మహిళా కోటాతో బీసీ సీట్లకు ముప్పు!

ABN , First Publish Date - 2023-09-26T02:39:08+05:30 IST

ఎట్టకేలకు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన 108వ రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంటు ఆమోదించింది. బిల్లు చట్ట రూపం దాల్చింది. అయితే ఈ చట్టం 2026లో...

మహిళా కోటాతో బీసీ సీట్లకు ముప్పు!

ఎట్టకేలకు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన 108వ రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంటు ఆమోదించింది. బిల్లు చట్ట రూపం దాల్చింది. అయితే ఈ చట్టం 2026లో దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తర్వాత అమల్లోకి రానున్నది. ఆ ప్రక్రియ జనాభా గణన తర్వాత ప్రారంభం కానున్నది. ఈ గణన 2024లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా జరగనున్నది. లెక్కలు సేకరించినా దాని టాబ్యులేషన్‌కు మరో రెండేళ్లు పట్టనున్నది. అంటే 2028లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే అవకాశం లేదు. అందుకే దీన్ని కాంగ్రెస్‌ పార్టీ ‘పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌’తో పోల్చింది.

అంతేగాదు ఈ బిల్లులో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పార్లమెంటులో సోనియా గాంధీ, బయట రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేసిండ్రు. అయితే వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు మద్దతిచ్చినా ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు నిర్ద్వందంగా నిరాకరించారు. ఈ పరిస్థితుల్లో అన్నీ సవ్యంగా సాగితే 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే అవకాశమున్నది. ఈ రిజర్వేషన్ల వల్ల ‘దొరల’ స్థానంలో ‘దొరసానులు’ రావడం తప్ప బీసీ మహిళలకు ఎలాంటి మేలు జరగబోదు. మీదు మిక్కిలి అంతో ఇంతో పేరు ప్రఖ్యాతులున్న బీసీ పురుష ఎమ్మెల్యేల సీటు పోయే ప్రమాదమున్నది. ఈ విషయాల గురించి అవగాహన రావాలంటే కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి.

1952 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌/ ఆంధ్రప్రదేశ్‌/ తెలంగాణ అసెంబ్లీలకు కలిపి మొత్తం 15 సార్లు సాధారణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో 1957, 1967, 1978, 1983, 1985, 1989, 1994, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం నుంచి ఒక్కరంటే ఒక్క బీసీ మహిళ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. తెలంగాణ నియోజకవర్గాల నుంచి 1952 నుంచి 2018 మధ్య కాలంలో మొత్తం 1622 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో అడుగు పెట్టిండ్రు. ఇందులో 90 మంది మహిళలు కాగా అందులో కేవలం ఏడుగురు మాత్రమే బీసీ మహిళలున్నారు. ఇందులోనూ పద్మశాలి కులంలో పుట్టి మున్నూరుకాపు అతణ్ణి వివాహమాడిన కొండా సురేఖ 1999, 2004, 2009, 2014ల్లో విజేతగా నిలిచింది. అంటే ఏడింటిలో నాలుగుసార్లు ఆమె గెలిచిందని చెప్పవచ్చు. అంతకు ముందు 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్‌ జిల్లా బాన్స్‌వాడ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున యాదవ సామాజిక వర్గానికి చెందిన సంగెం లక్ష్మీబాయమ్మ గెలుపొందింది. ఆమె బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసింది. ఆ తర్వాత 1962లో కమ్యూనిస్టు పార్టీ తరపున తెలంగాణ పోరాటయోధుడు కేవల్‌ కిషన్‌ భార్య ముదిరాజ్‌ కులానికి చెందిన ఆనందిబాయి మెదక్‌ నియోజకవర్గం నుంచి విజేతగా నిలిచింది. దొరలకు వ్యతిరేకంగా కొట్లాడినందుకు కేవల్‌ కిషన్‌ని హత్య చేసిండ్రు. ఇట్లా హత్యకు గురైన ఆయన పేరిట ఇప్పటికీ నర్సాపూర్‌ దగ్గర ప్రజలు గుడికట్టి రోజూ పూజిస్తున్నారు. అట్లాగే 1972లో నల్లగొండ జిల్లా నకిరేకల్‌ నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన ముసపోత కమలమ్మ కాంగ్రెస్‌ పార్టీ తరఫున అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఈ ముగ్గురు మహిళలు ఒక్కొక్కసారి విజేతలుగా నిలిచారు. కొండా సురేఖ నాలుగుసార్లు గెలుపొందింది. ఇట్లా ఏడుసార్లు మొత్తం నలుగురు బీసీ మహిళలు తెలంగాణ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.


ఈ నలుగురు మహిళలు తప్ప ఇంతవరకు తెలంగాణ నుంచి ఏ ఒక్క బీసీ మహిళ కూడా అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. ఇందులో ఉపఎన్నికలను పరిగణనలోకి తీసుకోలేదు. నిజామాబాద్‌ నుంచి ఒక ఉపఎన్నికలో ఆకుల లలిత ఒకసారి విజేతగా నిలిచింది. అదే సమయంలో ముస్లిం మహిళలు, పార్సి, క్రిస్టియన్‌ మహిళలు సైతం జనరల్‌ నియోజకవర్గాల నుంచి విజేతలుగా నిలిచారు. 1952, 1957 ఎన్నికల్లో మాసూమా బేగమ్, షాజహానా బేగమ్ కాంగ్రెస్‌ పార్టీ తరపున విజేతలుగా నిలిచారు. మాసూమా బేగమ్ మంత్రిగా కూడా పనిచేశారు. 1962లో రోడా మిస్త్రి జూబిలీహిల్స్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచారు. 1989లో మేరి రవీంద్రనాథ్‌ సికింద్రాబాద్‌ నుంచి గెలుపొందారు. అట్లాగే ఒక్క 1983, 1994 మినహా మిగతా ప్రతి ఎన్నికల్లో కనీసం ఒక్క ఎస్సీ మహిళ అయినా అసెంబ్లీలో అడుగు పెట్టింది. 1985, 1994 ఎన్నికల్లో తెలంగాణ నుంచి కేవలం ఒకే ఒక్క మహిళ విజేతగా నిలిచింది. అత్యధికంగా 2009లో 16మంది మహిళలు గెలుపొందారు. ఇందులో మొత్తం 21సార్లు ఎస్సీ మహిళలు అసెంబ్లీలో తెలంగాణ నుంచి ఎన్నికయిండ్రు. అట్లాగే పదిసార్లు ఎస్టీ మహిళలు విజేతలుగా నిలిచారు. అత్యధికంగా 1972, 2004 సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురేసి ఎస్సీ మహిళలు గెలుపొందారు. 1972లో మేడ్చల్‌ నుంచి సుమిత్రాబాయి, ఎల్లారెడ్డి నుంచి జె. ఈశ్వరీబాయి, నుస్తులాపూర్‌ నుంచి ప్రేమలతాదేవి గెలుపొందారు. 2004లో గజ్వెల్‌ నుంచి ఈశ్వరీబాయి కూతురు జె. గీతారెడ్డి, అసిఫాబాద్‌ నుంచి ఎ. శ్రీదేవి, పరకాల నుంచి బండారు శారారాణి విజేతలుగా నిలిచారు. అట్లాగే అత్యధికంగా ఆరుగురు ఎస్టీ మహిళలు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలుగా నిలిచారు. వీరిలో సుమన్‌ రాథోడ్‌ (ఖానాపూర్‌), సత్యవతి రాథోడ్‌ (డోర్నకల్‌), మాలోత్‌ కవిత (మహబూబాబాద్‌), ధనసరి అనసూయ (సీతక్క) (ములుగు), చంద్రావతి భానోత్‌ (వైరా), కుంజా సత్యవతి (భద్రాచలం)లు విజేతలుగా నిలిచారు. ఇట్లా ఏ లెక్కన చూసుకున్నా బీసీ మహిళల ప్రాతినిధ్యం కనిష్ఠంగా ఉన్నది.

ఓబీసీ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించక పోవడంతో వారి ప్రాతినిధ్యానికి శాశ్వతంగా దారులు మూసుకుపోయే ప్రమాదమున్నది. ఇప్పటికే స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం 18శాతానికి కుదించింది. దీని ద్వారా కొన్ని వేల మంది బీసీలు జెడ్పీటీసీలు, ఎంపిటీసీలు, సర్పంచులు కాకుండా పోయిండ్రు.

భవిష్యత్‌లో బలమైన ఓబీసీ నాయకులు సైతం అసెంబ్లీలో అడుగుపెట్టడం కష్టం కానున్నది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని ఉమ్మడి జిల్లా హెడ్‌క్వార్టర్‌ నియోజకవర్గాల్లో ఓబీసీలు బలంగా ఉన్నారు. దానికి నిజామాబాద్‌లో ఇప్పటికే బిగాల గణేశ్‌ గుప్తా రూపంలో గండి పడింది. అట్లాగే ఏండ్లుగా బీసీల కంచుకోటగా ఉన్నటువంటి సికింద్రాబాద్‌ పార్లమెంటు స్థానం కిషన్‌రెడ్డి రూపంలో ఓసీలు కైవసం చేసుకున్నారు. ఇదే వరుసలో అనేక మంది బీసీల కోటలు కూలనున్నాయి. భవిష్యత్‌లో గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పద్మారావు గౌడ్‌ తదితరుల నియోజకవర్గాలు మహిళలకు రిజర్వయినట్లయితే వాళ్ళు చట్టసభలకు ఎన్నిక కావాలంటే పక్క నియోజకవర్గాలు వెతుక్కోవాల్సి ఉంటుంది. అట్లా వెతుక్కునే సందర్భంలో ఇప్పటివరకు స్థానికంగా ఉన్న బలం ఇతర ప్రాంతాల్లో ప్రదర్శించడం కష్టం. ఈ నిబంధన అన్ని కులాల వారికి వర్తించినా సమస్య మాత్రం బీసీలకే ఎదురవుతుంది. ఆధిపత్య కులాలకు చెందిన అభ్యర్థులు తమ ప్రస్తుత నియోజకవర్గంలో తమ మహిళా బంధువులను పోటీలోకి దింపి తాము పక్కన మరో చోట పోటీ చేయడానికి అవకాశమున్నది. గతంలో సీతా దయాకర్‌ రెడ్డి ఆమె భర్త దయాకర్‌ రెడ్డి, ఎన్‌.పద్మావతి రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలు గెలుపొందారు. అదే పరిస్థితి బీసీలకుండదు. వారి సీటు వారు కాపాడుకోవడం కోసమే నిత్యం పరమపద సోపానం ఎక్కి దిగాల్సి వస్తది. అట్లాంటిది తమ మహిళా బంధువులకు ఒక సీటు, తమకు ఒక సీటు సాధించుకోవడం అసాధ్యమైన పని. ఓబీసీలకు ఎక్కువ అవకాశాలు కల్పించి ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పగబట్టినట్టు వ్యవహరిస్తున్నాయి. అట్లాంటిదే ఇటీవలి మహిళా రిజర్వేషన్‌ చట్టం. దీని ద్వారా బీజేపీ ప్రభుత్వం బీసీ మహిళల ప్రయోజనాలకు పెద్ద విఘాతం కలిగించింది. స్వయంగా తనకు తాను ఓబీసీగా ప్రకటించుకున్న నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఇట్లాంటి అమానుషమైన బిల్లు పాస్‌ కావడమంటే బీసీ స్త్రీలను రాజకీయంగా సమాధి చేయడమే!

బీజేపీ మతపరమైన విభజనకు కౌంటర్‌గా కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ చైతన్యాన్ని ప్రోది చేయాలని యోచిస్తున్నట్లు కనబడుతున్నది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు విషయంలో బీజేపీ కచ్చితంగా బీసీలకు అన్యాయం చేసింది. ఈ అన్యాయాన్ని తాము అధికారంలోకి వస్తే సరిదిద్దుతామని, బిల్లుని సవరించి ఓబీసీ మహిళలకు ‘కోటాలో వాటా’ ఇస్తామని తమ మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ పెట్టాలి. గతంలో మాదిరిగా గాకుండా మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాన్ని తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా అమలు చేయడానికి కృషి చేయాలి.

డా. సంగిశెట్టి శ్రీనివాస్‌

Updated Date - 2023-09-26T02:39:08+05:30 IST