ఎందుకీ గోప్యత?
ABN , First Publish Date - 2023-02-15T00:54:05+05:30 IST
అదానీ గ్రూప్ షేర్ల విలువ భారీగా పడిపోతున్న నేపథ్యంలో, అదానీ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంలో, భారతీయ మదుపుదార్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి...
అదానీ గ్రూప్ షేర్ల విలువ భారీగా పడిపోతున్న నేపథ్యంలో, అదానీ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంలో, భారతీయ మదుపుదార్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి సుప్రీంకోర్టు సిద్ధపడింది. స్టాక్‌మార్కెట్‌లో లక్షలాదికోట్లు ఆవిరైపోతూండటంపై ఆందోళన వెలిబుచ్చుతూ, మదుపుదార్ల సొమ్ము రక్షించాల్సిన అవసరం ఉన్నదనీ, అందుకు పటిష్ఠమైన యంత్రాంగం తయారుకావాలని సర్వోన్నత న్యాయస్థానం అభిలషించింది. అదానీ వ్యవహారం ఆర్థికంగానూ, రాజకీయంగానూ దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో, సుప్రీంకోర్టు సూచనను కాదనడం మంచిదికాదని ప్రభుత్వం కూడా భావించివుంటుంది.
అదానీగ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక వల్ల ఏర్పడిన పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సెబికి పూర్తి సమర్థత ఉన్నదని, దానిని తక్కువగా అంచనావేయడానికి వీల్లేదని, అవసరమైనప్పుడు కఠినచర్యలు తీసుకోగల శక్తి దానికి ఉన్నదని ప్రభుత్వం వాదిస్తోంది. మదుపుదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి సిద్ధపడిన సర్వోన్నతన్యాయస్థానం ఈ వాదనలను కాదనలేదు, శక్తిమంతమైన ఈ వ్యవస్థల ద్వారా ఇప్పటివరకూ ప్రభుత్వం సామాన్యుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు చేపట్టిన చర్యలేమిటని కూడా ప్రశ్నించలేదు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు ఏర్పడినప్పుడు లేదా, అవి జరగకుండా చూసేందుకు ఉన్న యంత్రాంగాన్ని బలోపేతం చేయడం ఎలా అన్న అంశానికి మాత్రమే న్యాయస్థానం పరిమితమైంది. మార్కెట్ నియంత్రణ వ్యవస్థలు బలంగా ఉండికూడా వాటిని మరింత బలోపేతం చేయడానికి సుప్రీంకోర్టు, ప్రభుత్వం సిద్ధపడిన తరుణంలో, కమిటీలోని నిపుణుల పేర్లు ఎందుకు గోప్యంగా ఉంచాలో సామాన్యుడికి అర్థంకాని విషయం. సెబి సమర్థతను తక్కువచేయనిపక్షంలోనే కమిటీ ఏర్పాటుకు అంగీకరిస్తామని సొలిసిటర్ జనరల్ పలుమార్లు వాదించడం, సుప్రీంకోర్టు కూడా అతి జాగ్రత్తగా మాట్లాడుతూ, ఒక పరిధికి మించి తాను అడుగుముందుకు వేయబోమని హామీ ఇవ్వడం విశేషం. మదుపుదార్ల ప్రయోజనాలకు మించిన విస్తృత ప్రయోజనాలు ఇంకేమి ఉంటాయో తెలియదు కానీ, భారతప్రభుత్వం దేశప్రయోజనాలకు సంబంధించిన చాలా కేసుల్లో ఈ సీల్డ్ కవర్ సంస్కృతిని పాటిస్తూనే ఉంది. ఇప్పుడు, కేవలం ఒక కమిటీ ఏర్పాటుతో జాతీయ, అంతర్జాతీయస్థాయి నిధుల ప్రవాహం ప్రభావితమయ్యే ప్రమాదం ఉన్నదన్న హెచ్చరికల మధ్య, కమిటీలో తాము నియమించబోయే నిపుణుల పేర్లను రహస్యంగానే ఉంచుతానని ప్రభుత్వం చెప్పడం, అందుకు సర్వోన్నతన్యాయస్థానం కూడా అంగీకరించడం విశేషం.
హిండన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో, అదానీ గ్రూప్ సంస్థల షేర్లధరలపతనం ఒక సహజ పరిణామక్రమంగా సెబి చెబుతోంది. విస్తృత మార్కెట్ మీద అదానీ ప్రభావం లేదనీ, ప్రస్తుతం ఉన్న నియంత్రణ విధానాలను తిరగదోడనవసరం లేదని దానివాదన. మదుపుదారులకు అన్యాయం జరుగుతోందని సెబి భావించనప్పుడు, ఇప్పుడు జరుగుతున్నది అదేనని సుప్రీంకోర్టు నమ్మినపక్షంలో నిపుణుల కమిటీ సమర్థత, అధికారాలు, విస్తృతి విషయంలో సుప్రీంకోర్టు రాజీపడకూడదు. ప్రభుత్వం సూచించిన పేర్లలో కొన్నింటిని ఆమోదించడానికే పరిమితం కాకుండా, ఆర్థిక నిపుణులతో సంప్రదించి తాను కొందరిని నియమించినప్పుడు మాత్రమే ఆ కమిటీకి విలువ, గౌరవం ఏర్పడతాయి.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆడిటింగ్ సంస్థ ద్వారా తన పద్దుల్లో ఎలాంటి అవకతవకలు లేవని రుజువుచేయించుకొనేందుకు అదానీ సంస్థ సిద్ధపడుతున్నది. దాచడానికి ఏమీలేదు, భయపడేది అంతకన్నా లేదు అని అంటూనే, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశం కనుక దానిమీద ఇంకేమీ మాట్లాడబోనని అమిత్ షా అంటున్నారు. సుప్రీంకోర్టు నియమించబోయే కమిటీ ఏం చేయగలదన్న విషయాన్ని అటుంచితే, అదానీ విషయంలో మూడువారాలైనా సెబి ఎందుకు మౌనంగా ఉంది, ఇటువంటి స్టాక్‌మార్కెట్ కుంభకోణాలు తలెత్తినప్పుడు గత ప్రధానుల మాదిరిగా మోదీ ఎందుకు జేపీసీ ద్వారా దర్యాప్తునకు సిద్ధపడటం లేదన్న విపక్షాల ప్రశ్నలకు జవాబులైతే లేవు. అదానీ వ్యవహారాలమీద ఒక విశ్వసనీయమైన వ్యవస్థద్వారా విచారణ జరిపి, నిజానిజాలు నిగ్గుతేల్చకుండా, ఉపరితల విన్యాసాలతో సరిపుచ్చితే దేశీయమదుపుదారుల్లోనే కాదు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో కూడా భారతీయ వ్యవస్థలమీద నమ్మకం కలగడం కష్టం.