దేవుడి భూములు ఎవరు కాపాడతారు?
ABN , First Publish Date - 2023-10-05T03:07:57+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో 87,235 ఎకరాల దేవాలయ భూములున్నాయి. ఇందులో 24శాతం అంటే 13వేల ఎకరాలు ఆక్రమణలకు గురి అయినాయి. లీజుకు ఇచ్చిన భూములను కాలం తీరాక కూడా...
తెలంగాణ రాష్ట్రంలో 87,235 ఎకరాల దేవాలయ భూములున్నాయి. ఇందులో 24శాతం అంటే 13వేల ఎకరాలు ఆక్రమణలకు గురి అయినాయి. లీజుకు ఇచ్చిన భూములను కాలం తీరాక కూడా తిరిగి స్వాధీనం చేసుకోలేదు. దేవుడికి వారి భక్తిని చాటుకోవడం కోసం కొంతమంది భూస్వాములు ఎకరాల కొద్దీ భూములను దానంగా ఇచ్చారు. వాటిని రెవెన్యూ శాఖ తన రికార్డులలో నమోదు చేసుకోలేకపోయింది. ఎండోమెంట్ ట్రిబ్యునళ్ళు కూడా ఆ శాఖ వైపున్న భూముల పక్షాన తీర్పులనిచ్చాయి, వాటిని కూడా తమ పేరున నమోదు చేసుకోలేదు. 59,898 ఎకరాల భూ విస్తీర్ణానికి పాస్ పుస్తకాలు లేవు. కొంచెం అటు ఇటూగా రెండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఎకరాల వరకు అర్చకుల చేతుల్లో ఉన్నాయి. అప్పట్లో ముతావలీలకు, స్థానిక పూజారులకు ఈ కొసరు భూములే ఆధారంగా నిలిచాయి.
ఇటీవల తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుల ఆధారంగా ఒకసారి రెవెన్యూ రికార్డులలో దేవాలయ భూములుగా నమోదు కాబడితే అవి ఎప్పటికీ దేవుడి భూములే. ట్రస్టు పేరిట, ముతావలీ పేరున లేదా పూజారి పేరున ఆక్రమణ కాలంలో ఉన్నదని లావాదేవీలు చేసారు, కానీ ఏ లావాదేవీలు చేసినా కోనుగోలుదారు నష్టపోతారని కోర్టువారి ఆదేశాలున్నాయి. ఎవరికీ ఏ విధమైన హక్కులూ బదిలీ కావు, సంక్రమించవు. తెలిసీ తెలియక జరిగిపోయినా దేవాదాయశాఖ తన భూములను కొనుగోలు చేసిన వారి నుంచి స్వాధీనం చేసుకుంటుంది. ప్రభుత్వ భూముల వేలం అనేది ఇప్పుడు కాదు, అన్ని ప్రభుత్వాలు చేసాయి. భూములు ఖాళీగా ఉంటే ఆక్రమణలకు గురవుతాయేమో అంటూ వేలం వేస్తారు.
కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేద దళిత, ఆదివాసీ, బీసీ కులాల కౌలు రైతులు, దేవాలయ ధూప దీప నైవేద్యాలకు 33శాతం కౌలు రూపంలో ఇవ్వవలసి ఉంటుంది. కొంత కాలం తర్వాత వీరికే పంపిణీ చేయవచ్చు కానీ అందుకు కౌలుదారీ చట్టాలు అడ్డం వస్తున్నాయని డొంక తిరుగుడు ఉదాసీనతను ప్రదర్శిస్తున్నారు. కౌలు చేసుకుంటున్న పేద రైతుల వద్ద నుంచి మీ గడువు అయిపోయిందంటూ ఏ కారణం చెప్పకుండా భూములు లాగేసుకున్నారు. ధనిక వర్గాలు తాము కౌలుకు చేసుకుంటున్న భూములు కొన్ని సంవత్సరాలు సాగుచేసి కొంత పట్టు బిగించి ఆ పొలాలనే ఉప కౌలుకు ఇస్తుంటారు. వీరు ఎకరాకు నలభై నుండి యాబైవేలు సంపాదించి, డిపార్ట్‌మెంట్‌కు మాత్రం అయిదు నుంచి ఆరు వేలు ఇస్తుంటారు. అన్ని సందర్భాలలో ఆయా గ్రామాలలో ఆధిపత్య కులాలే ఆక్రమించుకుని, కొంత కాలం తర్వాత పాలకుల, అధికారుల అండదండలతో వారు కౌలుదారులుగా ఉన్న భూమిపై కొంత లిటిగేషన్ క్రియేట్ చేసి కోర్టుల ద్వారా ఆ భూములకు స్వంతదారులుగా మారిపోయారు.
పేద రైతుల నుంచి స్వాధీనం చేసుకున్న భూములను వేలం కొరకు నోటిఫై చేస్తూ ఉంటారు. సాగులో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చట్టం చెపుతుంది. అవేమీ పట్టించుకోకుండా వీరిని భూమి మార్కెట్ విలువ ఆధారంగా ధరావతును (ఇఎండి) జమ చేయమంటుంది. డబ్బులు లేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక చేతులెత్తేస్తూ, నిరాసక్తతో కుమిలిపోతుంటారు. నోటిఫై కాబడిన చిన్న రైతుల భూములను మంత్రిగారి బంధువుల లాంటి వారు అన్ని ధరావతులు చెల్లించి దక్కించుకుంటారు. బహిరంగ వేలం అంటే బహిరంగ ప్రదేశంలోనే జరగాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. కానీ గుట్టుచప్పుడు కాకుంటా ఈ భూముల వేలం జరిగిపోతుంది, ప్రభుత్వం కూడా కట్టడి చేయడం లేదు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ ట్రస్టు అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్సు చట్టం దేవాలయ భూములను ఎండోమెంట్సు చట్టం నుండి మినహాయించింది. దీనిపై హైకోర్టుకు వెళితే చట్టంలోని సెక్షన్ 82 చెల్లదని తీర్పుచ్చింది. పేద రైతంటే 2.5 తరి లేదా 5 ఎకరాలు ఖుష్కి నెలకు 250 నుండి 3000 లోపు ఆదాయం ఉన్నవారని ధ్రువీకరించింది. అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళితే పై విధంగా తీర్పునిచ్చింది. తెలంగాణ రాష్ట్రం దళితులకు మూడు ఎకరాలు పంచుతానన్న వాగ్దానాన్ని దేవాలయ భూముల పంపిణీ ద్వారా కొంత వరకు న్యాయం చేయవచ్చు. సీలింగ్ చట్టాలు, అభ్యంతరాలు ఉన్నాయన్న సాకుతో ముందుకు వెళ్ళలేదు, కానీ ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం ఉన్నప్పుడు చిన్న చిన్న అమెండ్‌మెంటులు చేసుకుని, పాత రికార్డుల ఆధారంగా దేవుని భూములన్నింటినీ ఎండోమెంటుశాఖ స్వాధీనం చేసుకునే అధికారం ఉంది. ఇలా కొన్ని వేల ఎకరాలు దేవాలయ భూములుగా బయటకు వస్తాయి. వాటిని పేదలకు, దళితులకు, ఆదివాసీలకు, భూమి లేనివారికి పంపిణీ చేయవచ్చు.
2019 రెవెన్యూ రికార్డుల ప్రకారం దేవరయాంజాల్ సీతారామస్వామి దేవాలయ భూమి విస్తీర్ణం 882.36 ఎకరాలు, ధరణి రికార్డులలో పట్టాకాలంలో దేవాలయ భూమిగా ఉంది. ఆక్రమణ కాలం లేదు, కావున పేచీ లేదు. కబ్జాలో అదే గ్రామంలోని అయిదు ఆధిపత్య కులాల చేతిలో ఈ భూములు ఉన్నాయి. పెద్దవాళ్ళుగా చెలామణి అవుతున్న బయటివారి చేతుల్లో కూడా ఈ భూములున్నాయి. వీరిలో ప్రస్తుత మంత్రులు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రభుత్వం అత్యున్నత స్థాయి అధికారులతో ఒక కమిటీ వేసింది. ఒకరు 1,395 ఎకరాలు, మరో సీనియర్ అధికారుల బృందం 1,532 ఎకరాలుగా రిపోర్టు చేసారు, కానీ పహాణి ప్రకారం 882.36 ఎకరాలు. ఎండోమెంట్ శాఖ ద్వారా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని వేలం వేసినట్లయితే ఖజానాకు వేల కోట్ల రెవెన్యూ వస్తుంది.
1964 గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ వారికి బాలనగర్, కూకట్‌పల్లి ‘వై’ జంక్షన్ దగ్గర ఉఢాసీన్‌మట్ పేరున ఎండోమెంటు భూమిగా రికార్డు అయిన 540.30 ఎకరాల భూమిని 99 సంవత్సరాల లీజుకిచ్చారు. కొద్ది సంవత్సరాల క్రితం గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్‌వారు లీజు ఒప్పందాలను ఉల్లంఘిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. ఈ ఉల్లంఘనలను ఎండోమెంట్‌శాఖ గమనించి కోర్టుకు వెళ్ళి భూమిని స్వాధీనపరుచుకుంది. ఆయిల్ కార్పోరేషన్‌వారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. అయినప్పటికీ సుప్రీంకోర్టులో వీరికి అనుకూలంగా తీర్పు రాలేదు. ప్రస్తుతం భూమి ఎండోమెంట్‌శాఖ ఆధీనంలో ఉంది. ఇక, యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామి దేవాలయం 2.5 ఎకరాల నుండి 14 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది. ఈ మొత్తం భూమి 2,152 ఎకరాలు భూసేకరణ చేసారు. మరి ఇంత భారీ మొత్తం భూమిని ఎలా కాపాడుకుంటారో ఆ దేవుడికే తెలియాలి. గుడి బాగోగులు దేవాదాయశాఖ చూడాలి. భూముల రికార్డులు రెవెన్యూశాఖ భూములలో నమోదు చేస్తూ పూర్తిస్థాయిలో రికార్డులను ఎండోమెంటువారి దగ్గరుండాలి. రెవెన్యూ దేవాదాయశాఖలతో భూ విస్తీర్ణాలు సరిపడేలా సమన్వయం చేసుకొని సంబంధిత రికార్డులను ఎండోమెంట్‌శాఖ భద్రపరుచుకోవాలి, అన్నింటికంటే ముఖ్యంగా పాసుబుక్‌లు కూడా దాచుకోవాలి.
తెలంగాణ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాలు ఇస్తాననడం మంచి ఆదర్శమే. కానీ భూమి అన్నది పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉన్నదన్న విషయం ప్రభుత్వానికి తెలిసి కూడా వారి భూములను లాక్కోకుండా అసైన్‌మెంట్ భూములను తీసుకోవడం సరికాదు. ఆక్రమణలకు గురి అయిన దేవాలయ భూములను తీసుకుని దళితులకు, ఆదివాసీలకు పంచితే బాగుంటుంది. ఈ పని చేయగలిగితే అటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఇటు పేదలకు కూడా మేలు చేసినవారవుతారు.
వి. బాలరాజు
తహశీల్దారు రిటైర్డు