మా ఇళ్లపై ఎందుకీ దాడులు?

ABN , First Publish Date - 2023-10-03T02:55:09+05:30 IST

గాంధీ జయంతి నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రజాసంఘాల నేతల ఇండ్లపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) దాడులు చేసింది. ఈ సంఘాల్లో చైతన్య మహిళాసంఘం...

మా ఇళ్లపై ఎందుకీ దాడులు?

గాంధీ జయంతి నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రజాసంఘాల నేతల ఇండ్లపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) దాడులు చేసింది. ఈ సంఘాల్లో చైతన్య మహిళాసంఘం, హెచ్ఆర్ఎఫ్, సిఎల్‌సి, కుల నిర్మూలన పోరాట సమితి, బంధుమిత్రుల సంఘం, విరసం వంటి వివిధ ప్రజా సంఘాలు అనేకం ఉన్నాయి.

చైతన్య సంఘం కార్యకర్తలకు నెలరోజుల నుంచి ఎన్‌ఐఎ నోటీసులు పంపుతున్నది. హైదరాబాదులో తమ ఆఫీసుకు రావాలని వాట్సప్‌లో నోటీసులు పెట్టి, ఫోన్లు చేస్తున్నారు. గవర్నమెంట్ టీచర్‌గా పనిచేస్తున్న ఇ. జయ అనే ఒక కార్యకర్త స్కూలుకే వచ్చి, చైతన్య మహిళా సంఘాల్లో పనిచేస్తే ఇంటిమీద దాడి చేస్తాం, మీ బస్తీలో పరువు లేకుండా చేస్తామని బెదిరించారు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఎవరైనా ఏ సంఘంలోనైనా పని చేయవచ్చు అని వాళ్ళతో ఆమె గట్టిగానే చెప్పింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో చైతన్య మహిళా సంఘం కార్యకర్తలైన పద్మ, రాధ, రమ ఇండ్లపై, తెలంగాణలో అనిత ఇండ్లపై సోదాలు చేసి ఫోన్లు, పుస్తకాలు తీసుకొనిపోయారు. ముంచింగి పుట్ట కేసు పేరుతో మొత్తం 84 మంది ఇండ్లమీద రైడ్స్‌ చేశారు. పొద్దుటూరులో పనిచేస్తున్న పద్మ అనే కార్యకర్త ఇంటికి వచ్చి ఆమె అత్తగారి వద్ద ఉన్న డబ్బు పన్నెండున్నర లక్షలు, ఆమె పుట్టింటి వారు ఆస్తి పంచగా వచ్చిన డబ్బు కూడా పోలీసులు తీసుకొనిపోయారు. పద్మ అత్తగారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ పోలీసులకు చూపించినా కూడా వాళ్ళు వినలేదు. నా కొరకు వచ్చి మా అత్తగారి డబ్బు ఎలా తీసుకెళ్తున్నారు అని పద్మ అడిగితే, నీతో ఎవరు కలిసి ఉన్నా మాకు సంబంధం లేదు, ఇవ్వకపోతే బ్లాక్ మనీ కేసు పెడతామని చెప్పి డబ్బు తీసుకొనిపోయారు. ఈ విధంగా మహిళా సంఘం వారిని కుటుంబ సంబంధాల నుంచి వేరు చేస్తున్నారు.

చైతన్య సంఘం 28 ఏళ్ల నుంచి మహిళా సమస్యల కొరకే పనిచేస్తున్నది, మహిళా సమస్యల మీద ఇతర మహిళాసంఘాలతో కలిసి పనిచేస్తుంది. మహిళలను చైతన్యం చేయడం ఈ సంస్థ లక్ష్యం కాబట్టి కార్యక్రమాలన్నీ బహిరంగంగానే ఉంటాయి. ఇందులో రహస్యం ఎక్కడిది, ఎవరితోనో సంబంధాలు పెట్టుకోవాల్సి అవసరం ఏముంది?

మా సంఘం కార్యక్రమాలకు మహిళలు రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ దాడులు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ఎన్నికలు దగ్గరలో ఉన్న నేపథ్యంలో, ఓట్లకోసం వచ్చే నాయకులను స్థానిక సమస్యల పరిష్కారం కొరకు మహిళలు ప్రశ్నిస్తారని, చైతన్యంతో నిలదీస్తారని పాలకుల భయం. సంఘాలతో మహిళలు కలవకూడదని, చైతన్యం పొందకూడదనే ఉద్దేశంతో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ప్రజా సంఘాలను ప్రజలకు దూరం చేయాలన్న ఉద్దేశంతో ఈ రకమైన నిర్బంధాన్ని ప్రభుత్వం ప్రజాసంఘాలపై కొనసాగిస్తుంది.

చిన్నపిల్లలపై అత్యాచారాలు, వరకట్న వేధింపులు పాశవికంగా జరుగుతున్నాయి. నిందితులను పట్టుకొని శిక్షించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. బాధితులకు అండగా ఉండి రాజీలేని పోరాటం చేస్తున్నందుకు మొదటినుంచి చైతన్య మహిళా సంఘం అంటే ప్రభుత్వానికి కంటగింపుగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలంతా మాలాంటి సంఘాలకు మద్దతు పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

బి.జ్యోతి, రాధ, శ్రీదేవి

(చైతన్య మహిళా సంఘం)

Updated Date - 2023-10-03T02:55:09+05:30 IST