ఇంతలో ఎంత మార్పు!

ABN , First Publish Date - 2023-02-16T01:22:01+05:30 IST

ఏడుదశాబ్దాలపాటు ప్రభుత్వ రంగంలో ఉంటూ, అధికారిక విమానయాన సంస్థగా కొనసాగిన ఎయిర్‌ ఇండియాను మోదీ ప్రభుత్వం టాటాలకు అమ్మేసి ఏడాది గడిచింది...

ఇంతలో ఎంత మార్పు!

ఏడుదశాబ్దాలపాటు ప్రభుత్వ రంగంలో ఉంటూ, అధికారిక విమానయాన సంస్థగా కొనసాగిన ఎయిర్‌ ఇండియాను మోదీ ప్రభుత్వం టాటాలకు అమ్మేసి ఏడాది గడిచింది. నష్టదాయక సంస్థ అనీ, తెల్ల ఏనుగనీ, పునరుద్ధరణ, పోషణ అసాధ్యమని చెప్పి కొంతవాటా కాదు, ఏకంగా తెగనమ్మాలని ప్రభుత్వం సంకల్పించిన రెండేళ్ళకు, పూర్వయజమాని టాటా చేతికి ఈ సంస్థ వెళ్ళిపోయింది. ఎయిర్‌ ఇండియాను టాటాలకు ఇస్తే బాగుపడుతుంది అని అప్పట్లో మోంటెక్‌సింగ్‌ అహ్లువాలియా వంటి ఆర్థిక వేత్తలు కూడా వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో, చవుకగా అమ్మేశారన్న వాదనలు వెనక్కుపోయి, తిరిగి టాటాల చేతికే ఇది వచ్చినందుకు చాలామంది సంతోషించారు. ఇప్పుడు అదే సంస్థ ఏడాది తిరిగేసరికి ఆరున్నర లక్షలకోట్లు పెట్టి 470 కొత్తవిమానాలు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగిన సందర్భాన్ని మోదీ సర్కారు ఒక ప్రభుత్వ వేడుకలాగా నిర్వహించింది.

టాటాలకు అమ్మేయడం ద్వారా ప్రభుత్వానికి ఎంత లాభం చేకూరిందని అప్పట్లో విలేఖరులు ప్రశ్నించినప్పుడు, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వ హయాంలో ఆవిర్భవించిన ‘పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం’ (దీపం) కార్యదర్శి తుహిన్‌కాంత్‌ పాండే ఓ తెలివైన సమాధానం చెప్పారు. ఇకపై ప్రతిరోజూ ప్ర‌భుత్వానికి ఓ ఇరవైకోట్లు వృథాగా ధారపోయాల్సిన అవసరం లేకపోవడమే పెద్ద లాభమన్నారాయన. మొత్తం 18వేలకోట్ల విలువైన ఈ కొనుగోలులో పదిహేనుశాతం మాత్రమే ప్రభుత్వానికి నేరుగా చేరితే, సంస్థకున్న అరవైవేల కోట్ల రూపాయల రుణభారంలో నాలుగోవంతు మాత్రమే తాము తీర్చేట్టుగా టాటాలు ఎయిర్‌ ఇండియాను చేజిక్కించుకున్నారు. ఆ సంస్థ రియల్‌ఎస్టేట్‌ ఆస్తులను కొన్నింటిని అమ్మేయడం ద్వారా మిగతా డెబ్బైఐదుశాతం రుణభారాన్ని తీర్చడానికి ప్రభుత్వం సిద్ధపడింది.

ఇలా ప్రైవేటుకు పోతున్నప్పుడే, ఎయిర్‌ ఇండియాకు అప్పటికే ఉన్న 55 విదేశీమార్గాలు, ప్రపంచవ్యాప్తంగా దానికి ఉన్న వేలాది లాండింగ్‌, పార్కింగ్‌ వెసులుబాట్లు, దాదాపు నూటయాభైవిమానాలు కలగలిసి టాటాలకు అంతర్జాతీయ విమానరంగంలో అద్భుతమైన మేలు జరగబోతున్నదన్న అంచనాలున్నాయి. అనుకున్నట్టుగానే, ఈ ఏడాదికాలంలోనే ఉన్న విమానాలను గాడినపెట్టడం, సమస్తవ్యవస్థలను ప్రక్షా ళించి ఆధునికీకరించుకోవడం ద్వారా ఎయిర్‌ ఇండియా కొత్త ఉత్తేజాన్ని సమకూర్చుకుంది. ఇప్పుడు ప్రపంచచరిత్రలోనే అత్యంత భారీ ఒప్పందంతో వందలాది విమానాలను కొనుగోలు చేస్తున్నది. తమ ఎయిర్‌ బస్‌ ఎదిగిపోతున్నందుకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌, బోయింగ్‌ బాగుపడుతున్నందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, విడిభాగాల తయారీ కారణంగా తమదేశంలో డెర్బీనుంచి వేల్స్‌ వరకూ చాలాప్రాంతాలు వెలిగిపోతున్నందుకు బ్రిటన్‌ ప్రధాని సునాక్‌ ఎంతో సంతోషిస్తున్నారు. 44రాష్ట్రాల్లో 10లక్షల కొత్త ఉద్యోగాలను ఈ ఒప్పందం సృష్టిస్తుందనీ, డిగ్రీ కూడా చదవనివారికి ఉపాధి దక్కుతుందని అమెరికా అధ్యక్షుడు మురిసిపోతున్నారు. మంచివేతనాలతో కూడిన ఉద్యోగాలను సృష్టిస్తుందని ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాధినేతలు ఎగిరిగంతేస్తున్నారు. ఎన్నికలకు ముందు లక్షలాది ఉద్యోగాలు తెచ్చామని చెప్పుకోవడం బైడెన్‌కు ఉపకరిస్తుంది. భారతదేశ కంపెనీ చేపట్టిన ఈ కొనుగోలుతో ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారాలు ఇనుమడించి, ప్రపంచసవాళ్ళను సమష్టిగా ఎదుర్కోగల సాన్నిహిత్యాన్ని పెంచుతుందని నేతలంతా ప్రకటిస్తున్నారు. భవిష్యత్తులో మరో రెండువేల విమానాల అవసరం ఉన్నదని గుర్తుచేస్తూ మోదీ మన ఆర్థికశక్తి ఎంతటిదో తెలియచెబుతున్నారు. కొత్త విమానాల కొనుగోలుతో విస్తరణ జరుగుతుంది కనుక మనదేశంలోనూ ఉద్యోగాల సృష్టి ఎంతోకొంత ఉంటుంది. విమానయానరంగంలో నిర్వహణ, వినియోగం తప్ప తయారీ లేదు కనుక ఈ లక్షలకోట్ల ఒప్పందం నుంచి కనీసం వేలల్లోనైనా ఉద్యోగాలు పుట్టకపోవా అని సంతృప్తి పడకతప్పదు.

Updated Date - 2023-02-16T01:22:05+05:30 IST