లోకం నవ్వుకుంటుందేమో, జాలిపడుతుందేమో?

ABN , First Publish Date - 2023-02-16T01:24:42+05:30 IST

మంగళవారం నాడు భారత ప్రధాని నరేంద్రమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. ఆ తరువాత అమెరికన్ అధ్యక్షుడు జో బైడెన్‌తో...

లోకం నవ్వుకుంటుందేమో, జాలిపడుతుందేమో?

మంగళవారం నాడు భారత ప్రధాని నరేంద్రమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. ఆ తరువాత అమెరికన్ అధ్యక్షుడు జో బైడెన్‌తో టెలిఫోన్‌లో సంభాషించారు. ఈ మధ్యనే టాటా గ్రూపు చేతికి మారిన ఎయిర్ ఇండియా కొత్తగా ఎయిర్ బస్‌లను, బోయింగ్‌లను కొనబోతోంది. అందుకు సంబంధించిన ఒప్పందం సందర్భంగా ఈ అంతర్జాల, దూరవాణి పలకరింపులు! బైడెన్, మాక్రాన్ కాక, బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ కూడా ఒప్పందం విషయమై బాగా సంతోషపడ్డారు. బోయింగ్ విమాన తయారీ సంస్థ అమెరికాది. ఎయిర్ బస్ ఐరోపా కంపెనీయే కానీ దానిలో పెద్ద వాటా ఫ్రాన్స్‌ది. టాటా గ్రూపుతో ఒప్పందంలో ఎయిర్ బస్‌తో పాటు, రోల్స్ రాయిస్ కంపెనీ కూడా ఉంది. అది బ్రిటిష్ కంపెనీ. తమ దేశంలో పదిలక్షల మంది ఉద్యోగాలకు ఈ ఒప్పందం ఆసరా అవుతుందని బైడెన్ అంటే, తమ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి, ఉన్నతాదాయ ఉద్యోగాల కల్పనకు ఇది దోహదం చేస్తుందని సునాక్, ఇండియా నుంచి మాకు లబ్ధి జరుగుతోందని మాక్రాన్ అన్నారు.

ఇదంతా జరుగుతున్నప్పుడో, ఆ తరువాతనో భారతదేశంలో ఢిల్లీ, బొంబాయిలలోని బిబిసి కార్యాలయాలలో ఆదాయపన్ను అధికారులు ‘సర్వే’ నిర్వహిస్తున్నారు. బహుశా, సునాక్ హర్షాతిరేకాలు ప్రకటిస్తున్నప్పుడు ఆయన దేశానికి చెందిన ఒక అంతర్జాతీయ వార్తాప్రసార సంస్థ ఒక ప్రత్యేకమైన ‘ప్రతిస్పందన’ను స్వీకరిస్తూ ఉన్నది.

‘టైమింగ్’ గురించి మాట్లాడుతుంటారు కొందరు మీడియా విశ్లేషకులు. ఇరవయ్యేళ్ల కిందట ‘జరిగిపోయిన’ అప్రియమైన విషయాలను ఇప్పుడు రేకెత్తించడం ఎందుకు అన్నది వారి ధర్మసందేహం. బిబిసికి ఆదాయపన్ను శాఖ సందర్శనలు ఎందుకు అని ఎవరూ అమిత్ షాను అడిగినట్టు లేరు, ఆయన మంత్రిత్వ శాఖ వేరు. ‘ఇరవయ్యేళ్ల నుంచి బిబిసి తమను వెంటాడుతున్నది’ అని ఆయన మీడియాకు ఒక అయాచిత వివరణ ఇచ్చారు. ఏది ఎందుకు జరిగిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఎవరికీ తెలియనిదీ కాదు. బిబిసి వాళ్లకు ఏదో ‘టైమింగ్’ ఉన్నది కాబట్టి, ఆదాయపన్ను శాఖ ‘సర్వే’కు కూడా ఏదో సందర్భశుద్ధి ఉంటుంది. వేలకోట్లు పెట్టి సరుకులు కొంటున్నప్పుడు, ఎంతగా మన పూర్వ ప్రభువులు అయితే మాత్రం, ఆ మాత్రం అవమానం భరించలేరా? కాలం మారిందని గుర్తించాలి కదా?

‘స్వేచ్ఛ’ అన్న విలువ విషయంలో రాజీపడేదేలేదు అని గప్పాలు కొట్టుకునే అమెరికా నంగినంగిగా, భావప్రకటనా స్వేచ్ఛకు తమ మద్దతు ఉంటుందని ఒక ప్రకటన పారేసిందివాళ. ‘భోజనం ముఖ్యమా, విశ్వాసం ముఖ్యమా’ అన్న విచికిత్స పతంజలి పాత్రకు వచ్చినా, జో బైడెన్‌కు వచ్చినా అది భోజనం దగ్గరే ముగుస్తుంది. అమెరికన్లకు ఉపాధి ఇవ్వగలగడమే కాదు, దక్షిణాసియాలో చైనాకు చెక్ పెట్టగలుగుతుందేమోనని ఇండియా మీద ఆశ. ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతగా రష్యా పక్షాన ఉన్నా, ‘అర్థం చేసుకోవడం’ తప్ప గత్యంతరం లేని స్థితిలో పశ్చిమదేశాలు ఉన్నాయి. చైనా మీద వ్యతిరేకత ప్రజలలో ఉండడం అవసరం తప్ప, తెరచాటున చెట్టపట్టాలు వేసుకోవడమే తెలివైన పని అన్నది ఇండియా ఆలోచన. భౌగోళిక రాజకీయాలలో తనకు సంక్రమించిన కీలక ప్రాధాన్యాన్ని వాడుకుంటే తప్పేమిటి?

బయట పెద్ద రాజ్యాలన్నీ బలహీనదశలో ఉన్నప్పుడు, లోపల జనామోదం తిరుగులేని స్థాయిలో ఉన్నప్పుడు, ఒక మూడో ప్రపంచపు వర్ధమాన దేశంలోని మెజారిటీవాద పాలకులు ఎట్లా ఉంటారు? నరేంద్రమోదీ కూడా అట్లాగే ఉన్నారు. తాము నీతిగా కానీ, ప్రజాస్వామికంగా కానీ ఉండనక్కరలేదని, తాము వ్యవహరించే ఎదుటి పక్షాలలో నీతి, ప్రజాస్వామికత లేదని నిరూపిస్తే చాలని భారత పాలకులు నమ్ముతున్నారు. అందుకని, ప్రపంచం ఏమనుకుంటుందో, ప్రజాస్వామ్యాన్ని జపించేవాళ్లు ఏమనుకుంటారో అన్న సంకోచాలు ఉండనక్కరలేదు. బోరవిరుచుకుని తిరగకపోతే, యాభై ఆరంగుళాల ఛాతీ ఎందుకు? సవ్యమా కాదా, న్యాయమా కాదా, లోకసమ్మతమా కాదా అని మీనమేషాలు లెక్కిస్తూ పోతే, ఇంత మెజారిటీ తెచ్చుకుని ఎందుకు?

లోకంలో ఏ ఒక్కరికీ నైతికత లేదని నిరూపించగలిగినప్పుడు, నైతిక ప్రాతిపదికలన్నీ నిరాయుధం అవుతాయి. గాంధీ తప్పు, నెహ్రూ తప్పు, అంబేద్కర్ ఓ మొక్కుబడి, కమ్యూనిస్టులు ద్రోహులు, మేధావులు కుట్రదారులు, మాట్లాడేవాళ్లు నేరస్థులు, పోట్లాడేవాళ్లు హంతకులు అయినప్పుడు, కాలమానంలో 2014 కంటె ముందటిదంతా చీకటియుగమే అయినప్పుడు, వర్తమానం మీద సవారీచేయడం అత్యంత సులభం.

బాధ్యత కలిగిన పదవిలో ఉన్న ఒకరు ఇవాళ ఒక జాతీయ పత్రికలో ఇట్లా రాశారు, ‘‘నరేంద్రమోదీలో ఉన్న అపారమైన ఆత్మవిశ్వాసం, ఆయన విశ్వాసం నుంచి వచ్చింది. చెక్కుచెదరని సైద్ధాంతిక నిబద్ధత ఆయనకు రక్షాకవచం. ఆయన దీక్ష, ప్రపంచానికే స్ఫూర్తి ఇవ్వగలిగిన ఆయన నాయకత్వ శక్తి, ఆయన వ్యక్తిత్వం ఆ కవచం మీద టెఫ్లాన్ పూత పూశాయి. ఇక ఏ బురదా ఆయనకు అంటదు..’ వండే పాత్రకీ, అందులో చేసే పాకానికీ ఎడం పాటించేట్లు చేసే టెఫ్లాన్‌తో పోలిక తేవడం బాగుంది. తామరాకు మీద నీటిబొట్టు పోలిక రాజకీయాలకు పనికిరాదు. చిందిన బురద అంటకుండా జారిపోయే టెఫ్లాన్ కవచమే సరైనది.

బిబిసి మీద ‘సర్వే’ ముగిశాక, అందులో నుంచి ఏదన్నా చిట్టెలుక దొరకవచ్చు. దొరకకపోనూ వచ్చు. దొరికినా దొరకకున్నా, ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీ మీద, దైనిక్‌ జాగరణ్‌ మీద, న్యూస్ క్లిక్ మీద ఈడీలో, ఐటీలో ఏవో ఎందుకు ‘సర్వే’లు చేశాయో, బీబీసీ మీద కూడా అందుకే! దేశీయ వార్తాసంస్థల మీద చేసినప్పుడు, విదేశీ సంస్థల మీద చేయకూడదా అని కేకలు పెట్టాడు అర్ణబ్ గోస్వామి. ఆ వరుసలో రిపబ్లిక్ టీవీ మీద మాత్రం కేసులు పెట్టలేదా? అని తనను కూడా కలుపుకున్నాడు. సారాంశం ఏమిటంటే, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఇది ఒక హెచ్చరిక కూడా. విదేశీ వార్తాసంస్థ అయినప్పుడు, దాని చర్మం విదేశీయమైనది, పైగా తెల్లటిది కాబట్టి, తామెన్నడూ పోరాడని సామ్రాజ్యవాదమూ, వలసవాదమూ ఆపద్ధర్మ ఆయుధాలు అవుతాయి.

కక్షసాధింపులు, శిక్షలు కొత్తవని కాదు, బేఖాతరు తనమే అంతగా పరిచయం లేనిది. ప్రపంచంలో మనదేశాన్ని ఎట్లా చూస్తారు, నలుగురు ఏమనుకుంటారు, వ్యాపారం ఇస్తున్నావని మెరమెచ్చుల నవ్వులు నవ్విన బైడెన్, సునాక్ కూడా లోలోపల ఏమనుకుని ఉంటారు? భారత సంతతి వాడైన సునాక్ అదనంగా బాధపడి ఉంటాడా? ఈ లోకభీతి, నీతిభీతి, కనీసం అంతరాత్మ భీతి లేకుండా ఎందుకు పోయింది? నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అని కవి అన్నది, అన్యాయమైన సాంఘిక చట్రాలను ధిక్కరించడానికి తప్ప, అన్యాయాలకు మాఫీ ఇవ్వడానికి కాదే! ఎన్ని విమర్శనీయ లక్షణాలున్నప్పటికీ, ఎన్‌.రామ్ అన్నట్టు, బిబిసికి ప్రపంచంలో ఉన్న ప్రతిష్ఠ నీ ప్రభుత్వానికి ఉన్నదా? చెలాయిస్తున్న పరమాధికారం తప్ప నీకు సాధికారత ఇస్తున్న నైతిక ఆలంబన ఏది?

నిష్పాక్షికమూ ప్రతిష్ఠాత్మకమూ అయిన ధర్మపీఠం మీద కూర్చుని, ప్రయోజనకరమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి ప్రతిఫలం కోరడం తప్పు, ఇవ్వడం తప్పు. ఒక అలిఖిత అవగాహన ప్రకారం ప్రతిఫలాన్ని చెల్లిస్తున్నప్పుడు, ఆ అక్రమ చెల్లింపు కాస్త చాటుగా, చీకటిలో చేస్తే, కొంచెపు పనికి కించపాటు వ్యక్తమైంది లెమ్మని సంతృప్తిపడతాము. కానీ, బాహాటంగా, పచ్చిగా, అందరికీ తెలిసేట్టుగా, మా వైపు ఉంటే ఇది, లేకుంటే మరొకటి అని హెచ్చరిస్తున్నట్టుగా జరిగినప్పుడు, అది తెగింపా, బరితెగింపా, అధికారపు అహంకారమా?

ఎక్కువ కలవరపెట్టేది ఈ నిస్సంకోచపు అధికార వికారమే. కానీ, దాని వెనుక ఒక వ్యూహం పనిచేయడం నిజమైతే, ఈ దుస్థితికి చేరినందుకు జనం మీద జాలిపడాలి. అపూర్వానంద్ అనే ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకుడు బిబిసి మీద పన్ను‘దాడుల’ను విశ్లేషిస్తూ, ఈ ప్రతీకారచర్యలను ప్రజల మీద ప్రయోగిస్తున్న మనోవైజ్ఞానిక క్రీడలుగా వ్యాఖ్యానించారు. జి–20 దేశాల అధ్యక్ష స్థానంలో ఉండి, ప్రపంచం దృష్టి అంతా భారత్ మీద ఉన్నప్పుడు, మీడియా సంస్థల మీద ప్రతీకారచర్యలు తీసుకోవడం వల్ల ఎంతటి అప్రదిష్ఠ వస్తుందో తెలిసినా, దేశప్రజల మనస్సులలో మాత్రం మోదీ సాహసం మీద, ఎదురుదాడి చేయగలిగే శక్తి మీద విశ్వాసాన్ని ఇనుమడింపజేస్తుందని ఆయన రాశారు. అంటే, అహంకారం అని కొందరు అనుకుంటున్నది, వారి దృష్టిలో ధిక్కారమన్నమాట! నిజమే, ధిక్కారానికి ఆకర్షణ ఉంటుంది,

చేస్తున్నవాళ్లు అందుకే చేస్తుండవచ్చును కానీ, జనం ఎల్లకాలం, ఈ కల్పిత ధైర్యసాహసాలకు, మాయాక్రీడలకు లోనవుతారా? చరిత్ర మీద యుద్ధం, పొరుగు మీద యుద్ధం, అంతర్గత శత్రువుల పేరుతో కొందరిమీద యుద్ధం, వాస్తవంలో బలశాలి అగ్రరాజ్యాలకు విధేయంగా ఉంటూ, మీడియా, ఎన్జీవోలు వంటి మెతకలక్ష్యాల మీద ప్రతాపం చూపడం, వీటన్నిటినీ నమ్ముతూ పోతారా? ఎప్పటికో అప్పుడు, సత్పరిపాలన ఇది కాదు అన్న స్పృహ కలగదా?

కె. శ్రీనివాస్

Updated Date - 2023-02-16T01:24:44+05:30 IST