ఒకే ఒక్క పీలే!
ABN , First Publish Date - 2023-01-03T01:04:11+05:30 IST
అమేయమైన తన ఆటతీరుతో సర్వోత్తమ ఆటగాడిగా జేజేలందుకున్న దిగ్గజ ఆటగాడు, 82 ఏళ్ల పీలే ఇటీవల కన్నుమూశాడు...
అమేయమైన తన ఆటతీరుతో సర్వోత్తమ ఆటగాడిగా జేజేలందుకున్న దిగ్గజ ఆటగాడు, 82 ఏళ్ల పీలే ఇటీవల కన్నుమూశాడు. ఫుట్‌బాల్‌లో తొలి ‘ప్రపంచ సూపర్‌స్టార్’గా జగజ్జేయమానంగా వెలుగొందిన ఈ బ్రెజిల్ దిగ్గజం నాటి–నేటి తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. పీలే అన్న ఆ రెండక్షరాల పేరు క్రీడా లోకాన్ని ఉర్రూతలూగించింది. నల్లముత్యంగా, కింగ్ ఆఫ్ సాకర్‌గా యావత్ ప్రపంచానికీ చిరపరిచితుడైన పీలే దాదాపు 20 ఏళ్లకుపైగా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో తనదైన ముద్రవేశాడు. దిగ్గజ ఆటగాళ్లుగా చలామణీ అవుతున్న మెస్సీలాంటి స్టార్ ఒక్క ప్రపంచ కప్ ట్రోఫీని గెల్చేందుకు తన కెరీర్ చివరినాళ్లదాకా వేచిచూడాల్సివచ్చింది. నేడో రేపో వీడ్కోలు పలుకనున్న మరో దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఖాతాలో ఒక్క కప్ కూడా లేదు. అలాంటిది పీలే తన బ్రెజిల్ జట్టుకు ఏకంగా మూడు ప్రపంచకప్‌లు అందించాడంటే అతను ఏ స్థాయి ఆటగాడో వేరే చెప్పనక్కర్లేదు. ఫుట్‌బాల్ క్రీడలో మూడు ప్రపంచకప్‌లు గెల్చుకున్న ఏకైక ఆటగాడు పీలేనే. ఇకపై ఇన్ని ప్రపంచకప్‌లు గెలిచే ధీరుడు వస్తాడని కలలో కూడా ఊహించలేం. నిజానికి ఫుట్‌బాల్ క్రీడకు పీలే అద్భుతమైన ఇమేజ్‌ని అందించాడు. ఇంకా చెప్పాలంటే ఆ క్రీడలో ఓ అనూహ్యమైన విప్లవాన్నే తీసుకొచ్చాడు.
అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించిన పీలే అసలుపేరు ఎడ్సన్ అరాంటెస్ డో నసిమెంటో. చిన్నప్పుడు విమానాశ్రయంలో పల్లీలు అమ్ముకునేవాడు. 1950 ప్రపంచకప్‌లో బ్రెజిల్ ఓటమిని చూసి కన్నీటిపర్యంతమైన తన తండ్రికి ఏనాటికైనా దేశానికి వరల్డ్‌కప్‌ను అందిస్తానని మాటిచ్చాడు. సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత చెప్పిందే చేశాడు. బ్రెజిల్ వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. 17 ఏళ్లకు మూడు మాసాల ముందే జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసి రికార్డు పుటల్లోకి ఎక్కాడు. అప్పటిదాకా తమ జట్టుకో హీరోలాంటి ఆటగాడికోసం ఎదురుచూస్తున్న ఆ దేశ ప్రజలకు అతను ఆశాదీపమయ్యాడు. 17 ఏళ్లకే వరల్డ్‌కప్‌లో గోల్‌చేసిన బ్రెజిల్ ఆటగాడిగా ఖ్యాతినందుకున్న పీలే రికార్డు 65 ఏళ్లయినా చెక్కు చెదరలేదంటే అతని గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ముందుగా 1958, ఆ తర్వాత 1962లో చిలీలో జరిగిన వరల్డ్‌కప్, అనంతరం 1970లో మెక్సికోలోనూ కప్‌లు గెలిచి బ్రెజిల్ ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేశాడు. అంతేనా... 60వ దశకంలో తను ప్రాతినిథ్యం వహించిన సాంటోస్ క్లబ్‌కు ఏకంగా 25 టైటిళ్లు అందించి అగ్రపీఠాన నిలిపాడు. అమెరికాలో ఆటకు ప్రజాదరణ కల్పించేందుకు రిటైర్మెంట్‌నుంచి బయటికి వచ్చాడు. న్యూయార్క్ కాస్మోస్ క్లబ్‌కు ఆడిన సమయంలోనూ జాతి, మత, వర్ణమన్న తేడాల్లేకుండా అందరూ అతన్ని అభిమానించిన తీరు అనన్యసామాన్యం. ఇక 1999లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పీలేని ‘శతాబ్దపు ఉత్తమ అథ్లెట్’గా ప్రకటించింది. ఇంకా కొందరైతే చరిత్రలో ఒక లియోనార్డో డావిన్సి, ఒక బీతోవెన్.. ఆ తర్వాత పీలే అంటూ కీర్తించారు. అలాగే అతని ఆట ఎంత అందంగా ఉంటుందో వర్ణించేందుకు.... విశ్వవిఖ్యాత మోనాలిసాతోనూ పోల్చారు.
పీలే మొత్తంగా మూడుసార్లు భారత్‌లో పర్యటించాడు. ముందుగా 1977లో న్యూయార్క్ కాస్మోస్ జట్టు తరపున మోహన్ బగాన్‌తో ఆడేందుకు కోల్‌కతా వచ్చాడు. ఈ సాకర్ మాంత్రికుడి మాయకు భారత్ ఫిదా అయిపోయింది. పీలే ఆడిన ఆ మ్యాచ్‌కి దాదాపు 60వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇక భద్రత కోసం 35వేల మంది పోలీసులను నియమించారంటే పీలే క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అప్పటి పత్రికలు అతన్ని ‘కింగ్ సాకర్’, ‘ది ఎంపరర్’ అంటూ కీర్తించాయి. భారత్ తర్వాత ఇంకొక్క మ్యాచ్ మాత్రమే ఆడిన పీలే రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. ఇక ఆ తర్వాత 2015, 2018ల్లో కూడా కొన్ని కార్యక్రమాలకు అతిథిగా భారత్‌కు వచ్చాడు.
రెండేళ్ల క్రితమే మరో గొప్ప ఆటగాడు డీగో మారడోనాని కోల్పోయిన సాకర్ క్రీడకు పీలే మృతి తీరనిలోటు. అర్జెంటీనాకు చెందిన మారడోనా కూడా దాదాపు పీలే స్థాయి ఆటగాడే. అయితే అత్యంత వివాదాస్పదమైన తన వ్యక్తిగత జీవితం మారడోనా ఖ్యాతిని కొంత మసకబార్చింది. క్రీడల్ని కెరీర్‌గా ఎంచుకున్నవాళ్లు ఎలా ఉండకూడదో కూడా మారడోనా జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి కల్పించాడు. అయినా ఆటగాడిగా డీగోది ఓ చరిత్ర. అలాగే ప్లాటిని, బెకన్‌బార్, బెక్‌హామ్, జినెదిన్ జిదాన్... ఇక ఈ తరంలో లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, తాజా సూపర్‌స్టార్ ఎంబప్పే తదితరులు సాకర్ ఖ్యాతిని విశ్వవ్యాపితం చేస్తూనే ఉన్నారు.
క్రికెట్ మైకం కమ్మేసిన భారత్‌లో ఫుట్‌బాల్‌కు కొద్ది రాష్ర్టాల్లో మాత్రమే ఆదరణ ఉంది. సుబ్రతోపాల్, పీటర్ తంగరాజ్, ఐఎం విజయన్, బైచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రిలాంటి దిగ్గజ ఆటగాళ్లు వచ్చినా సాకర్‌కు ప్రజాదరణ కల్పించలేకపోయారు. వరల్డ్‌కప్ జరిగిన ఆ నెలరోజులు తప్ప భారత్‌లో సాకర్ పేరు పెద్దగా వినిపించదు. కొన్ని కార్పొరేట్ సంస్థలు, కొంతమేర ప్రభుత్వం చేస్తున్న కృషి క్రికెట్ మేనియా ముందు కొరగాకుండాపోతోంది. ప్రతిభావంతులైన ఆటగాళ్లు పుట్టుకురావాలంటే... ఆ శోధన మూలాలనుంచే జరగాలి. ప్రతిభను వెలికితీసే కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలు, అలాగే పాఠశాల స్థాయినుంచి విస్తృత ప్రాతిపదికన చేపడితేనే ఏ క్రీడైనా భాసిల్లుతుంది. 10–15 దేశాలు తలపడే క్రికెట్టేకాదు... దాదాపు 200 దేశాలకు పైగా ఆడే ఫుట్‌బాల్‌లోనూ మన ఖ్యాతిని విశ్వవ్యాపితం చేయాల్సిన అవసరముంది.