2600 కోట్ల దుర్వినియోగం మాటేమిటి?
ABN , First Publish Date - 2023-10-11T03:15:19+05:30 IST
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంలో 371 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టు చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంలో 371 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టు చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, కేవలం ఒక్క ప్రాజెక్టులోనే తాను చేజేతులా నీటిపాల్జేసిన 2600 కోట్ల రూపాయల ప్రజాధనం విషయంలో జవాబు ఏమి చెబుతారు? దిగ్భ్రాంతికరమైన బాధ్యతా రాహిత్యాన్ని, అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఆయన ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు తమ పార్టీ జెండా రంగులు వేసి, ప్రజాధనంతో సొంత డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ అడ్డదిడ్డమైన ఖర్చు మీద కొందరు హైకోర్టుకెళితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. తక్షణమే రంగులు తొలగించాలని ఆదేశించింది. ఇప్పటికే వేయి కోట్లకు పైగా ఖర్చయ్యిందని ప్రభుత్వం చెప్పుకోగా... ఈ వాదనను తిరస్కరిస్తూ గ్రామ సచివాలయాలకు వేసిన పార్టీ రంగులు తొలగించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. మార్చి 2022లో ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాన్ని కొట్టివేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ప్రభుత్వ వాదనను తోసిపుచ్చుతూ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.
ఈ చట్టపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం విచిత్రంగా పార్టీ రంగులకు దిగువన మరొక రంగును జోడించింది. ఈ నిర్ణయాన్ని మళ్ళీ హైకోర్టు తిరస్కరించింది, ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులను ధిక్కార చర్యలకు పిలిపించింది. ఆశ్చర్యకరంగా అప్పటికి పది నెలలుగా కోర్టుల నుంచి అనేక ఆదేశాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలును కోరింది. మళ్ళీ చెంప దెబ్బలు తింది. రూ. 2600 కోట్లు దాటిన పెయింటింగ్ ఖర్చును చివరికి ప్రజలే భరించాల్సిన పరిస్థితి కల్పించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిగితే జైలుకు పోవలసింది జగనే కదా! ఇటువంటి నిర్ణయాలకు అంతిమ బాధ్యత ఆయనదే కదా!
గ్రామ సచివాలయాలకు అనవసరమైన రంగులు వేయడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో పెద్ద ఎత్తున స్వాహా పర్వం కూడా ఉంది. 2600 కోట్లు ఖర్చు పెట్టి వేసిన పార్టీ రంగులు తీసేసారు. అంటే ఈ సొమ్మంతా వృధా అయినట్టే. నిజానికి ఈ నిధులతో రోడ్లు బాగుపడేవి. అనేక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చేవి. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు స్కిల్ స్కాం అంటూ హడావిడి చేస్తున్న సిఐడి అధికారులు, పార్టీ రంగులు వేసిన విషయంలో ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. 40 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు క్షేత్ర స్థాయిలో ఉన్నా... అనేకమంది విద్యార్థులకు సమగ్రమైన శిక్షణ ఇచ్చినా... కాజేశారన్న నిధులతో పూర్తిస్థాయిలో పరికరాలు స్కిల్ సెంటర్లకు వచ్చినా... ఇందుకు సంబంధించి అనేకమంది అధికారుల సంతకాలు ఉన్నా... కేవలం కక్షపూరితంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేశారు.
మరి 2600 కోట్లు దుర్వినియోగం చేసిన వారిని వదిలేసి... సరైన ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం. 371 కోట్లు అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చెప్పగా, ఆగమేఘాల మీద మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికార గణానికి ఈ పెద్ద మొత్తం కనిపించలేదా? కోర్టుల్లో ప్రభుత్వం తరఫున వాదించే లాయర్లకు ఇచ్చిన ఫీజు కోట్లలో ఉంటుంది. మరి ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడం కాదా?
చెన్ను పెద్దిరాజు
సీనియర్ జర్నలిస్ట్