ఇది 75 ఏళ్ల పాలస్తీనా గాయం

ABN , First Publish Date - 2023-10-12T02:16:10+05:30 IST

గాజాను కేంద్రంగా చేసుకొని ఇజ్రాయెల్‌పై హమాస్ ఏకకాలంలో సముద్ర, వాయు, భూతల మార్గాలలో దాడిచేసింది. గాజా ప్రపంచంలోనే పెద్ద ఆరుబయలు జైలుగా పేరొందింది...

ఇది 75 ఏళ్ల పాలస్తీనా గాయం

గాజాను కేంద్రంగా చేసుకొని ఇజ్రాయెల్‌పై హమాస్ ఏకకాలంలో సముద్ర, వాయు, భూతల మార్గాలలో దాడిచేసింది. గాజా ప్రపంచంలోనే పెద్ద ఆరుబయలు జైలుగా పేరొందింది. ఇజ్రాయెల్ ఆధీనంలోని పాలస్తీనాలో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం పోగా 365 చ.కి.మీ. విస్తీర్ణంతో మండలం కంటే చిన్నదే గాజా ప్రాంతం. అందువల్ల ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఈజిప్టు, సిరియా, జోర్డాన్, లెబనాన్, ఇరాక్, పాలస్తీనా ఒక్కటిగా 1973 అక్టోబర్ 6వ తేదీన ఇజ్రాయెల్‌పై యుద్ధం చేశాయి. ఆరురోజుల్లో ఇజ్రాయెల్ వాటిని ఓడించింది. యాభైయేళ్ల తర్వాత అదే అక్టోబర్ నెలలో 7వ తేదీన హమాస్‌ దాడి జరిగింది. అప్పటికీ ఇప్పటికీ తేడా ఉంది. అది ఆరు దేశాల యుద్ధం. ఇది తన దేశంలోని ఓ ప్రాంత రాజ్యరహిత తిరుగుబాటు సంస్థ చేపట్టిన దాడి. అప్పుడు ఆరు స్వతంత్ర అరబ్ దేశాల్ని ఓడించిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఓ తిరుగుబాటు సంస్థ చేతిలో ఉక్కిరిబిక్కిరవుతోంది. హమాస్ దాడులలో క్షిపణులు ఒక భాగమే. వాటికంటే, వేలమంది యువత భాగస్వామ్యం ప్రధానం. విద్యుత్ ముళ్ల కంచెల సరిహద్దు గోడల్ని ఛేదించి ఇజ్రాయెల్ సైనిక రాజ్యంలో చొరబడి దూసుకెళ్లడం అత్యంత సాహసోపేతమైనది. అది ప్రాణార్పణ, త్యాగనిరతి లేకుండా చేయగలిగేది కాదు. గాజా ప్రాంతాన్ని 15 ఏళ్లుగా పాలిస్తున్న హమాస్ వెనక వేలాది యువత ప్రాణార్పణలకు సిద్ధపడే స్థితి ఎలా సాధ్యమైంది?

పాలస్తీనా వివాదం మొదలై మూడు తరాలు గడిచింది. నేడు జీవించేది నాలుగో తరం. తమ ముత్తాతల, తాతల, తండ్రుల తరాలు కోల్పోయిన జీవితం నేటి తరాన్ని సాహసిక జాతిగా మార్చింది. తమ స్వంత నేల మీద జీవించే హక్కు లేకుండా తరమబడుతున్న దుస్థితి ఏ మతం వారినైనా ముమ్మాటికీ ఒక సాహసిక జాతిగా తీర్చిదిద్దుతుంది. నాజీ నరమేధానికి బలైన యూదుల పట్ల ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తిన నేపథ్యంలో తమకో ప్రత్యేక దేశం కావాలని యూదుల్లో కోరిక తలెత్తింది. అమెరికా, యుఎఎస్‌ఎస్‌ఆర్‌ సహాయంతో ఐక్యరాజ్యసమితిలో ప్రత్యేక ఇజ్రాయెల్ రాజ్య స్థాపన యత్నం జరిగింది. అరబ్ దేశాలు, భారత్ వంటి దేశాలు దాన్ని వ్యతిరేకించాయి. ఆనాటి 56 సభ్యరాజ్యాల్లో ఇజ్రాయెల్ ఏర్పాటుకి అవసరమైన మెజారిటీ లేదన్న అనుమానంతో లాబీయింగ్ కోసం అమెరికా మూడు రోజులు ఓటింగ్‌ వాయిదా వేయించిందనే ఆరోపణ ఉంది. ఆ సందర్భంగా భారత ప్రధాని నెహ్రూ యూదు లాబీ ప్రలోభాలు, వత్తిళ్లపై ఆరోపించారు. ఐరాసలో భారతదేశ ప్రతినిధి విజయలక్ష్మి పండిట్‌కు బెదిరింపులు వచ్చాయని కూడా ఆరోపణ చేశారు. ఎట్టకేలకు 1947 నవంబర్ 29న 33 దేశాల మద్దతుతో ఐరాస తీర్మానం ఆమోదం పొందింది. ఇండియా సహా 13 దేశాలు వ్యతిరేకంగా, 10 దేశాలు తటస్థంగా ఓటింగ్ చేశాయి. ఒక్క పాలస్తీనా దేశాన్ని ‘ద్విరాజ్య పరిష్కారం’ పేరిట రెండు దేశాలుగా విడగొట్టే తీర్మానమది. 76 ఏళ్ల తర్వాత నేడు అది కనీసంగా అమలు కావడం లేదు.

ఆరురోజుల యుద్ధం విరమణ తర్వాత -1967లో భద్రతా సమితిలో 242వ తీర్మానం ఏకగ్రీవ ఆమోదం పొందింది. దాని ప్రకారం పాలస్తీనా భూభాగాల నుండి ఇజ్రాయెల్ దురాక్రమణ సేనలు వెంటనే వెనక్కి వెళ్ళాలి. నేటికి 56 ఏళ్లు గడిచినా ఇజ్రాయెల్‌ దానిని అమలు చేయలేదు. ఈ యుద్ధం ముగిశాక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ ప్రకారం -1973 అక్టోబర్‌లో భద్రతా సమితి 338వ తీర్మానాన్ని ఆమోదించింది. ఐదు శాశ్వత సభ్యత్వ దేశాలు సహా 14 దేశాలు దీనిని ఆమోదించాయి. పైగా అమెరికా, సోవియట్‌ యూనియన్‌ ఉమ్మడి ప్రతిపాదిత తీర్మానమది. నేటికి సరిగ్గా యాభైయేళ్ళు గడిచినా ఇజ్రాయెల్ దానిని అమలు చేయలేదు. సుదీర్ఘంగా సాగిన రెండవ ఇంతిఫాదా తదనంతరం ఇరుపక్షాలను యుద్ధ విరమణ కోరుతూ-2002లో 1397వ తీర్మానాన్ని 14 దేశాలు ఆమోదించాయి. అయినా, ఇజ్రాయెల్ అమలు చేయలేదు. 1991 మాడ్రిడ్ సభ, 1993 ఓస్లో ఒడంబడిక సూత్రాల్ని ఇజ్రాయెల్ పాటించలేదు. జెనీవా స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్ళింది. రెండవ ఓస్లో ఒప్పంద క్రమంలో భద్రతా సమితి -2003లో తిరిగి చర్చని చేపట్టింది. ఈసారి 15 దేశాల ఏకగ్రీవ ఆమోదం ఉంది. అది కూడా పాత తీర్మానాల్ని ఇజ్రాయెల్ అమలు చేయాలని చెప్పింది. దాని గతి కూడా అంతే. పోనీ అంతవరకూ ఫతా హయాంలో జరిగిందని అనుకుందాం. ఆనాటికి పాలనా పగ్గాలు హమాస్ చేపట్టలేదు. ఇజ్రాయెల్ చేత మూడు భాగాలుగా విడగొట్టబడ్డ పాలస్తీనాలో ఒక భాగమే గాజా. ఓస్లో ఒప్పందం ప్రకారం గాజా ప్రాంత ఎన్నికల్లో హమాస్ 2007 లో గెలిచింది. హమాస్‌తో చర్చల ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ భీష్మించింది. నెలలపాటు ప్రతిష్టంభన సాగింది. అంతర్జాతీయ దౌత్య ఫలితంగా హమాస్ అధికారం చేపట్టింది. ఆ తర్వాత కూడా తీర్మానాలు జరుగుతూనే ఉన్నాయి, ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తూనే ఉంది. -2008లో భద్రతా సమితి ద్విరాజ్య తీర్మానం అమలును కోరుతూ మరో తీర్మానాన్ని ఆమోదించింది. 15 ఏళ్ళు గడిచినా, ఇజ్రాయెల్ అమలు చేయడం లేదు. అమెరికా, పశ్చిమ దేశాలు పైతీర్మానాలకు అనుకూలంగా ఓటింగ్ చేస్తుంటాయి. వాటిని బేఖాతరు చేస్తున్న ఇజ్రాయెల్‌పై వత్తిడి మాత్రం తీసుకురావు. దాంతో దౌత్యబంధం తెంచుకోవు. ఈ నేపథ్యంలో, ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిఘటన అనివార్యమౌతుంది. అదే మొన్న జరిగింది.

1947 ఐరాస సాధారణ సభ ప్రతిపాదించిన ద్విరాజ్య పరిష్కార తీర్మానం మీద అరబ్బు దేశాలు, భారత్ వంటి దేశాలు వ్యతిరేకంగా ఓటింగ్ చేశాయి. యూదులు, అమెరికా నాడు ద్విరాజ్య వాదన చేశాయి. నేడు అదే ‘ద్విరాజ్య విధానం’ అమలు కావాలని ఫతా సహా అరబ్బు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆచరణలో ఇజ్రాయిల్ ఏకరాజ్య విధానాన్ని అమలు చేస్తోంది.

)


ఇజ్రాయెల్ ఏకరాజ్య విధానానికి ప్రతీకారంగా బలపడి స్థిరపడిందే హమాస్ ఏకరాజ్య విధానం. అయితే, ఇటీవల హమాస్ ప్రతినిధి ఓ రహస్య ప్రదేశం నుండి ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాము సూత్రరీత్యా ఏకరాజ్య విధానానికి కట్టుబడి ఉన్నామనీ, ఇజ్రాయెల్ తన నడమంత్రపు ఏకరాజ్య విధానాన్ని వదులుకొని భద్రతాసమితి తీర్మానాలకు అనుగుణంగా ఆచరణలో ద్విరాజ్య విధానం అవలంబించిన తర్వాత తమ వైఖరి చెబుతామని ఓ మాటన్నాడు. అంటే, ఇజ్రాయెల్ తన పూర్వ ద్విరాజ్య వైఖరికి కట్టుబడి, ఆచరణలో పాలస్తీనా స్వతంత్ర దేశ మనుగడకి అంగీకరిస్తే, హమాస్ కూడా తన పూర్వ ఏకరాజ్య వైఖరి విడనాడి ద్విరాజ్య వైఖరి చేపట్టే అవకాశం ఉందని అర్థం.

1947 ముందు ఉన్న పాలస్తీనా దేశాన్ని రెండుగా విడగొట్టి ఒక భాగం ఇజ్రాయెల్‌గా ఏర్పరిచి, ఇటు పాత పాలస్తీనా, అటు కొత్త ఇజ్రాయెల్ సహజీవనం చేయాలని ఐరాస తీర్మానం 181 చెప్పింది. దానిని అరబ్ దేశాలు వ్యతిరేకించి పాలస్తీనా దేశంలో యూదులకు నివాస అవకాశాలు ఉండాలన్నాయి. ‘ఓకే రాజ్యం- రెండు జాతులు’ విధానమది. ‘మీ పాలస్తీనాతో మా ఇజ్రాయెల్ ఒక దేశం’గా సహజీవనం చేస్తుందని 75 ఏళ్ల క్రితం యూదుల వాదన. అది 181 ప్రకారం ‘ద్విరాజ్య వాదన!’.

ఓస్లో చర్చల ప్రక్రియ అరాఫత్ నేతృత్వంలోని ఫతా సంస్థని తన పూర్వ ఏకరాజ్య వైఖరికి స్వస్తి పలికించాయి. 181కి కట్టుబడి ‘ద్విరాజ్య’ విధానానికి మారింది. అది ఆచరణలో కార్యరూపం ధరించి ఉంటే హమాస్ పుట్టేది కాదేమో! అంటే ఇజ్రాయెల్‌పై తాజా దాడులు జరిగివుండేవి కాదేమో! కానీ, ఓస్లో ఒప్పందం ఒకనాటి పాలస్తీనా జాతి హీరో అరాఫత్‌ని జీరో చేసింది. హమాస్ సంస్థని పుట్టించి ప్రబల రాజకీయ శక్తిగా మార్చింది. ఏదీ గాలి నుంచి ఊడిపడదు. నేటి పరిణామానికి మూలకారణం ఐరాస తీర్మానాలు అమలు కాకపోవడం. మొదట 242, 338, 1397, 1515 నెంబర్ తీర్మానాలను ఇజ్రాయెల్‌తో అమలు చేయించడం ప్రపంచ దేశాల బాధ్యత. అదేమీ జరగకుండా హమాస్ ఒక టెర్రరిస్టు సంస్థ అని నిందిస్తూ, గాజాని ధ్వంసం చేస్తే ఫలితం ఉండదు. ఒక జాతి తరాలుగా ఇళ్లు వాకిళ్ళు కోల్పోయి, 75 ఏళ్ల నుండి నెత్తురోడుతున్న దృశ్యాన్ని విస్మరించి, ఇంకోవైపు భారీ పబ్లిసిటీ పొందుతున్న కేవలం ఒకరోజు నెత్తుటి దృశ్యాన్ని మాత్రమే చూసి స్పందించడం సరికాదు. పాలస్తీనా జాతీయులైనా, యూదు జాతీయులైనా ప్రజలు ప్రజలే. ఏ ప్రజలైనా ఒకటే.

పి. ప్రసాద్‌

(ఇఫ్టూ

Updated Date - 2023-10-12T02:16:10+05:30 IST