అప్పుల నెపం ‘నవరత్నాల’పై ఎందుకు?
ABN , First Publish Date - 2023-09-01T03:21:36+05:30 IST
నవరత్నాలు! జగన్మోహన్ రెడ్డి నోట్లో ఎప్పుడూ నానుతుండే పదం. అప్పులు విచ్చలవిడిగా చేస్తున్నారెందుకు అంటే, ‘నవరత్నాల’ కోసమే అంటారు. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటేసారు కదా...
నవరత్నాలు! జగన్మోహన్ రెడ్డి నోట్లో ఎప్పుడూ నానుతుండే పదం. అప్పులు విచ్చలవిడిగా చేస్తున్నారెందుకు అంటే, ‘నవరత్నాల’ కోసమే అంటారు. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటేసారు కదా అంటే, నవరత్నాల కోసమే అంటారు. కార్పొరేషన్ల మీద, మద్యం మీద అప్పులు, బాండ్లు ఏంటయ్యా ఇవన్నీ అంటే నవరత్నాల కోసమే అంటారు. ఇలా దేని గురించి ప్రశ్నించినా అంతా ‘నవరత్నాల’ కోసమే అంటున్నారు. అసలు ఈ నవరత్నాలు అన్నీ కొత్త పథకాలేనా? రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, ఆరోగ్యశ్రీ, పెన్షన్ కానుక, జల కళ, మద్యనిషేధం, పేదలకు ఇళ్ళు, ఆసరా & చేయూత, అమ్మ ఒడి... వీటిలో ఒకటి తప్ప మిగతా అన్నీ పాతవే. దాదాపు గత పదిహేడేళ్ళకుపైగా ఉమ్మడి రాష్ట్రం నుంచి అమలులో ఉన్న పథకాలే. కానీ, బ్రాండింగ్ ప్రక్రియలో పాత పథకాలతో కదంబం చేసి అన్నీ కొత్త పథకాలే అన్నట్టు కలరింగ్ ఇస్తూ ఆ పేరుతో అప్పులు చేస్తున్నారు.
నవరత్నాల పథకాల కోసమంటూ ఖర్చు పెట్టే నిధులు నిజానికి ఎప్పుడో రెగ్యులర్ బడ్జెట్లలో కలిసిపోయాయి. 2014కు ముందు చంద్రబాబు, వైఎస్సార్, రోశయ్య, కిరణ్, రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు తెలంగాణలో కేసీఆర్, ఇటు ఆంధ్రలో చంద్రబాబు కొనసాగించిన పథకాలే ఇవన్నీ. మరిప్పుడు కొత్తగా ఇవి నవరత్నాలు ఎలా అయ్యాయి? పేరు మార్చడం, మన పేరు తగిలించడం, కొత్త పథకం అనడం... ఇదే బ్రాండింగ్ ఎక్సర్సైజ్ తంతు నడుస్తున్నది.
నవరత్నాలు అప్పుల కోసమే అనటానికి మొదటి ఋజువు: ‘రైతు భరోసా’. జూన్ దాకా రూ.31 వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. కేంద్రం ఇచ్చే రూ.6వేలను చెప్పకుండా, తన ఖాతాలో వేసేసుకొని రాష్ట్రమే మొత్తం ఇస్తున్నట్టు కలరింగ్ ఇచ్చారు. నిజానికి ఇచ్చింది రూ.17–18 వేల కోట్లు మాత్రమే. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వని రైతు భరోసా జగన్ ఇచ్చాడు కాబట్టి అది ‘నవరత్నం’ అనుకోవాలా? శుద్ధ తప్పు. డబ్బులు అప్పుడూ ఇచ్చారు. ఇప్పుడూ ఇస్తున్నారు. పేర్లు, విధం మారిందంతే. తెలుగుదేశం ప్రభుత్వం 2014–19 మధ్యలో రుణమాఫీ కోసం రూ.15,700 కోట్లు, చివరి ఏడాదిలో ‘అన్నదాతా సుఖీభవ’ పేరుతో, రూ.5000 కోట్లతో, మొత్తం రూ.21,000 కోట్లను రైతులకు ఇచ్చింది. ఈ కాలానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ఇచ్చిందో, 2019–23 కాలానికి వైసీపీ అంతకంటే తక్కువే ఇచ్చింది! కొత్తగా రైతులకు ఇచ్చిన డబ్బులేమీ లేవు. పేరు మార్పు తప్ప.
రెండవది, జగన్న విద్యా దీవెన. 2004లో ఎస్సీ, ఎస్టీలకు ఉన్న ‘ఫీజు రీయింబర్సుమెంట్’ని వైఎస్సార్ బీపీఎల్ అందరికీ వర్తింపజేస్తే వచ్చిన పథకం ఇది. తర్వాత రోశయ్య, కిరణ్, తెలంగాణాలో కేసీఆర్, ఆంధ్రలో చంద్రబాబు అందరూ అమలు చేసిన పథకం. అదెలా కొత్త పథకం అయిపోయింది? 2014–19 మధ్యన ఫీజు రీయింబర్సుమెంట్ 13 లక్షల మందికి ఇచ్చారు. రూ.10,136కోట్లు ఖర్చు పెట్టారు, అంటే అప్పటి బడ్జెట్‌లో 1.43 శాతం. 2019–23 మధ్యన 9.86 లక్షల మందికి ఇచ్చారు. రూ.9,947 కోట్ల ఖర్చు, అంటే బడ్జెట్లో 0.82శాతం. ఖర్చులో, బడ్జెట్ శాతాల్లో చూసినా తెలుగుదేశం ఫీజు రీయింబర్సు పథకం కంటే విద్యా దీవెనకు తక్కువే ఖర్చు పెట్టారు. పదిహేడేళ్ళ క్రితం మొదలైన పథకానికి పేరు మారిస్తే కొత్త ‘నవరత్నం’ అయిపోతుందా. దీని కోసం అప్పులు చేసాం అని చెప్పడం అన్యాయం కదా?
మూడవది ఆరోగ్యశ్రీ. ఇదీ చాలా పాత స్కీమే. నిజానికి వైఎస్సార్ పెట్టిందే. ఆ తర్వాత, రోశయ్య, కిరణ్, చంద్రబాబు అందరూ ఈ పథకాన్ని పెంపొందించారు, కొనసాగించారు. దీన్ని కూడా నవరత్నాలు అంటూ చూపిస్తూ, కొత్తగా ఖర్చు పెట్టినట్టు హడావిడి చేస్తున్నారు.
నాలుగవది పెన్షన్ కానుక. తెలుగుదేశం ప్రభుత్వం 2019 మార్చి నాటికి పేదలకు 54 లక్షల పెన్షన్లు ఇచ్చింది. రూ. 200 నుంచి 5రెట్లు పెంచి రూ.1000 చేసి, తర్వాత వంద శాతం పెంపుతో నెలకు రూ.2000 చేసింది. వైసీపీ ప్రభుత్వం 63 లక్షల పెన్షన్లు, 2,750 లెక్కన (రూ. 2000 నుంచి మూడేళ్ళలో రూ. 250 లెక్కన పెంచి) ఇస్తోంది. కొత్తగా వచ్చింది ఏముంది దీనిలో. పాత ప్రభుత్వం ఖర్చులో ఇప్పటికే ఇది భాగం అయిపోయింది. పాపం పేదోళ్ళ మీదకి మీ అప్పుల నెపం నెట్టేయకండి. అయిదవది జలకళ. అంటే, ఏమో అనుకొనేరు, సాగునీటి ప్రాజెక్టులన్నమాట. పూర్తిచేయడం సంగతి దేవుడెరుగు, ఈ 4 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టు కనీసం మొదలు పెట్టారా? తెలుగుదేశం ప్రభుత్వంలో పట్టిసీమ, ముచ్చుమర్రి, పోలవరం లాంటి ఎన్నో ప్రాజెక్టుల లిస్టు చెప్పచ్చు. సాగునీటి ప్రాజెక్టుల కోసం అప్పులు చేశామనడం కంటే పెద్ద మోసం ఇంకోటి ఉండదు. ఆరవది మధ్యనిషేధం. నిషేధం మాట అటకెక్కింది. పైగా ఏపీబీసీఎల్ ద్వారా మద్యం అమ్మకాలపై 18వేల కోట్లు, మద్యంపై వ్యాట్‌తో ఇంకొక ఆరేడువేల కోట్లు, వెరసి 25వేల కోట్లు సంపాదిస్తున్నారు. లిక్కర్ ఆదాయం కుదవపెట్టి రూ.16,000 కోట్లు సంపాదించారు. నాలుగేళ్ళలో లక్ష కోట్లు సంపాదించిన ఈ ‘రత్నం’ కోసం అప్పు అవసరమే లేదు.
ఏడవది పేదలకు ఇళ్ళ నిర్మాణం. కేంద్ర ప్రభుత్వమే చెప్పింది పూర్తయిన ఇళ్ళు వెయ్యి కూడా దాటలేదని. సెంటు భూమిలో ఇల్లు అనే పథకంలో కనీసం ఆరేడు వేలు కోట్లు నికరంగా సంపాదించారు. ఓటీయస్ పేరుతో పేదవాళ్ల దగ్గర తిరుగు వసూళ్లు చేసారు. మరి అసలు ఇప్పటి దాకా పూర్తి కాని ఈ ఇళ్ళ పేరుతో వేల కోట్లు అప్పులు చేసారా? ఎనిమిదో రత్నం ఆసరా. డ్వాక్రా పదం లేకుండా ‘ఆసరా & చేయూత’ అన్నారు. రూ. 27 వేల కోట్లకు గానూ ఇచ్చింది 15 వేల కోట్లు మాత్రమే. ఇప్పటికి రూ.12వేల కోట్ల బకాయి వుంది. ఎన్నికల ముందు 45 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు 15 వేలు ఇస్తామన్నారు, ఇచ్చారా? తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి డ్వాక్రా మహిళకు మూడు వాయిదాలలో 20 వేలు ఇచ్చింది, పసుపు కుంకుమతో కలిపి 94 లక్షల మంది మహిళలకు. ఆ లెక్కన ఇదీ కొత్త ఖర్చేమీ కాదు కదా. ఇక చివరిది, ‘అమ్మ ఒడి’ పథకం ఒక్కటే కొత్తది. ఇంట్లో ఎంతమంది వుంటే అంతమంది పిల్లలకు అని హామీ ఇచ్చారు కానీ ఇచ్చింది ఇంట్లో ఒక్కరికే. అది కూడా నాలుగు సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఎగ్గొట్టారు. పైగా నాన్న మందు బుడ్డీకి అవుతున్న ఖర్చు గురించి ఏ అమ్మైనా బాధపడకుండా ఉండగలదా? కుడిచేత్తో అమ్మవొడి పధకం ఇచ్చి, ఎడం చేత్తో ధరపెంచిన మద్యం బాటిల్ అందించి ఇప్పటికే లక్ష కోట్లు వసూలు చేసేసారు.
పైగా ఈ నవరత్నాలపేరిట తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టిన అనేక పధకాలు తీసేశారు. పెళ్లి కానుక, నిరుద్యోగ భృతి, అన్నకాంటిన్లు, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు, రైతు రుణమాఫీ, పథకాల్లో బీసీ (30), యస్సీ(27) ఎస్టీ(29), మైనారిటీ (11), రైతు సంక్షేమ (11), మహిళా సంక్షేమం (10) తీసేశారు. ఆ ఖర్చు అంతా మిగిలినట్టేగా. ఇవే కాదు, మరిన్ని వివరాలతో ఈ చేసిన అప్పులు నవరత్నాల కోసం కాదన్నది సాధికారికంగా నిరూపించవచ్చు. మరి చేసిన ఈ లక్షల కోట్ల అప్పులు ఏమి చేసారు? పేర్లు మార్చి బ్రాండింగ్ చేసి, నవరత్నాల పేరుతో అప్పులు చేస్తూ, మభ్యపెడుతున్న ఈ నాటకాలని ప్రజలు గమనించాలి. చేస్తున్న అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇది నిలదీసి అడగాల్సిన సందర్భం!
నీలాయపాలెం విజయ్ కుమార్
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి