ఈ భవ్య ప్రస్థానం భారతీయమే!

ABN , First Publish Date - 2023-09-15T00:55:30+05:30 IST

భారత పార్లమెంటు వజ్రోత్సవాలు. ‘రాజ్యాంగ సభ నుంచి మొదలైన 75 సంవత్సరాల పార్లమెంటరీ ప్రస్థాన సాఫల్యాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, జ్ఞాన సంచయాల’ను...

ఈ భవ్య ప్రస్థానం భారతీయమే!

భారత పార్లమెంటు వజ్రోత్సవాలు. ‘రాజ్యాంగ సభ నుంచి మొదలైన 75 సంవత్సరాల పార్లమెంటరీ ప్రస్థాన సాఫల్యాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, జ్ఞాన సంచయాల’ను విపులంగా చర్చించేందుకే ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్టు మహారాజశ్రీ ప్రభుత్వం చెబుతున్నది. ఈ అధికారిక కథనాన్ని విశ్వసిద్దాం. సరే, భారత్‌లో 75 సంవత్సరాల పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రస్థాన చరిత్ర ఏమిటి? జరగనున్న ప్రత్యేక సమావేశాలలో ఈ విషయమై మూడు భిన్న కథలు వినిపించగలవని నేను భావిస్తున్నాను. ఆ మూడూ తప్పుడు కథలూ, తప్పుదోవ పట్టించేవేనని నేను చెప్పగలను. మనకు మనమే ఒక విభిన్న, మరింత సత్యప్రపూర్ణమైన కథను చెప్పుకోవల్సిన అవసరమున్నది. మనం మనుషులం కథా కుతూహల, కథలు చెప్పడంలో విశేష ప్రజ్ఞ ఉన్న జంతువులం కదా. మన కథలే మనలను తీర్చిదిద్దుతాయి. అవి మనపై గతించిన కాలం భారాన్ని భరించలేని రీతిలో మోపుతాయి లేదా మెరుగైన భవిష్యత్తును కానుకగా ప్రసాదిస్తాయి.

సరే, మనం వినబోయే మొదటి కథ ఏమిటో వివరిస్తాను. భారత ప్రజాస్వామ్యం ఇటీవలే ఒక పరిపూర్ణతను సాధించింది. ఈ విషయంలో ఎంతో జాప్యం జరిగింది. అయినప్పటికీ అద్భుత సఫలత పొందడమనేది ఒక అనివార్య చరిత్ర. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో దీన్ని మీరు పదేపదే తప్పక వింటారు. ప్రజాస్వామ్య మాతృమూర్తి భారత్. అయితే ఆంగ్ల మానస పుత్రులు అయిన కులీన వర్గాలు దశాబ్దాలుగా పాశ్చాత్య ప్రజాస్వామ్య పద్ధతులను గుడ్డిగా అనుసరించడం వల్ల మన మహోన్నత ప్రజాస్వామ్యం మలినమైనది. 2014లో నిజమైన ప్రజాస్వామ్యం ఉదయించడంతో ప్రజాస్వామిక అధిక సంఖ్యాక వాదం విజయం సాధించింది. భారత్ ఎట్టకేలకు పరిపూర్ణ విశ్వాసంతో తన భవితవ్యాన్ని దర్శించింది. కొత్త పేరు, నూతన దార్శనికతను సమకూర్చుకున్నది. పార్లమెంట్‌కు కొత్త భవనాన్ని నిర్మించుకున్నది.

ఈ అధికారిక చరిత్రకు రెండు విరుద్ధ కథనాలు కూడా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో తప్పక వినవస్తాయి. భారత ప్రజాస్వామ్యం ఒక విజయం నుంచి మరో విజయానికి జైత్రయాత్ర చేస్తూ 2014లో ఒక ఘోర ప్రమాదానికి గురయింది. నరేంద్ర మోదీ ఆకస్మిక ఉత్థానం ప్రజాస్వామ్యం పేరిట జరిగిన నిరంకుశాధికార కుట్ర ఫలితమే. ఈ కథనాన్ని విశ్వసించే కులీనుల, విద్యాధికుల సంఖ్య తక్కువేమీ కాదు.

భారత ప్రజాస్వామ్యం క్షీణ ముఖం పట్టి పూర్తిగా పతనమవడమనేది ఒక అనివార్య పరిణామమని మరో విరుద్ధ కథ ఉద్ఘాటిస్తుంది. దీని ప్రకారం మన ప్రజాస్వామ్యం చాలా బలహీనమైనది. అనివార్య పతనానికి కారణాలు ఏమిటో కూడా ఈ కథ వివరిస్తుంది. మన సమాజం, రాజకీయాలలో అప్రజాస్వామిక సంస్కృతి బలంగా ఉండడమే ఒక ప్రధాన కారణం. నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్య పరిచిందనేది మరో కారణం. భారతీయ పెట్టుబడిదారీ నమూనా ఆ పతనానికి ఒక ముఖ్య హేతువు. ఈ భిన్న కారణాలు చెప్పేవారు ఏది ఏమైనా మన ప్రజాస్వామ్యం ఒక బుడగ అని, అది ఏ క్షణాన అయినా బద్దలవుతుందనే విషయమై ఏకీభవిస్తారు.

ఈ మూడు కథలతో ఉన్న సమస్య అవి అసత్యమైనవి కావడం కానేకాదు. ప్రజాస్వామిక కార్యాచరణకు అవి సరైన మార్గదర్శకాలు కాకపోవడమే వాటితో ఉన్న అసలు సమస్య. మన చరిత్రలోని ప్రస్తుత క్లిష్ట దశలో ఆ కథలు మనకు ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో అంత నిరుత్సాహాన్నీ కలిగిస్తాయి. అయితే అవి మనలను తప్పక ఆలోచింపచేస్తాయి. నిజం చెప్పాలంటే మన ప్రజాస్వామ్య సాఫల్యాలు, వైఫల్యాలను అర్థం చేసుకోవడంలో ఈ మూడు కథలూ పూర్తిగా విఫలమయ్యాయి. పాశ్చాత్య ప్రపంచ ప్రజాస్వామిక అనుభవాన్ని మనం వారసత్వంగా పొందామన్న భావనను భారత ప్రజాస్వామ్యం నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చింది. ఈ అంశాన్ని నిశితంగా, వివరంగా చూడవలసిన అవసరమున్నది.

ప్రజాస్వామ్యం విజయవంతమవ్వాలంటే కొన్ని సానుకూలతలు తప్పనిసరిగా ఉండాలని పాశ్చాత్య అనుభవాన్ని గురించిన అవగాహన స్పష్టం చేస్తుంది. సమాజం సంపద్వంతంగా ఉండడంతోపాటు ఇంచుమించు ప్రతీ ఒక్కరూ అక్షరాస్యులై ఉండాలని ఆ అవగాహన ఖండితంగా చెప్పుతోంది. ఇది నిజమే అయితే భారత్ అసలు ప్రజాస్వామ్య వ్యవస్థే కాదని, కాబోదని చెప్పవలసి ఉంటుంది. అధికారానికి బహుళ పార్టీలు పోటీ పడవలసి ఉంటుందని పాశ్చాత్య ప్రజాస్వామ్య నమూనా నిర్దేశిస్తుంది. మరి మన ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య తొలి దశాబ్దాలలో ఒకే ఒక్క పార్టీయే అధికారంలో ఉన్నది. భారత జాతీయ కాంగ్రెస్‌ ఆనాడు దేశ రాజకీయాలలో తిరుగులేనిశక్తిగా చెలామణీ అయింది. ‘కాంగ్రెస్ వ్యవస్థ’గా ఆ తొలినాటి మన ప్రజాస్వామ్య పాలన సుప్రసిద్ధమైనది. మరి పాశ్చాత్య గీటురాళ్ల ప్రకారం ఆ ‘కాంగ్రెస్ వ్యవస్థ’ను అసలు ప్రజాస్వామ్యంగా పరిగణించడానికి వీలులేదు.

ఒక సమాజ సాంస్కృతిక సంప్రదాయాలు, రాజకీయ కార్యాచరణల మధ్య ఆనుగుణ్యత ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లగలదేది యూరోపియన్ భావన. అయితే భారత్‌లో సకల జీవన రంగాలలోనూ అపార వైవిధ్యమున్నది. రాజకీయ కార్యాచరణలు ఆ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పలేము. అయినప్పటికీ భారత ప్రజాస్వామ్యం సుస్థిరంగా నిలబడగలిగింది. దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఒక ప్రజాస్వామిక వ్యవస్థ ప్రయోజనకరంగా పని చేసేందుకు పటిష్ఠ రాజ్యాంగ సంస్థలు ఉండడం తప్పనిసరిఅని పాశ్చాత్య అనుభవం చెప్పుతోంది. ఇది నిజమే అయితే మన ప్రజాస్వామ్యం 1970వ దశకపు అత్యవసర పరిస్థితిని తట్టుకుని ఎలా నిలబడగలిగింది? ప్రజా స్వామిక పాలన సుస్థిరమైతే ఆర్థికాభివృద్ధి సాధనకు తిరుగు ఉండదనేది మరొక వాదన. ఇదే నిజమైతే భారత ప్రజాస్వామ్యం ప్రస్తుత సంక్షోభంలో ఉండేది కాదేమో?


తీవ్ర సవాళ్లు చుట్టుముట్టినప్పటికీ భారత ప్రజాస్వామ్యం కూలిపోలేదు. పాశ్చాత్య ప్రమాణాల ప్రకారం అయితే చైనాతో సరిహద్దు యుద్ధం తరువాత లేదా నెహ్రూ కీర్తిశేషుడు అయినప్పుడు లేదా దరిమిలా వరుస కరువులు పీడించినప్పుడు భారత ప్రజాస్వామ్యం పతనమయి ఉండాల్సింది. అత్యవసర పరిస్థితిలో మన ప్రజాస్వామ్యం కూలిపోయింది. అయితే విజయంపై ఇందిరాగాంధీ ఆత్మవిశ్వాసం కారణంగా 1977లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ప్రాభవం క్షీణించి, మండల్–మందిర్ సంక్షోభంలో దేశం చిక్కుకున్నప్పుడు, 1990 దశకం తొలినాళ్లలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు భారత ప్రజాస్వామ్యం అంతమయి ఉండవల్సింది. కానీ అలా జరగలేదు. ఈ చారిత్రక సందర్భాలతో పోల్చినప్పుడు 2014 ప్రజాస్వామ్య పతనానికి ఒక అసంభవ సమయమని చెప్పి తీరాలి.

భారత ప్రజాస్వామ్య ప్రస్తుత సంక్షోభాన్ని ‘ప్రజా స్వామ్య బంధనం’గా అభివర్ణించవచ్చు. ‘నిరంకుశత్వా నికి బందీ అయిన ప్రజాస్వామ్యం’ లేదా ‘ప్రజా స్వామ్య సంక్షోభం’గా పేర్కొనడం కంటే ‘ప్రజాస్వామ్య బంధనం’ అనడం అంటే ఆ ప్రజాస్వామ్య బంధనానికి లక్ష్యం, కారణం రెండూ ప్రజాస్వామ్యమే అని గుర్తు చేసుకోవడమే. ఈ ప్రజాస్వామ్య బంధనానికి ఉపకరించిన సాధనం ప్రజాస్వామ్యమే. అది రాజ్యాంగబద్ధమైనది. సైద్ధాంతికంగా న్యాయసమ్మతి పొందిన పాలన విధానమది. ప్రజాస్వామ్యాన్ని వశపరచుకోవడానికి అనుసరించిన పద్ధతులు ప్రజాస్వామ్య బద్ధమైనవి. స్వేచ్ఛాయుత ఎన్నికలలో అత్యధిక ఓటర్ల మద్దతును పొందడం ద్వారా సముపార్జించుకున్న విజయమది. ప్రజాస్వామ్య సారాన్ని నిర్వీర్యపరిచేందుకు లాంఛనప్రాయమైన ప్రజాస్వామిక పద్ధతులను ఉపయోగించుకోవడం జరిగిందనే సత్యాన్ని కూడా అది మనకు తెలియజేస్తుంది. మన ప్రశస్త ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఆ భ్రష్ట పరిణామం యాదృచ్ఛికమైనదేమీ కాదు. భారత ప్రజాస్వామ్య అనివార్య క్షీణత, పతనానికి అదొక చరమ బిందువు కాదు. ఈ ప్రజాస్వామ్య బంధనానికి దోహదం చేసిన పరిస్థితులను మన స్వాతంత్ర్యానంతర చరిత్ర తీర్చి దిద్దింది. అయితే అదేమీ అనివార్యమైనది కాదు. గుర్తుపెట్టుకోవలసిన విషయమేమిటంటే రాజకీయ వేత్తలు అందరూ చేసేదాన్నే నరేంద్ర మోదీ కూడా చేశారు. ఒక కష్టసాధ్యమైన అవకాశాన్ని ఉపయోగించుకుని, దాన్ని తన వ్యక్తిగత విజయంగా మార్చుకోవడంలో ఆయన సఫలమయ్యారు. అదే సమయంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్మాణాత్మకమైన బలహీనతలూ ఈ ప్రజాస్వామ్య బంధనం, అంటే మోదీ విజయానికి తోడ్పడ్డాయి.

మంగళకరమైన ‘వాస్తు’తో నిర్మాణమైన సంసద్ కొత్త భవనంలో కొలువుదీరనున్న మన పార్లమెంటేరియన్లలో ఒక కొత్త వివేకం ఉదయిస్తుందని ఆశిద్దాం. పార్లమెంటు ఉద్ఘాటించనున్న సత్యమేమిటి? 75 సంవత్సరాల మన పార్లమెంటరీ ప్రస్థానం మన సొంత యాత్ర. ఐరోపా జీవిత చరిత్రను గానీ, ఆత్మకథను గానీ మనం పునర్జీవించడం లేదు. పురాతన భారతీయ గణరాజ్యాల అసంపూర్ణ యాత్రను మనం పునః ప్రారంభించలేదు. మన ప్రజాస్వామ్య సాహసం పూర్తిగా స్వేచ్ఛాయుతమైనది. దానికొక ప్రస్థాన బిందువు లేదు. ఒక గమ్యాన్ని చేరడానికి ముందుగా నిర్ణయించుకున్న నిశ్చిత మార్గమేమీ లేదు. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు, మన చిరంతన నాగరికత వివేకశీల మార్గదర్శకత్వంలో మనం ప్రస్థానిస్తున్నాం. ఈ యాత్రలో ముందుకు సాగుతున్నకొద్దీ మార్గాన్ని అనుకూలంగా తీర్చిదిద్దుకుంటున్నాం. చాలా అగాధాలను అధిగమించాం. అనేక ప్రమాదకరమైన మలుపులు తిరిగాం. జడత్వం ఆవరించేందకు అనుమతిచ్చాం. జర్రున జారిపోయే ఏటవాలు ప్రాంతాలూ దాటాము. స్వయంగా హాని చేసుకున్నాం. దేశానికి కీడు చేశాం. మన ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యేతర శక్తులకు బందీ కావడంలో మన బాధ్యతను అంగీకరించాం. భారత ప్రజలమైన మనం సార్వభౌమిక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక భారత గణతంత్ర రాజ్యాన్ని పునరుద్ధరించుకునేందుకు కృతనిశ్చయులమయ్యాము. నమ్మశక్యంకాని విధంగా ఉన్నదా? నాకైతే లేదు. సరికొత్త బాలీవుడ్ సినిమా ‘జవాన్’ను చూశాను. కల్పనలలోని సత్యాన్ని చదవడాన్ని నేర్చుకుంటున్నాను.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Updated Date - 2023-09-15T00:55:30+05:30 IST