేశ ప్రజలైనా తమ దేశం పేరును ఆ దేశంలో పుట్టిన భాషలలో ఉచ్చరించడం సాధారణం. అందుకే మన దేశంలో దాదాపు అన్ని భాషలలోనూ గరిష్ఠంగా దేశాన్ని ‘భారత్’ లేదా ‘భారతదేశం’ అనే ఉచ్చరిస్తున్నారు. చాలా సందర్భాల్లో తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మన దేశాన్ని ‘భారత్’గా వ్యవహరించడాన్ని చూస్తున్నాం. మన దేశంపైన మహమ్మదీయుల దాడి అనంతరం వారు ఉచ్చరించిన పేరు హిందుస్థాన్. నేటికీ మన నుంచి విడిపోయిన అనంతరం ఇస్లాం దేశాలుగా ఏర్పడిన పాకిస్థాన్, బంగ్లాదేశ్ మీడియావారు మన దేశాన్ని హిందుస్థాన్ అనే పిలుస్తూంటారు. కాబట్టి హిందుస్థాన్ అనే పేరు మన దేశానికి నేడు పెట్టివుంటే ఈ కుహనా లౌకికవాదులు ఇంకెన్ని ఘీంకారాలు చేసేవారో ఉహించలేము. ‘భారత్’గా పేరు మార్పును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షం ‘భారత్ జోడో’ పేరుతో యాత్ర ఎందుకు చేశారో ప్రజలకు జవాబు చెప్పాలి.

విదేశీయులు పెట్టిన పేరైన ‘ఇండియా’కు విస్తృత ప్రచారం జరిగి మన మూలాలున్న ‘భారత్’ అన్న పేరు మరుగున పడిపోయే ప్రమాదాన్ని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ అనే పేరు మాత్రమే వాడాలని నిర్ణయం తీసుకున్నారు. మన దేశంలో మద్రాస్‌ని చెన్నైగా, కలకత్తాని కోల్‌కత్తాగా మార్చినవారెవ్వరు? బ్రిటీష్ వారి మూలాల నుంచి ఆ నగరాల పేర్లు బయటపడి ఆ ప్రాంత సంస్కృతి ప్రతిబింబించాలనే ఆకాంక్ష దేశానికి అవసరం లేదా? ప్రాంతాల అస్తిత్వం ఆ ప్రాంత ప్రాచీన మూలాల నుంచి ప్రసరించడం సర్వసాధారణం. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో చాల దేశాలవారు తమ దేశం పేరును వారి ప్రాచీన అస్తిత్వానికి అద్దం పట్టేలాగా మార్చుకున్నారు. భారత్ అనే పేరు కొత్తగా తెచ్చిపెట్టింది కాకపోయినా ఇంత రాద్ధాంతం ఎందుకు? కేవలం ‘I.N.D.I.A’ పేరుతో కూటమి కట్టిన విపక్షాలకు వ్యతిరేకంగా ‘భారత్’ అని పేరు మార్చారన్న వాదన తేస్తున్నారు. కానీ I.N.D.I.Aకీ INDIAకీ మధ్య చాల తేడా ఉందనేది మరచి పసలేని రాజకీయం చేయడం దౌర్భాగ్యం.


ఇక కొంతమంది నరేంద్ర మోదీ ప్రధాని అయిన అనంతరం స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా అని పేర్లు పెట్టారని, అప్పుడే ఆ పేర్ల చివరన ‘భారత్’ అని ఎందుకు పెట్టలేదని కూడా వాదన చేస్తున్నారు. ఎక్కడో ఒక చోట మార్పుకి శ్రీకారం చుట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు, అది మంచి ఆలోచన అయినప్పుడు, ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకు లేదా పథకాలకు గతంలో పెట్టిన పేర్లను ప్రభుత్వం మార్చుకోగలదు. అలాగే కొంతమంది సనాతన ధర్మం రాజ్యంగం కన్నా గొప్పదా అనే ప్రశ్న వేస్తున్నారు. ఈ విషయంలో అర్థం చేసుకోవలసింది ఒక్కటే– సనాతన ధర్మం మన మెదడు అనుకుంటే, రాజ్యాంగం మన హృదయం. మనం ప్రస్తుతం ఆచరిస్తూన్న జీవన విధానం, ఆచారాలు, సంప్రదాయాలు కాలానుగుణంగా అవసరమైన మార్పులు చెందుతూ వచ్చాయి. హిందూ మత ఆధారిత జీవన విధానం మహ్మదీయ, క్రైస్తవ మతాలకు పూర్వం నుంచి ఆచరణీయంగా ఉంటూ వచ్చింది. మన ప్రాంతాల పైన ఎన్ని దాడులు జరిగినా, ఆయా మతాలను ఆచరించే వారితో కలిసి మెలిసి జీవిస్తూనే మన జీవన విధానాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకోగలిగాం. భవిష్యత్తులో కూడా అలా కాపాడుకోవాల్సిన భాధ్యత మనదే. ఏ మతం ఆచరించినా భారత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు భారతీయులే. మన సనాతన ధర్మానికి, మూలాలకు చెదలు పట్టించాలనుకునేవారు కాలగర్భంలో కలసిపోతారు.

లంకా దినకర్

Updated Date - 2023-09-12T02:34:18+05:30 IST