తలకిందులైన కుకీల బతుకులు
ABN , First Publish Date - 2023-09-28T01:06:13+05:30 IST
దిమ్మాపూర్ (ఇది నాగాలాండ్‌లో ఉన్న ఏకైక ఎయిర్‌పోర్టు) నుంచి వయా మావువా, సేనాపతి మీదుగా మణిపూర్ కాంగ్‌కోపి జిల్లాలోని జాతుల ఘర్షణలో నిరాశ్రయులయినవారి సహాయక శిబిరాలకు...
దిమ్మాపూర్ (ఇది నాగాలాండ్‌లో ఉన్న ఏకైక ఎయిర్‌పోర్టు) నుంచి వయా మావువా, సేనాపతి మీదుగా మణిపూర్ కాంగ్‌కోపి జిల్లాలోని జాతుల ఘర్షణలో నిరాశ్రయులయినవారి సహాయక శిబిరాలకు వెళుతున్నప్పుడు పైనాపిల్ వాసన మనల్ని కట్టేస్తుంది. కొండలలో ప్రయాణం, ఏదో మాయలో పడేసినట్టు వారి అస్తిత్వంలోకి లాక్కునిపోయే ఆదివాసుల పలకరింపు.... మేము నడిచినంత మేర వారి ఆవేదనలు, ఆక్రందనలు వినిపిస్తూనే ఉన్నాయి. మణిపూర్ లోయలో మైతేయిల వల్ల 5వేల ఇళ్లు దగ్ధమయ్యాయి. 400 చర్చిలు కూల్చబడ్డాయి. మైతేయిల దౌష్ట్యానికి గురైన కుకి–జో జనసమూహం నేడు ప్రభుత్వం, చర్చి నిర్వహిస్తున్న శిబిరాలలో తల దాచుకున్నది. మేము వెళ్లింది కొన్ని శిబిరాలే అయినా వారి అధ్వాన్నమైన జీవనగతులు మా మనసుల్ని కదిలించి వేశాయి. సుమారు 70వేల మంది ప్రజలు, 10వేల మంది పిల్లలు నాలుగు వందల శిబిరాల్లో ఉన్నారు. కొంతమంది స్త్రీలు పిల్లల ఆహారం కోసం తమ రక్తాన్ని అమ్ముకున్నారు. నాప్‌కిన్‌ను నీళ్లలో ముంచి ఆహారంగా పిల్లలకు ఇవ్వడం చూశాం. మందులు, సరైన వైద్యం లేక చాంద్‌చురాపుర్‌లో ముప్పై అయిదు మంది, కాంగ్‌కోపీలో పదిమంది చనిపోయారు.
ఇక్కడ ఒక్కో కుటుంబానికి ఒక్కో కథ ఉంది. భయానక దాడులు, దురాగతాల నుంచి ఎలా బయటపడిందీ వీరు చెబుతుంటే మనకు 2000 సంవత్సరం నాటి గుజరాత్ మతోన్మాద అల్లర్ల కథలు గుర్తుకు వస్తాయి. అత్యాచారానికి గురైన ఒక బాలిక తల్లి మాటల్లో చెప్పాలంటే అది ఒక చావు దెబ్బ. అయితే ఎప్పటికైనా తిరిగి వెళ్తామనే ఆశ వాళ్లలో ఇంకా మిగిలే ఉంది. స్త్రీలను, ఆడపిల్లలను శిబిరాలకు పంపి, బంకర్లు ఏర్పాటు చేసుకొని, ఆస్తులు కాపాడుకోవడానికి ఇంకా కొంతమంది కుకీలు మణిపూర్ ప్రాంతంలో ఉండిపోయారు.
ఈ సహాయక శిబిరాలు దర్శించిన డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్‌మెంట్ నిజ నిర్ధారణ బృందం కథనాల ప్రకారం కుకీలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లోని శిబిరాలలో కనీసం సరైన నీటి వసతి, మరుగుదొడ్లు లేవు. ఒక పెద్ద చావిడిలో కొంత మరుగు కూడా లేకుండా గుంపులుగా సహజీవనం చేస్తున్నారు. కాంగ్‌కోపి జిల్లా వైద్యశాలలో కూడా మౌలిక సదుపాయాలు, శస్త్ర చికిత్సకు సౌకర్యాలు లేవు. గర్భిణీలు, రోగగ్రస్తులకు అత్యవసర పరిస్థితి ఏర్పడితే నాగాలాండ్‌లోని కోహిమా, దిమ్మాపూర్‌కు తరలించవలసిందే. కొండలలో ప్రయాణించాలంటే సుమారు ఎనిమిది గంటలకు పైగా పడుతుంది. పాలిచ్చే తల్లులకు అదనపు ఆహారం అందడం లేదు. కొంత మంది తల్లులు అన్నం మెతుకులను మెదిపి జావ చేసి నెలల పిల్లలకు ఇస్తున్నారు. వ్యాక్సిన్ సరఫరా కుంటుపడి పిల్లలకు వ్యాక్సిన్ డోస్‌లు ఆగిపోవడం చేత అనేక వ్యాధులకు గురవుతున్నారు.
సహాయక శిబిరాలని నిర్వహిస్తున్న చర్చి ప్రతినిధి చెప్పినదాని ప్రకారం ఇళ్లు కోల్పోయిన వారు, హింసకు గురైన వారు, ముఖ్యంగా అత్యాచారానికి గురైన వారి మానసిక స్థితి దుర్భరంగా ఉంది. పిల్లలు సరైన తిండి లేక, చదువుకు, ఆటపాటలకు దూరమై అంతులేని నైరాశ్యానికి గురవుతున్నారు. ఒక నర్సింగ్ క్యాంప్ సందర్శించినప్పుడు ఆడపిల్లలు తమ భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని కోల్పోయినట్టు కనిపించారు. తమ పుస్తకాలు, సర్టిఫికెట్లు అన్నీ పోగొట్టుకొని వారు ఆ శిబిరానికి వచ్చారు. కొంతమందికి తల్లిదండ్రుల జాడ కూడా తెలియదు. ‘భారతీయులుగా మేము ఎందుకు గుర్తింపబడటం లేదన్నదే’ వారి ప్రశ్న.
దేశం నలుమూలల నుంచి వచ్చిన చర్చి సంఘాలు, లేదా ప్రభుత్వ సంస్థలు కనీస ఖర్చులకై కుకీలకు ఎంతో కొంత డబ్బు అవసరం ఉంటుందనే విషయాన్ని గుర్తించటమే లేదు. పైగా ఒక అడుగు ముందుకు వేసి వారి చేతికి డబ్బు ఇస్తే ఆయుధాలు కొంటారనే గట్టి నమ్మకంతో ఉన్నారు. కుకీ జాతి పోరాడే జాతి, వారి మిలిటెంట్ల వద్ద ఆయుధాలు ఉన్నాయి అన్నది కూడా సత్యమే. కానీ కడు దీనస్థితిలో ఉన్న వారిని చూసి ‘నిందలు’ వేసే వారి గురించి ఏమనాలి? చర్చికి ఉన్న పరిమితుల వలన వారి సహాయక చర్యలు బాధితులకు సరిపోవు. ఎక్కువ సహాయం చేసినా మళ్లీ చర్చిపై నిఘా పెరుగుతుందనే భావన ఉంది.
వివిధ గ్రూపులకు చెందిన క్రైస్తవ సంఘాలు కోరేది ఒకటే. రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం తమ మత హక్కు విచ్ఛిన్నం కాకూడదని, కూల్చబడిన తమ చర్చిలను ప్రభుత్వం తిరిగి నిర్మించాలని కోరుతున్నారు. దేశంలో బహుళ మతాలు సహజీవనం చేయాలని నమ్ముతున్నారు. తమ జాతులను (కుకి, నాగ) వెలివేయడం లోయ ప్రాంతం నుంచి ఇక ముందు జరగకూడదని డిమాండ్ చేస్తున్నారు. మాదక ద్రవ్యాల పంపిణీదారులుగా ప్రభుత్వమూ, మైతేయిలూ కలిసి తమపై ముద్ర వేయిస్తున్నారని, నిజానికి తామున్న ఈ పరిస్థితికి మైతేయిలతో సహా అందరి బాధ్యతా ఉందని కుకీలు చెబుతున్నారు. మణిపూర్ సంఘర్షణలు మమ్మల్ని భౌతికంగా విడగొట్టడంతో పాటు భౌగోళికంగా వేరు చేసాయని, కాబట్టి మాకు స్వయం పాలన నిర్ణయాధికారం కావాలని, అందులో ఇంఫాల్ జోక్యం ఉండకూడదని ఆకాంక్షిస్తున్నారు. అన్నిటికంటే మించి సహాయ శిబిరాలు కాక శాశ్వత పరిష్కారాలు కావాలని తమకు తమ అటవీ, ఆవాసం ముఖ్యమైనవి అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రజాస్వామ్యవాదుల మద్దతు కోరుతున్నారు. పెట్టుబడితో కలగలిసిపోయి దేశాన్ని పాలిస్తున్న శక్తులు ఏ మేరకు నిబద్ధతతో ఇక్కడ ప్రజాస్వామిక విలువలను కాపాడుతాయే వేచి చూడవల్సిందే.
హేమలలిత
న్యాయవాది, సామాజిక కార్యకర్త