మహిళారిజర్వేషన్: మరో ‘జుమ్లా’ !
ABN , First Publish Date - 2023-09-23T00:32:56+05:30 IST
భారతదేశ రాజ్యాంగబద్ధ, పార్లమెంటరీ చరిత్రలోని ముఖ్య తేదీలలో ప్రముఖంగా ప్రస్తావనార్హమైనవి మూడు ఉన్నాయి. అవి: (1) సెప్టెంబర్ 12, 1996– ప్రధానమంత్రి దేవెగౌడ ప్రభుత్వం రాజ్యాంగ (81వ సవరణ)...
భారతదేశ రాజ్యాంగబద్ధ, పార్లమెంటరీ చరిత్రలోని ముఖ్య తేదీలలో ప్రముఖంగా ప్రస్తావనార్హమైనవి మూడు ఉన్నాయి. అవి: (1) సెప్టెంబర్ 12, 1996– ప్రధానమంత్రి దేవెగౌడ ప్రభుత్వం రాజ్యాంగ (81వ సవరణ) బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. ఇంతకు మించి ఆ బిల్లు ఆమోద ప్రక్రియలో ఎటువంటి పురోగతి లేదు; (2) మార్చి 9, 2010– ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రాజ్యాంగ (108వ సవరణ) బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. 1996 బిల్లు లాంటిదే ఇది కూడా. 186:1 ఓట్లతో ఈ బిల్లు ఆమోదం పొందింది. దానిని లోక్‌సభకు పంపించారు. అయితే అది అక్కడ పెండింగ్‌లో ఉండిపోయింది. 15వ లోక్‌సభ రద్దు కావడంతో ఆ బిల్లుకు కాలం చెల్లిపోయింది; (3) సెప్టెంబర్ 18, 2023 – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగ (128వ సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. గతంలోని రెండు బిల్లుల వలే ఇది కూడా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించాలని ప్రతిపాదించింది. అయితే ఈ బిల్లులో మూడు షరతులు ఉన్నాయి. అవి దిగ్భ్రాంతికరమైన షరతులు.
పార్లమెంటు ఉభయ సభలూ ‘నారీశక్తి వందన–2023’ ను ఆమోదించాయి. రాష్ట్రపతి ఆమోదంతో అది కొత్త అధికరణ 334ఎ కింద అమలులోకి వస్తుంది. ఈ విషయమై ఆ బిల్లు ఇలా పేర్కొంది : రాజ్యాంగ (128వ సవరణ) చట్టం అమలు మొదలయి, జనాభా గణన జరిగి, దాని వివరాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తరువాత మహిళా రిజర్వేషన్ చట్టం అమలవుతుంది’.
జనాభా గణన వాస్తవానికి 2021 సంవత్సరంలోనే జరగవలసి ఉన్నది. సహేతుకం కాని కారణాలతో జన గణనలో జాప్యం జరుగుతోంది. జనాభా గణన దేశ వ్యాప్తంగా జరిగే కార్యక్రమం. దాని ఫలితాలను ప్రచురించేందుకు రెండు సంవత్సరాల సమయం పడుతుంది. తదుపరి జనాభా గణన తేదీ ఇంకా నిర్ధారణ కాలేదు. ఇదొక అనిశ్చిత పరిస్థితి.
రాజ్యాంగ అధికరణ 82లోని మూడో నిబంధన ప్రకారం లోక్‌సభలో ప్రతీ రాష్ట్రానికి సీట్ల పునః కేటాయింపును 2026 వరకు నిలిపివేశారు. ‘ఒక వ్యక్తి, ఒక ఓటు’ సూత్రం ప్రకారం దక్షిణ భారతావని, పశ్చిమ భారత రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గిపోతుంది. ఉత్తరాది రాష్ట్రాల సీట్ల సంఖ్య పెరుగుతుంది. సీట్లను కోల్పోయే రాష్ట్రాలు ఈ పరిస్థితిని అంగీకరిస్తాయా? నాణ్యమైన విద్యావసతులు, మెరుగైన ఆరోగ్యభద్రతా సదుపాయాలు కల్పించి, కుటుంబ నియంత్రణ గురించి విస్తృతంగా, విపులంగా, సుబోధకంగా ప్రచారం చేసి ప్రజలను అందుకు అన్ని విధాల సంసిద్ధులను, సుముఖులను చేసినందుకు తమను ఈ విధంగా శిక్షిస్తున్నారని దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. 2026 అనంతరం చేపట్టే మొదటి జనాభా గణన ఫలితాలను ప్రచురించిన అనంతరం రాష్ట్రాలకు సీట్ల పునః కేటాయింపునకు రాజకీయ అవరోధాలు ఏర్పడే అవకాశమున్నది. లోక్‌సభలో రాష్ట్రాలకు సీట్ల పునః కేటాయింపు అనంతరం కొత్త ‘డీ లిమిటేషన్ చట్టం’ కింద నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చివరిసారి 2002లో ఆరంభమై ఆరేళ్ల అనంతరం 2008 ఫిబ్రవరి 19న ముగిసింది.
ఆయా ప్రక్రియల అనుక్రమం ఇలా ఉంటుంది: 2026 అనంతరం మొదటి జనాభా గణన, ఫలితాల ప్రకటన; లోక్‌సభలో రాష్ట్రాలకు సీట్ల పునః కేటాయింపు; కొత్త డీలిమిటేషన్ చట్టం; నియోజకవర్గాల పునర్విభజన. ఇవన్నీ పూర్తయిన తరువాతే మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి. అయితే ఈ వరుసలోని ప్రతీ ప్రక్రియను ముగించే తేదీ ఏమిటో ఇంకా నిర్ధారించలేదు. ఈ అనిశ్చిత సంఘటనలపై మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు ఆధారపడి వున్నది. మొత్తం మీద ఈ కొత్త రిజర్వేషన్ల అమలు ప్రారంభమయ్యేది 2029 సంవత్సరం తరువాతే కావచ్చని నేను భావిస్తున్నాను.
చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు అమలుపరచడంలో ఎదురయ్యే అవరోధాలు, ఆటంకాల గురించి మోదీ ప్రభుత్వానికి తెలియదా? 1996, 2010 సంవత్సరాలలో ప్రవేశ పెట్టిన బిల్లులలో అటువంటి అవరోధాలు లేవు. మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ అవరోధాలను కల్పించిందని మహిళలు ఆరోపిస్తే అది పూర్తిగా సమర్థనీయమే అవుతుంది. గౌరవనీయ ప్రధానమంత్రి సెప్టెంబర్ 19న మూడు వేర్వేరు సందర్భాలలో చేసిన వ్యాఖ్యలలో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో ఎదురయ్యే అవరోధాలను తమ ప్రభుత్వం ఎలా అధిగమించనున్నదో వెల్లడించలేదు. ఆ బిల్లుకు ముందుగా విధించిన షరతులపై ప్రభుత్వ మౌనం ఒక శుభ శకునాన్ని సూచించడం లేదు. మహిళా బిల్లు అమలు బాధ్యతను తదుపరి ప్రభుత్వం లేదా ఆ తరువాత వచ్చే ప్రభుత్వంపైనే మోదీ సర్కార్ మోపదలుచుకున్నదనేది స్పష్టం. ఒక పండ్ల బుట్టను మహిళలకు ఇచ్చి అందులోని ఫలాలు సమీప భవిష్యత్తులో తినకూడదని ఆంక్షలు విధించడంలా ‘నారీశక్తి వందన్–2023’ వ్యవహారం ఉందనడం సత్య దూరం కాదు.
మహిళలు అనేక జీవన రంగాలలో బాగా వెనుకబడి ఉన్నారు. పార్లమెంటు, రాష్ట్ర శాసన వ్యవస్థలతో సహా వివిధ రంగాలలో వారికి సరైన ప్రాతినిధ్యం లేదు. వారి సంప్రదాయ సామాజిక హోదా, అస్వతంత్ర ఆర్థిక ప్రతిపత్తే అందుకు కారణాలుగా చెప్పవచ్చు. నిమ్న సామాజిక హోదా, వ్యక్తిగత ఆదాయం తక్కువగా ఉండడం, గృహిణి బాధ్యతలు సంయుక్తంగా చాలా మంది మహిళలను కుటుంబ బాధ్యతలకే పరిమితం చేస్తున్నాయి. తత్కారణంగానే రాజకీయ కార్యకలాపాలలో వారు సరైన స్థాయిలో పాల్గొనలేకపోతున్నారు. రాజకీయ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ఇతోధికంగా పెంపొందించేందుకు దివంగత ప్రధానమంత్రులు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు చొరవ తీసుకున్నారు. స్థానిక స్వపరిపాలనా సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే చట్టాలను వారు తీసుకొచ్చారు. ఆ కొత్త చట్టాల ఫలితంగానే గ్రామ పంచాయత్‌లకు, పురపాలక సంఘాలకు దాదాపు 13 లక్షల మంది మహిళలు ఎన్నికవుతున్నారు. ఈ ప్రగతిశీల పరిణామ తదుపరి తార్కిక పురోగతి లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించడమే. చట్ట సభలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంపొందించాలనే భావన మూడు దశాబ్దాల క్రితం అంకురించింది. అయితే అది ఇంతవరకూ పూర్తిగా ఆచరణలోకి రాలేదు. దాని అమలులో ఇంకెంత మాత్రం జాప్యం కూడదు. మహిళలు తమ ఓటు శక్తి ఏమిటో గ్రహించిన కాలమిది.
ప్రస్తుతమున్న నియోజకవర్గాల నుంచే కొన్ని నియోజకవర్గాలను గుర్తించి, వాటిని మహిళలకు ప్రత్యేకంగా కేటాయించాలి. ఇందుకు జనాభా గానీ, నియోజకవర్గాల పునర్విభజన గానీ అవసరం లేదు. ఓటర్ల జాబితాలను తాజాగా సవరించితే సరిపోతుంది (ఇప్పుడు అన్ని రాష్ట్రాలలోనూ పంచాయత్‌లు, పురపాలక సంఘాలలో మహిళలకు సీట్లను రిజర్వ్ చేసేందుకు ప్రస్తుతమున్న ఓటర్ల జాబితాలనే ఉపయోగిస్తున్నారు).
చట్ట సభలలో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ‘నారీ శక్తి వందన–2023’ బిల్లును రూపొందించి, పార్లమెంటు ఉభయ సభలలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. ఈ బిల్లు ఫలితంగా రాజ్యాంగంలో కొత్త అధికరణ 344ఎ ను చేర్చారు. అయితే మహిళా రిజర్వేషన్ల అమలును దారి మళ్లించి, జాప్యం చేసే ప్రయత్నంలో భాగమే ఆ కొత్త అధికరణ. మహిళా రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వ చిత్తశుద్ధి రాహిత్యానికి అదొక మేలి ముసుగు మాత్రమే. ఆ కొత్త అధికరణను రాజ్యాంగం నుంచి తొలగించాలి.
జుమ్లా అనేది ఒక హిందీ పదం. దానికి అర్థం ఒక ధూర్త చర్య లేదా ఒక ధూర్త ప్రకటన అని చెప్పవచ్చు. 2014లోను, 2019లోను సార్వత్రక ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అనేక జుమ్లాలను చేపట్టడం లేదా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు మరొక జుమ్లా మాత్రమే.
పి. చిదంబరం
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)