‘అక్టోబర్‌ 5’ స్ఫూర్తి ఏదీ?

ABN , First Publish Date - 2023-10-05T03:01:00+05:30 IST

అక్టోబర్ 5-– అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. మనదేశంలో సెప్టెంబర్ 5కు ఇస్తున్న ప్రాధాన్యతలో కొంత అయినా ఈ రోజుకు కేటాయిస్తే ఒక చర్చ జరిగేది...

‘అక్టోబర్‌ 5’ స్ఫూర్తి ఏదీ?

అక్టోబర్ 5-– అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. మనదేశంలో సెప్టెంబర్ 5కు ఇస్తున్న ప్రాధాన్యతలో కొంత అయినా ఈ రోజుకు కేటాయిస్తే ఒక చర్చ జరిగేది. వ్యక్తి పొగడ్తలతో సాగే తంతు సెప్టెంబర్ 5 అయితే, ఉపాధ్యాయుల స్థాయిని గుర్తించే కార్యక్రమం అక్టోబర్ 5. అందువల్లనేనేమో, మన ప్రభుత్వాలు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని విస్మరిస్తున్నాయి.

1966లో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 5 వరకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఉపాధ్యాయుల స్థితిగతులను చర్చించి, సమాజంలో వారి పాత్రను గుర్తించి అత్యంత ప్రామాణికమైన 145 సిఫార్సులను ప్రకటించింది. భారతదేశ ప్రతినిధిగా ఆనాటి విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సలహాదారు అయిన ప్రేమ కృపాల్ హాజరయ్యారు. ఆ సిఫార్సుల నివేదికనే ‘స్టేటస్ ఆఫ్ టీచర్స్‌’గా పిలుస్తున్నారు.

విద్యారంగానికి ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన నియామకాలు, ఎంపిక, శిక్షణ మొదలైన విషయాలు శాస్త్రీయంగా జరగాలని సిఫార్సులలో పేర్కొన్నారు. వృత్తి సంబంధమైన ప్రమాణాలు ఖచ్చితంగా ఉండాలని, తద్వారా నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని ఈ సిఫార్సులలో ఉన్నది. ఉపాధ్యాయులకు వృత్తి భద్రత కల్పించాలని, వారు హక్కులతో పాటు బాధ్యతలు గుర్తెరిగేలా ఉండాలని సిఫార్సులలో ఉంది. ఉపాధ్యాయులపై ఏ విధమైన ఒత్తిడి లేకుండా వృత్తిపరమైన స్వేచ్ఛను కల్పించాలని, ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన వేతనాలు ఇవ్వాలని, ఆర్థికంగా వారు స్వయం పోషకత్వం కలిగి ఉండాలని సిఫార్సులు చేసింది. వారికి తగినన్ని సెలవులు వుండాలని, వారు తమ విద్యార్హతలను పెంపొందించుకునేందుకు స్టడీ లీవు వంటి సౌకర్యం ఉండాలని సిఫార్సులలో ఉన్నది. ఉపాధ్యాయులకు తగినంత విశ్రాంతి ఉండే విధంగా పనివేళలు నిర్ణయించాలని, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి లేని పని గంటలు ఉండాలని సిఫార్సు చేసింది. నాణ్యమైన బోధనకు అవసరమైన బోధనోపకరణాలు కల్పించాలని, తరగతి పరిమితి (విద్యార్థి – ఉపాధ్యాయుల నిష్పత్తి) మొదలు అనేక అంశాలు వీటిలో ప్రస్తావించారు. వీటితో పాటుగా పట్టణాలకు సుదూరంగా, గ్రామసీమల్లో పనిచేసే ఉపాధ్యాయుల స్థితిగతులను కూడా చర్చించారు. మహిళా ఉపాధ్యాయుల పరిస్థితులు, వారి ప్రత్యేక అవసరాలు, వైద్య సౌకర్యాలు, వారి భద్రత కోసం చేపట్టవలసిన చర్యలు ఈ సిఫార్సుల్లో ఉన్నాయి. బోధనకు సంబంధించి ఉపాధ్యాయ మార్గదర్శక సూత్రాలు, విద్యావిషయ లక్ష్యాలు, విధానాలు మొదలైనవి కూడా ఈ సిఫార్సుల్లో చోటు చేసుకున్నాయి. ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పెన్షన్, కుటుంబ పెన్షన్ మొదలైన సిఫార్సులు కూడా పొందుపరిచారు.

అయితే అంతటి విలువైన, నాగరికమైన సిఫార్సుల అమలు సక్రమంగా సాగుతున్నదా అన్నదే ప్రశ్న. అమలు సంగతి సరే, వాటి స్ఫూర్తికే విఘాతం కలిగించేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. గత మూడు దశాబ్దాల నుంచి విద్యారంగం పట్ల ప్రభుత్వాల దృష్టి మారింది. ప్రపంచీకరణ ప్రభావాలు విద్యారంగంలో స్పష్టంగా చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలో నిర్వహించాల్సిన పాఠశాలలు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల అధీనంలోకి వెళ్లిపోతున్నాయి. ఉద్యోగ భద్రతను కోల్పోయి, రోజువారి కూలీ లెక్కన పీరియడ్‌కు ఇంత చొప్పున చెల్లించే పద్ధతిలోకి ఉపాధ్యాయుడు దిగజారిపోయాడు. వీటితో పాటుగా విద్యార్థులను ప్రత్యక్ష బోధన నుంచి దూరం చేశారు. ఉపాధ్యాయుడు–విద్యార్థి మధ్య ఉండే సున్నితమైన పవిత్ర భావన చెరిగిపోయింది. నేటి విద్యార్థి దృష్టిలో ఉపాధ్యాయుడికి ఒక ఆండ్రాయిడ్ ఫోన్‌కి పెద్ద తేడా లేదు.


రాష్ట్రంలో విద్యారంగ ప్రగతికి ఆటంకం కలిగించే అనేక విషయాలు యధేచ్ఛగా సాగిపోతున్నాయి. దశాబ్దాల క్రితం గ్రామాలలో ఏర్పడిన ప్రాథమిక పాఠశాలల మూసివేత ఈ విధానాలకు పరాకాష్ఠ. వీటితోపాటు నిర్బంధ ఆంగ్లమాధ్యమం అమలు, 117 జీఓ వంటివి పాఠశాలల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఉపాధ్యాయులను అవకాశం దొరికిన ప్రతిచోట అవమానించడమే పనిగా పెట్టుకుంది ఈ ప్రభుత్వం. కరోనా కాలంలో బ్రాందీ షాపుల వద్ద మందుబాబుల క్యూలను పర్యవేక్షించే పనితో ప్రారంభమై, ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లలో తమ హాజరు వేసుకోవాలి అనే నియమం వరకు పరిస్థితులు కొనసాగుతున్నాయి. అసమ్మతిని, నిరసనను వ్యక్తం చేసే కనీసపు అవకాశం కూడా కల్పించడం లేదు. మునుపెన్నడు లేని విధంగా వేలాదిమంది ఉపాధ్యాయులపై అక్రమ కేసులు బనాయించింది. ఉపాధ్యాయుల మీదే ఎందుకు ఇంతటి కక్ష అంటే, ఉపాధ్యాయులు మాత్రమే ప్రశ్నించే శక్తులు. నియంతృత్వ ధోరణి కలిగిన పాలకులు, సామాజిక చైతన్యం కలిగిన ఉపాధ్యాయులను వేధిస్తారు అనడానికి ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణ. ఈ విధానాలన్నీ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ స్ఫూర్తికి విఘాతం కలిగించేవే.

ఈ ఏడాది అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం 2023 సందర్భంగా ఐక్యరాజ్యసమితి "The Teachers We Need For The Education We Need: The Global Imperative To Reverse The Teachers Shortage" అనే థీమ్ ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయుల కొరతను అధిగమిస్తూ నేటి సమాజానికి కావలసిన విద్యను అందించడం కోసం అన్ని దేశాలు కృషి చేయాలనే సందేశాన్ని ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ దిశగా ప్రపంచ దేశాలు అడుగు వేస్తూ విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పించిననాడు ప్రపంచం అంతటా వెలుగు రేఖలు విస్తరిస్తాయి.

కె. భానుమూర్తి

ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్

Updated Date - 2023-10-05T03:01:00+05:30 IST