దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేదే జాతీయ భాష
ABN , First Publish Date - 2023-09-14T01:13:09+05:30 IST
మన జాతీయ భాష హిందీ. మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ కాబట్టి హిందీని జాతీయ భాషగా గుర్తించారు. హిందీ భాషాభివృద్ధికి మహాత్మాగాంధీ...
మన జాతీయ భాష హిందీ. మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ కాబట్టి హిందీని జాతీయ భాషగా గుర్తించారు. హిందీ భాషాభివృద్ధికి మహాత్మాగాంధీ ఎంతో శక్తి వంచన లేకుండా కృషి చేశారు. దక్షిణ భారత హిందీ ప్రచారసభ ఏర్పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినా అమృతోత్సవాలు ఘనంగా జరుపుకున్నా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో జాతీయ భాష పట్ల విముఖత చూపుతున్నారు.
మన దేశంలో త్రి భాష సూత్రాన్ని అనుసరిస్తున్నారు. మొదటి భాష వారి వారి మాతృభాష, ద్వితీయ భాషగా హిందీని, తృతీయ భాషగా ఇంగ్లీష్‌ను చెప్పుకుంటున్నారు. కానీ ఆంగ్ల భాష వ్యామోహం వలన మాతృభాషను, ద్వితీయ భాషను నిర్లక్ష్యం చేస్తున్నారు. హిందీ భాష అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలి. త్రి భాష సూత్రాన్ని కచ్చితంగా అమలు చేసినప్పుడు జాతీయ భాషగా హిందీకి మంచి గుర్తింపు లభిస్తుంది. రైల్వే అధికారులు రైల్వే సంబంధిత కార్యాలయాలలో, పోస్టాఫీస్‌లలో ప్రతిరోజూ ఒక హిందీ పదాన్ని ‘ఈ రోజు మంచి మాట’ కింద పరిచయం చేస్తున్నారు.
సెప్టెంబర్ 14న జాతీయ భాష హిందీ దినోత్సవ సందర్భంగా విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో హిందీ దివాస్‌ను పాటించాలి. జాతీయ సమైక్యత, సమగ్రతను కాపాడటానికి హిందీ భాషాభివృద్ధికి మరింత కృషి జరగాలి.
ఎస్. విజయ భాస్కర్