తెలంగాణపై ఇంత అక్కసు ఎందుకు?
ABN , First Publish Date - 2023-09-28T00:58:53+05:30 IST
ప్రధాని మోదీ జన్మదినం (సెప్టెంబర్ 17) నాడు నూతన పార్లమెంటు భవనంపై జాతీయ జెండాను ఆవిష్కరించి మరుసటి రోజు నుంచి ప్రత్యేక సమావేశాలను ప్రారంభించారు...
ప్రధాని మోదీ జన్మదినం (సెప్టెంబర్ 17) నాడు నూతన పార్లమెంటు భవనంపై జాతీయ జెండాను ఆవిష్కరించి మరుసటి రోజు నుంచి ప్రత్యేక సమావేశాలను ప్రారంభించారు. అలాగే తిథి ప్రకారం ప్రధాని జన్మదినమైన సెప్టెంబర్ 21నాడు ప్రత్యేక సమావేశాలకు ముగింపు పలికారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందో, వ్యూహాత్మకమో తెలియదు. కాని ఈ సమావేశాలలో ప్రధానమంత్రి మోదీ మరోమారు తెలుగు ప్రజలపై, ప్రత్యేకించి తెలంగాణ ఏర్పాటుపై తన అక్కసును వెళ్ళగక్కారు. పార్లమెంటు పాత భవనంలోని చివరి సమావేశం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేకమంది యువకులు, విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారు, భారీ పోరాటాలు జరిగాయి, రక్తం పారింది. కానీ రాష్ట్రం ఏర్పాటు తరువాత అటు తెలంగాణ ప్రజలు ఉత్సవాలు చేసుకోలేదు, ఇటు ఆంధ్ర ప్రజలు సంతోషంగా లేరు’ అని మోదీ అన్నారు. ఇది పూర్తిగా సత్యదూరం. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డేట్ 2014 జూన్ 2వ తేదీన సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆనంద బాష్పాలతో ఉత్సవాలు జరుపుకున్నారనేది చారిత్రక వాస్తవం.
తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా మోదీ వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2014 ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోను, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోను జరిగిన సభల్లో కూడా ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు’ అని వ్యాఖ్యానించారు. ప్రధాని అయ్యాక కూడా మోదీ తెలంగాణ ఏర్పాటుపై వ్యతిరేకతను చాటుకుంటూనే ఉన్నారు. మూడు నాలుగు సందర్భాల్లో ‘ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంటులో కూడా తలుపులు మూసేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశా’రని, ‘పెప్పర్ స్ప్రేలు చల్లా’రని పార్లమెంటు వేదికగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి. సాధారణంగా పార్లమెంటులో ఏ బిల్లుపైన అయినా డివిజన్ (ఓటింగ్) కోరినప్పుడు, లోక్‌సభ, రాజ్యసభ సమావేశ మందిరాల్లోకి అడుగుపెట్టే తలుపులన్నీ మూసి వేయాలని, లాబీల్లో ఎవరూ లేకుండా చూడాలని ఆయా సభాపతులు ఆదేశాలు ఇవ్వడం సర్వసాధారణం. ఈ సంగతి 2001 నుంచి ఇప్పటివరకు వరుసగా ముఖ్యమంత్రి, లేదా ప్రధానమంత్రి పదవిలో నిరంతరాయంగా ఉన్న మోదీకి తెలియదనుకోలేం! ఇక చర్చ జరగలేదనేది పచ్చి అబద్ధం. నాడు అధికార యూపీఏ, కమ్యూనిస్టు పార్టీతో పాటు ప్రతిపక్ష బీజేపీ సైతం సంపూర్ణ మద్దతు పలకడంతోనే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభ, రాజ్యసభలలో పాస్ అయ్యింది. ఇక బిల్లుపై చర్చ జరగలేదనేది అవాస్తవం. లోక్‌సభలో జరిగిన పరిణామాలతో, రాజ్యసభలో అనేక గంటల పాటు ఇదే బిల్లుపై సాఫీగా జరిగిన చర్చను, అనంతరం ఓటింగ్ ప్రక్రియను దేశమంతటా ప్రజలు టీవీల ప్రత్యక్ష ప్రసారంలో చూశారు.
నిజంగా నాడు తప్పు జరిగిందని ప్రధాని భావించి ఉంటే, గడిచిన తొమ్మిదిన్నరేళ్ళలో ఎందుకు సరి చేయలేదు? ఆయనకు చిత్తశుద్ధే ఉంటే పునర్విభజన చట్టంలో ఉభయ రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదు? తెలంగాణలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం వంటివి ఎందుకు అమలు చేయలేదు. రాజ్యసభ సాక్షిగా బిల్లు పాసైన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తరఫున నాటి ప్రధాని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను ఎందుకు ఇప్పటివరకు విస్మరించారు? వీటికి సమాధానం చెప్పాలి.
తెలంగాణ అంశం భావోద్వేగాలతో పాటు, చారిత్రక వాస్తవాలతో కూడుకున్నది. నాటి ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఒక్క రాష్ట్రంగా విశాలాంధ్ర పేరుతో ఏర్పడాలని కమ్యూనిస్టు పార్టీ భావించి, పోరాటం చేసింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత నిధులు, ఉద్యోగాల విషయంలో కొంత వివక్ష ఏర్పడడంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది. రాష్ట్రం ఏర్పడి ఎక్కువ కాలం కాలేదు కాబట్టి దానిని నాడు వ్యతిరేకించిన సీపీఐ, క్రమంగా వివక్ష ప్రస్ఫుటమవుతుండడంతో తొలుత 1999లో వరంగల్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ అభివృద్ధికి రూ.5వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని, ఈ ప్రాంత ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని, ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డిమాండ్‌లను పెడచెవిన పెట్టాయి. అదే సందర్భంలో మలి దశ ఉద్యమం రావడంతో, లెక్కలతో సహా తెలంగాణకు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రాష్ట్రానికి సీపీఐ మద్దతు ప్రకటించింది. ఆ తరువాత 2014లో రాష్ట్రం ఏర్పడింది. బీజేపీ సైతం 90వ దశకంలోనే తెలంగాణకు అనుకూలంగా ఒక ఓటు రెండు రాష్ట్రాల పేరుతో కాకినాడ తీర్మానం చేసింది. తరువాత వామపక్షాల మద్దతుతో ఏర్పడిన యూపీఏ ఎజెండాలోకి తెలంగాణ వచ్చి చివరకు 2014లో పార్లమెంటు ఆమోదం పొందగలిగింది. తెలంగాణ ఏర్పాటులో చిన్నమ్మ పాత్రను కూడా గుర్తుంచుకోవాలని ఆనాటి కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనాయకురాలు సుష్మాస్వరాజ్ తన గురించి తాను చెప్పిన విషయం వాస్తవం కాదా? ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఉభయ రాష్ట్రాలలో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని సంకుచిత దృష్టితో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ హోదాకు గౌరవాన్నిస్తుందా?
ప్రధానమంత్రి స్థాయిలో మోదీ ఏ ప్రకటన చేసినా దేశ శ్రేయస్సు కంటే సొంత పార్టీ హితం, పదవీ లాలస మాత్రమే కనిపిస్తాయి. రాష్ట్ర విభజన, ఉమ్మడి పౌరస్మృతి, అయోధ్య రామమందిర అంశం, ఇప్పుడు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల పేరుచెప్పి పార్లమెంట్ సభ్యులకు కూడా చివరి నిమిషం వరకు ఏమీ తెలియకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం... ఇలా అన్ని అంశాల్లోనూ ఓట్ల రాజకీయంపైనే ప్రధానమంత్రి దృష్టి ఉంటుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశం కూడా తక్షణ రాజకీయ ప్రయోజనాన్ని ఉద్దేశించిందే. అమలు విషయంలో డీ లిమిటేషన్, జనాభా గణన తర్వాత ఏ సంవత్సరం ఈ బిల్లు అమల్లోకి వస్తుందో ఊహకు అందని విషయంగా ఉన్నది. బిల్లులో మహిళలకు ఓబీసీ కోటా ప్రస్తావన లేదు. ఏ మేరకు చిత్తశుద్ధి ఉన్నా అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఓబీసీ కోటా కల్పించడంతోపాటు 2024 ఎన్నికల్లోనే అమలు చేయవచ్చును.
నూతన పార్లమెంట్ భవన ప్రారంభంలో గిరిజన మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడంలోనే మహిళలు, గిరిజనుల పట్ల బీజేపీకి ఉన్న ప్రేమ అర్థమవుతున్నది. బిల్కీస్ బానో అత్యాచార కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడం, వారికి సంఘ్ పరివార్ శక్తులు పూలమాలలు వేసి ఘనస్వాగతం పలకడం, మహిళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడినా ప్రధాని మౌనం వహించడం, మణిపూర్‌లో మహిళలపై అత్యాచారం చేసి నడిరోడ్డులో వివస్త్రలుగా ఊరేగించడం... వీటన్నింటి వల్లా బీజేపీ మహిళల పట్ల ఉన్న గౌరవ మర్యాదలు ఏమిటో తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇండియా పేరు తొలగించి భారత్ పేరుగా నిర్ధారణ చేయడం, జమిలి ఎన్నికల కోసం మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ వేయడం లాంటి అనేక చర్యలు ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించడం కొరకే. తక్షణం జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఓడిపోతామన్న భయంతోను, దాని ప్రభావం 2024 పార్లమెంట్ ఎన్నికలలో ఉంటుందన్న అనుమానంతోను చేపట్టిన చర్యలే ఇవన్నీ. ఈ స్థితిలో ప్రధానమంత్రి అల్ప రాజకీయాలను పక్కనపెట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన అంశమైనా, మహిళా బిల్లు అంశమైనా, మరే అంశమైనా పారదర్శకతతో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రవర్తిస్తే బాగుంటుంది.
కూనంనేని సాంబశివరావు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి