ఎవరు ‘అసలు’?

ABN , First Publish Date - 2023-02-21T00:31:14+05:30 IST

మహారాష్ట్రలో అసలైన శివసేన ఏక్‌నాథ్‌ షిండేదే అంటూ పార్టీ పేరునూ, ‘విల్లు–బాణం’ గుర్తునూ ఆయన వర్గానికే ఎన్నికల సంఘం దఖలుపరచడం బాలాసాహెబ్‌...

ఎవరు ‘అసలు’?

మహారాష్ట్రలో అసలైన శివసేన ఏక్‌నాథ్‌ షిండేదే అంటూ పార్టీ పేరునూ, ‘విల్లు–బాణం’ గుర్తునూ ఆయన వర్గానికే ఎన్నికల సంఘం దఖలుపరచడం బాలాసాహెబ్‌ పుత్రరత్నం ఉద్ధవ్‌ ఠాక్రేకు పెద్దదెబ్బ. ‘మొగాంబు ఖుష్‌ హువా’ అంటూ గతకాలం నాటి ఓ హిందీ చిత్రంలోని డైలాగ్‌తో కేంద్రమంత్రి అమిత్‌షామీద ఆగ్రహించారు ఠాక్రే. ప్రస్తుత ఎన్నికల సంఘాన్ని తక్షణమే రద్దుచేయాలని కూడా డిమాండ్‌ చేశారు. వెన్నుపోటు వర్గానికి ఈ గుర్తింపు దక్కడం వెనుక రెండువేలకోట్లు చేతులు మారాయని ఉద్ధవ్‌ కుడిభుజం సంజయ్‌ రౌత్‌ ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టులో అసలు కేసు నిగ్గుతేలకుండానే ఎన్నికల సంఘం షిండేకు రాజకీయంగా మేలుచేకూర్చే ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం నిర్ణయంమీద సుప్రీంకోర్టు ఏమంటుందో తెలియదు కానీ, 1966లో పార్టీ ఆవిర్భావం నుంచి ఠాక్రేల గుత్తసొత్తుగా ఉన్న పేరు, 1989 నుంచీ ఉపయోగిస్తున్న గుర్తు ఒక చీలికవర్గానికి పోవడం చిన్నవిషయమేమీ కాదు.

దేశంలో చాలామంది నాయకులు పార్టీ చీలినప్పుడల్లా ఇలాంటి విషమస్థితిని ఎదుర్కొన్నారనీ, వీటన్నింటికీ ఎదురొడ్డి పోరాడి ప్రజామోదాన్ని పొందగలగడమే అంతిమ పరిష్కారమని ఎన్సీపీ నాయకుడు శరద్‌పవార్‌ ఠాక్రేకు హితవుచెబుతున్నారు. నా దగ్గరనుంచి ఎన్ని దోచుకుపోయినా, ఠాక్రే అన్నమాటని మాత్రం ఎత్తుకుపోలేరు కదా అని ఉద్ధవ్‌ అంటున్నప్పటికీ, ఇప్పటివరకూ ఆయనకు ఊరటనిచ్చే పరిణామాలేవీ లేకపోవడం విషాదమే. షిండే దెబ్బకు ఆయన గత ఏడాది జూన్‌లో ముఖ్యమంత్రి పదవికోల్పోవలసి వచ్చింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో బీజేపీ పాలిత గుజరాత్‌, అసోం రాష్ట్రాల్లో క్యాంప్‌ రాజకీయాలు నడుస్తున్నప్పుడు ఠాక్రే పక్షాన మిగిలినవారిలో కూడా కొందరు తరలిపోయారు. ఇటీవల ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం పార్టీ గుర్తును ఏ వర్గానికీ కేటాయించకుండా నిలిపివేసి, రెండు వర్గాల పేర్లలోనూ బాలాసాహెబ్‌ పేరు ఉండేట్టుగా చూస్తూ వేర్వేరు గుర్తులను కేటాయించింది. ఇప్పుడు ఠాక్రే వర్గం పేరూ గుర్తూ కూడా కోల్పోయిన స్థితిలో, ‘విల్లు–బాణం’ ఎవరిదో తేల్చే నిర్ణాయాధికారాన్ని గతంలో ఎన్నికల సంఘానికే కట్టబెట్టిన సుప్రీంకోర్టు ఏం చెప్పబోతున్నదో చూడాలి.

పార్టీ చీలికతో ముడిపడిన కీలకమైన అంశాలమీద సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ పేరు, గుర్తు విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోవద్దన్న ఠాక్రే వర్గం అభ్యర్థనను తోసిపుచ్చుతూ, దాదాపు 80పేజీల ఉత్తర్వుల్లో తాను ఏయే ప్రాతిపదికలమీద ఈ నిర్ణయానికి వచ్చిందీ ఎన్నికల సంఘం వివరించింది. ఉభయపక్షాలూ అసలు శివసేన విలువలకూ, సిద్ధాంతాలకూ తామే కట్టుబడే ఉన్నామని చెబుతున్నందున ఎవరిది అసలు పార్టీ అన్నది నిర్ధారించే మిగతా ప్రాతిపదికలను పక్కనబెట్టి, బలాబలాలు అన్న అంశాన్నే కీలకం చేసుకున్నది ఎన్నికల సంఘం. సహజంగానే పదిహేనుమంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు ఉన్న ఠాక్రే వర్గంతో పోల్చితే నలభైమంది ఎమ్మెల్యేలు, పదమూడుమంది ఎంపీలున్న షిండేవర్గం సభలోనూ, ప్రజాప్రాతినిధ్యంలోనూ బలమైనది కనుక ఈసీకి ఇది సులువైన మార్గం. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు ఓటువేసిన వారిలో ౭6శాతం మంది ఓటర్లు షిండే వర్గంలోని ఎమ్మెల్యేలకు ఓటేశారనీ, ఉద్ధవ్‌వర్గం ఎమ్మెల్యేలకు 23.5శాతం ఓట్లు మాత్రమే వచ్చినందున అసలు సేన షిండేదేనని ఈసీ తేల్చేసింది. ఆ ఎన్నికలు జరిగేటప్పుడు శివసేనకు ఓటేసినవారు ఈ ఎమ్మెల్యేలనే కాక, బాలాసాహెబ్‌నో, ఉద్ధవ్‌నో దృష్టిలో పెట్టుకొని కూడా ఓటేసివుంటారనీ, ఇప్పుడు గుర్తు, పేరు కూడా దక్కించుకున్న షిండే అప్పుడు తెరమీద లేనేలేరన్నదీ ఎన్నికల సంఘానికి అనవసరం. తామే అసలు శివసేన అంటూ ఉభయపక్షాలూ దాఖలు చేసిన పిటిషన్లపై ఫిబ్రవవరి 21నుంచి సర్వోన్నతన్యాయస్థానం ఎలాగూ విచారణ జరబోతున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘం తొందరపడకుండా ఉండివుంటే ఇప్పుడు ఇన్ని విమర్శలు ఎదుర్కొనేది కాదు. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవచ్చును కానీ, న్యాయవివాదాన్ని ఈ చర్య మరింత సంక్లిష్టపరుస్తుంది. ఎవరిది అసలైన శివసేన అన్న యుద్ధం నిజానికి ఇంకా ముగియనప్పటికీ రాజకీయంగా ఠాక్రే వర్గానికి ఈసీ నిర్ణయం ఎదురుదెబ్బ. నచ్చినా నచ్చకున్నా, ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకున్నా శివసేన ఎప్పటికీ బీజేపీతో కొనసాగాలనీ, కాదని ఎన్సీపీతోనూ, కాంగ్రెస్‌తోనూ జతకట్టినవారు బాలాసాహెబ్‌కు ద్రోహం చేసినట్టేనని షిండేవర్గం వాదిస్తున్న తరుణంలో, అసలు ద్రోహులు ఎవరో నిర్దిష్టంగా తేలేది ప్రజాక్షేత్రంలోనే.

Updated Date - 2023-02-21T00:32:26+05:30 IST