Art Director AS Prakash : ఇష్టపడితే... కష్టమనిపించదు...
ABN , First Publish Date - 2023-01-21T23:03:23+05:30 IST
సృష్టికి ప్రతిసృష్టి చేయడం బ్రహ్మకే కాదు.. కళా దర్శకులకూ సాధ్యమే! దర్శకుడి ఊహని అర్థం చేసుకొని.. దానికి అనుగుణంగా కళాకృతులకు ప్రాణం పోస్తుంటారు. ఓ మంచి కళా దర్శకుడు ఉంటే తాజ్ మహల్ కోసం ఆగ్రా వెళ్లక్కర్లెద్దు... ఊరి బయట కాస్త విశాలమైన చోటు అందిస్తే చాలు
సృష్టికి ప్రతిసృష్టి చేయడం బ్రహ్మకే కాదు.. కళా దర్శకులకూ సాధ్యమే! దర్శకుడి ఊహని అర్థం చేసుకొని.. దానికి అనుగుణంగా కళాకృతులకు ప్రాణం పోస్తుంటారు. ఓ మంచి కళా దర్శకుడు ఉంటే తాజ్ మహల్ కోసం ఆగ్రా వెళ్లక్కర్లెద్దు... ఊరి బయట కాస్త విశాలమైన చోటు అందిస్తే చాలు. వాళ్లు తలచుకొంటే ఆకాశంలోని పాలపుంతల్ని అన్నపూర్ణ స్డూడియో ఫ్లోర్లోకి దించేస్తుంటారు. ఏ.ఎస్.ప్రకాశ్ కూడా అంతే. విశాఖలో ఉండాల్సిన జాలరి పేటని హైదరాబాద్ శివార్లకు షిఫ్ట్ చేశారు. ‘వాల్తేరు వీరయ్య’ కోసం. ఈ సినిమా లోని సెట్లు ప్రకాశ్ కళా నైపుణ్యానికి అద్దం పడతాయి. ఆర్ట్ డైరెక్టర్‌గా బిజీగా ఉన్న ప్రకాశ్‌తో కాసేపు మాట్లాడితే...
సంక్రాంతికి మీ రెండు సినిమాలు విజయాలు అందుకోవడం ఎలా ఉంది?
చాలా సంతోషంగా ఉందండి. అయితే బాలయ్య బాబుతో గతంలో చేశాను. చిరంజీవి గారితో ఇదే తొలిసారి. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న అవకాశం ఇది.
‘వాల్తేరు వీరయ్య’ కోసం సెట్ వేయడం కష్టంగా అనిపించిందా?
నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ చేశా. అప్పుడు స్కెచింగ్ కోసం రోజూ జాలరిపేటకు వెళ్లేవాణ్ణి. తరచూ వెళ్లడంవల్ల ఆ ప్రాంతం నాకు బాగా గుర్తుండిపోయింది. అందుకే ‘వాల్తేరు వీరయ్య’లో చాలా సులభంగా సెట్ వేయగలిగాను. దాన్ని కష్టం అనలేం. దర్శకుడి ఊహకు రూపం ఇవ్వడం మాత్రమే.
ఒక ఊరినే సృష్టించడం అంత సులువు కాదు కదా?
ఇదంతా మనం రెగ్యులర్‌గా చేసే వర్క్‌లో భాగం. నాకు తెలిసిన పని ఇది. దాన్ని స్ర్కిప్ట్‌కు తగ్గట్లుగా డిజైన్ చేయడమే. ఇందులో కష్టం అనేది ఏమీ లేదు. తదేక దృష్టితో, ఇష్టపడి చేయడమే. ఇష్టపడి చేసే పనిలో ప్రేమ ఉంటుంది. అలాంటప్పుడు సహజంగానే మంచి అవుట్‌పుట్ వస్తుంది. నాకు నచ్చిన పని ఇది.
ఆర్ట్ డైరెక్టర్‌గా మీ ప్రయాణం ఎలా మొదలైంది?
ఆంధ్రా యూనివర్సిటీలో ఫైన్‌ఆర్ట్స్ చేశాక సినీ రంగంపై ఆసక్తితో పరిశ్రమకు వచ్చాను. నా గోల్ ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలని. నేను ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా చేయలేదు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ వచ్చాను. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయడానికి మాత్రం కొన్నాళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ‘వాల్తేరు వీరయ్య’తో పాటే ‘భోళాశంకర్’ కూడా అంగీకరించాను. ఈ సినిమా కోసం కోల్‌కతా సెట్ వేశాను. ‘వాల్తేరు వీరయ్య’లో మెజారిటీ పార్ట్ సెట్స్‌లోనే షూట్ చేశారు. కాకపోతే క్లైమాక్స్‌లో వేసిన సెట్‌కు జనాల్లో బాగా గుర్తింపు వచ్చింది. షిప్ ఫైట్ అంతా ఫ్లోర్‌లోనే చేశాం. పాట కోసం జాలరిపేట వీధి సెట్ వేశాం. అలాగే పాట చివరలో వచ్చే సెట్, డ్రగ్స్ ఉన్న షిప్ కోసం ఇంటీరియర్ సెట్ వేశాం. చిరంజీవి గారిని అవుట్‌డోర్‌కు తీసుకువెళ్లి చేసే వీలు ఉండదు. అందుకే మారేడుమిల్లి, వైజాగ్‌లో కొంత చిన్న పార్ట్ మినహా మిగతా అంతా సెట్స్‌లోనే షూట్ చేశాం.
ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్లకి ఉన్న సవాళ్లు ఏమిటి?
ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. ఆర్ట్ డైరెక్షన్‌లో పని చేయడానికి అందరూ బాగా చదువుకున్నవాళ్లే వస్తున్నారు. వాళ్లు ఫ్రెష్ థాట్స్‌తో అడుగుపెడుతున్నారు. వారి సాంకేతికత బాగా అక్కరకొస్తోంది. సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా, మన మెదడులో మెదిలిందే పేపర్ మీదకు వస్తుంది.
‘అవతార్’ తరహా సాంకేతికత మన దగ్గర ?
ఇప్పటికే మన దగ్గర ప్రారంభమైంది. సీజీనే కాదు వర్చువల్ స్టూడియోలు కూడా వస్తున్నాయి. మన టెక్నీషియన్లు అందరూ శిక్షణ పొందుతున్నారు. హాలీవుడ్‌కు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఏ టెక్నాలజీ అయినా ముందు అక్కడికి వెళుతుంది. సాంకేతికతను ఇక్కడకు తెచ్చుకోవడం సులువే. కానీ దానిమీద పెట్టుబడి పెట్టేవాళ్లు కావాలి. దానిమీద నమ్మకం రావాలి. ఇక్కడ దాన్ని నేర్పుగా ఉపయోగించే టెక్నీషియన్లు లేకపోయినా ఇబ్బందే. ఆసక్తి ఉన్న కొంతమంది ఇక్కడి నుంచి హాలీవుడ్‌కి వెళ్లి శిక్షణ పొందుతున్నారు. లోకల్ స్టూడియోవాళ్లు కూడా వర్చువల్ టెక్నాలజీలో శిక్షణ కోసం సిబ్బందిని పంపుతున్నారు.
ఇప్పటివరకు మీకు వచ్చినవాటిలో ఉత్తమ ప్రశంస?
ఈ మధ్య చిరంజీవిగారి నుంచి వచ్చిన ప్రశంసలు ఆనందాన్నిచ్చాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం వేసిన సెట్ ఆయనకు బాగా నచ్చింది. నేను అప్పుడు వేరే సెట్‌లో ఉంటే పిలిపించారు. ‘మొత్తం ఆర్ట్ వర్క్ ఇంటర్నేషనల్ స్టైల్లో ఉంది. ఆ కేర్ గానీ, ఆ ఫినిషింగ్ గానీ, అంతా రియల్‌లానే అనిపిస్తోంది’ అన్నారు. సాధారణంగా ఆయన సెట్‌లో ఫొటో సెషన్‌కు ఒప్పుకోరు. అలాంటిది నన్ను పక్కన కూర్చోబెట్టుకుని, నా భుజం మీద చేయివేసి ఫొటో దిగారు. అది ఆయనతో నాకు ఫస్ట్ థ్రిల్. తర్వాత వేరే సెట్ వేస్తుంటే చూడడానికి వచ్చారు. ‘హాలీవుడ్ సెట్‌లా ఉంది’ అని ప్రశంసించారు.
బెటర్‌మెంట్ కోసం చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి?
సాధారణంగా ఫస్ట్ స్కెచ్ ఓకే అయిపోతుంది. కొన్నిసార్లు మాత్రం ఆప్షన్స్ పెట్టుకుంటాం. కష్టం అనేది ఏదీ ఉండదు. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్లి దాన్ని ఈజీ చేస్తాం. మనకు కావాల్సిన అవుట్‌పుట్ తేవడానికి ట్రై చేస్తాం. నా పని నాకు ఎప్పుడూ కష్టంగా అనిపించలేదు. చేసినకొద్దీ ఇంకా బాగా చేయాలనే కోరిక, మెరుగ్గా చేయాలనే తపన పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కడా వదలకూడదు అనే కసితో పని చేస్తాను.
పని నాణ్యతలో రాజీపడిన సందర్భాలు ఉన్నాయా?
మొదట నేను స్కెచ్, డిజైన్స్ వేసుకున్నాక ఒక బడ్జెట్ అనుకొంటాను. దాన్ని నిర్మాతల ముందు పెడతాను. వాళ్లు అంత బడ్జెట్ పెట్టలేం అంటే దాన్ని మళ్లీ రీడిజైన్ చేసుకొని, దర్శకుడి దగ్గరకు తీసుకెళతాను. ఆయన ఓకే అంటే మళ్లీ నిర్మాతలతో మాట్లాడి ఆమోదం తీసుకుంటాను. సాధ్యమైనంతవరకూ చెప్పిన బడ్జెట్‌లోనే చేయడానికి ప్రయత్నిస్తాను. లేదంటే ‘కొంచెం ఖర్చు పెడితే మంచి అవుట్‌పుట్ వస్తుంద’ని నిర్మాతలకు చెబుతాను. ‘వాల్తేరు వీరయ్య’ సెట్ ఉంది. దాన్ని ఫ్లోర్‌లో వేయాలి. నైట్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి ఫ్లోర్‌లో అయితే పగటిపూట కూడా షూట్ చేసుకోవచ్చు. చిరంజీవి లాంటి స్టార్‌ని పెట్టుకొని మళ్లీ నైట్ టైమ్, క్లైమెట్‌లు చేయాలి అంటే కుదరదు. అందుకే హీరో, డైరెక్టర్‌లను కన్విన్స్ చేశాను.
కళా విభాగంలో వస్తున్న మార్పులను ఎలా చూస్తారు?
టెక్నాలజీ, జనరేషన్‌తో పాటు మనం కూడా మారాలి. ఒకప్పుడు అంతా ఫ్లోర్‌లో చేసేవాళ్లు. తర్వాత ఔట్‌డోర్స్‌లో చేశారు. ఆ రోజుల్లో జనాల దగ్గరా కెమెరా, సెల్‌ఫోన్ ఉండేవి కాదు. ఇప్పుడు ఔట్‌డోర్‌లో చిన్న సీన్ చేద్దామన్నా ఎవరో ఒకరు షూట్ చేస్తున్నారు. స్టార్స్‌తో అలా చేయడం అసాధ్యం. అన్ని కోట్లు ఖర్చుపెట్టి ఒక సాంగ్, సీన్ లాంటివి చిత్రీకరిస్తున్నప్పుడు ఇండోర్‌లోనే చేయాలి. ‘ఒక్కడు’ సినిమాను కొండారెడ్డి బురుజు దగ్గర షూట్ చేశారు. ఇప్పుడు అసాధ్యం. అక్కడ చేయలేమనే కొండారెడ్డి బురుజు సెట్ వేశాం.
సెట్ వేయడానికి మన ప్రాంతంలో ఎక్కడ అనుకూలం?
వాతావరణ పరంగా కోస్తా ప్రాంతంలో సెట్ వేయడం కొంచెం కష్టమే. ఆర్టిస్టులకు ఇబ్బంది. కాస్ట్యూమ్స్ పాడవుతాయి. వాళ్లకు బ్యాకప్ ఉంటుంది. విజయవాడలో సినిమాలకు సంబంధించిన లొకేషన్లు తక్కువ. వైజాగ్‌లో కొన్ని ప్లేస్‌లు ఉన్నాయి. వాతావ రణం బాగుంది కదా అని విజయవాడలో సెట్ వేయలేం. అలాగని వైజాగ్ కూడా వెళ్లలేకపోతున్నాం. హైదరాబాద్‌లో అయితే సౌకర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు రాజమండ్రి, తమిళనాడు కూడా వెళ్తున్నారు.