దేశ వ్యాప్తంగా 23 నూతన సైనిక్ స్కూళ్లు
ABN , First Publish Date - 2023-09-17T08:37:41+05:30 IST
భాగస్వామ్య విధానంలో దేశంలో 23 నూతన సైనిక పాఠశాలల ఏర్పాటుకు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఆమోదం తెలిపారని అధికారులు
- భాగస్వామ్య పద్ధతిలో ఏర్పాటు.. ఏపీలో ఒకటి, తెలంగాణలో లేదు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: భాగస్వామ్య విధానంలో దేశంలో 23 నూతన సైనిక పాఠశాలల ఏర్పాటుకు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఆమోదం తెలిపారని అధికారులు శనివారం ప్రకటించారు. ఈ నూతన సైనిక పాఠశాలలు ఆయా రాష్ట్రాల స్కూల్ బోర్డులకు అనుబంధంగా ఉండి సైనిక్ స్కూల్స్ సొసైటీ నిబంధనల మేరకు పనిచేస్తాయని రక్షణశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పులివెందుల మండలంలో ఒక సైనిక పాఠశాల ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో ఏర్పాటు చేయడం లేదు. దేశవ్యాప్తంగా 100 సైనిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఎన్జీవోలు, ప్రైవేటు పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఇలా 19 సైనిక పాఠశాలల ఏర్పాటుకు సైనిక్ స్కూల్స్ సొసైటీ ఒప్పందం చేసుకుంది. దీంతో భాగస్వామ్య పద్ధతిలో మొత్తం 42 సైనిక పాఠశాలలు ఏర్పాటైనట్లు అవుతుంది. ఇవిగాక పాత విధానంలో 33 సైనిక పాఠశాలలు పనిచేస్తున్నాయి.