Tiruppavai: విరోధులకు వేడి పుట్టించే ఆ బలవంతుడెవరు?..
ABN , First Publish Date - 2023-01-03T23:31:20+05:30 IST
అమ్మవారిని ఆణ్డాళ్ కోరిన తీరులోనే సీతమ్మను అభ్యర్థించిన భద్రాచల రామదాసు... ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన: రోచిష్మాన్
ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం ఇరవయ్యోరోజు; తిరుప్‌పావై ఇరవయ్యో పాసురమ్ రోజు.
పాసురమ్ 20
ఆణ్డాళ్ కృష్ణుణ్ణి నిద్రలేవమనీ, నప్పిన్నైను నిద్రలేవమనీ అంటూ కృష్ణుణ్ణి తమతో స్నానానికి పంపమని నప్పిన్నైను కోరుతూ ఇరవైయ్యో పాసురాన్ని పలుకుతోంది...
మూలం-
ముప్పత్తు మూవర్ అమరర్‌క్కు మున్సెన్ఱు
కప్పన్ తవిర్కుఙ్‌కలియే! తుయిలెళ్షాయ్;
సెప్పమ్ ఉడైయాయ్! తిఱలుడైయాయ్! సెఱ్ట్రార్కు
వెప్పమ్ కొడుక్కుమ్ విమలా! తుయిలెళ్షాయ్;
సెప్పన్న మెన్‌ములై సెవ్వాయ్‌చ్ చిఱుమరుఙ్గుల్
నప్పిన్నై నఙ్గాయ్! తిరువే! తుయిలెళ్షాయ్;
ఉక్కముమ్, తట్టొళియుమ్ తన్దున్ మణాళనై
ఇప్పోదే ఎమ్మై నీరాట్టేలోరెమ్‌పావాయ్!
తెలుగులో-
ముప్పైమూడు మంది దేవతలకు ఆదిగా నిలిచి
భయాన్ని పోగొట్టే గంభీరమైనవాడా! నిద్రలే;
త్రికరణశుద్ధి కలవాడా! బలవంతుడా! విరోధులకు
వేడి పుట్టించే విమలుడా! నిద్రలే;
రాగి కలశాల్లాంటి మెత్తని చన్నులు, ఎఱ్ఱని పెదవులు, చిన్ననడుము ఉన్న
నప్పిన్నై భామా! మేలైనదానా! నిద్రలే;
ఆలవట్టమూ, అద్దమూ, నీ మొగుణ్ణీ ఇచ్చి
ఇప్పటికిప్పుడే మా చేత స్నానం చేయించు; ఓలాల నా చెలీ!
అవగాహన-
కృష్ణుణ్ణి "ముప్పైమూడుమంది దేవతలకు ఆది..." అని అంటోంది ఆణ్డాళ్.
వేదభాగమైన బ్రాహ్మణాల్లో "త్రయః త్రింశో వై దేవాః" అంటే ముప్పైముగ్గురు దేవతలు అని చెప్పడం జరిగింది. ఎనిమిది మంది వసువులు, పదకొండు మంది రుద్రులు, పన్నెండు మంది ఆదిత్యులు, ఒకరు ఇంద్రుడు, ఒకరు ప్రజాపతి. వెరసి ముప్పైముగ్గురు దేవతలు.
"దేవో దానాద్ వా, దీపనాద్ వా, ద్యోతనాద్ వా, ద్యుస్థానో భవతీతి వా" అని దేవత శబ్దానికి వివరణ. అంటే ఇచ్చేది, ప్రకాశించేది, ప్రకాశింపచేసేది ఆపై కాంతి అయి ఉండేది దేవత అని. భగవద్గీత (అధ్యాయం 10 శ్లోకం 2 పాదం 2) లో కృష్ణుడు "అహమాదిర్హి దేవానాం..." అని చెబుతూ తాను దేవతలకు ఆదిని అని తెలియజేశాడు. ఆ మాటను ఆణ్డాళ్ అందిపుచ్చుకుంది.
త్రికరణశుద్ధి (మనోవాక్కాయాలు ఏకమైన స్థితి) కలవాడు బలవంతుడౌతాడు. ఆ బలవంతుడు విరోధులకు వేడి పుట్టిస్తాడు; వాడు విమలుడు. త్రికరణశుద్ధి కలవాడు విమలుడే అవుతాడు. త్రికరణశుద్ధి కలవాడు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు (అరిషడ్వర్గం) అనే విరోధులకు వేడి పుట్టిస్తాడు. ఆహా ఎంత గొప్పగా చెప్పింది ఆండాళ్! "విరోధులకు వేడి పుట్టించే విమలుడా" అని అనడం చాలగొప్పగా ఉంది. కృష్ణుణ్ణి నిద్రలేవమని అభ్యర్థించాక, నప్పిన్నైనూ నిద్రలేవమన్నాక "ఆలవట్టమూ, అద్దమూ, నీ మొగుణ్ణీ ఇచ్చి ఇప్పటికిప్పుడే మా చేత స్నానం చేయించు" అని నప్పిన్నైను అభ్యర్థిస్తోంది ఆణ్డాళ్.
ఆలవట్టం అంటే వస్త్రంతో చేసిన గుండ్రటి విసనకఱ్ఱ. ఆలయాల్లో కైంకర్యంలో భాగంగా ఆలవట్టాన్నీ, అద్దాన్నీ వాడతారు. స్నానం అనేది అనుగ్రహానికి ప్రతీక. స్నానం చేయించు అని అభ్యర్థించడం అనుగ్రహాన్ని ఇప్పించు అని అభ్యర్థించడం అవుతుంది.
వైష్ణవ సంప్రదాయంలో పెరుమాళ్ లేదా భగవంతుడికీ, భక్తులకూ మధ్యలో ఉండి అమ్మవారు లేదా తాయార్ భక్తుల విన్నపాల్ని భగవంతుడికి అందచెయ్యడాన్ని 'పురుషకారం' అంటారు. భక్తులు పెరుమాళ్ దగ్గఱికి వెళ్లే ముందు అమ్మవారు లేదా తాయార్‌ను పూజిస్తారు. తమ కోరికల్ని పెరుమాళ్‌కు అందచెయ్యమని తాయార్‌కు చెప్పుకుంటారు. ఆ విధంగా కృష్ణుణ్ణి తమను అనుగ్రహించేట్లు చెయ్యమని అమ్మవారిని కోరుకుంటోంది ఆణ్డాళ్. ఆ తీరులోనే "నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ" అని అంటూ భద్రాచల రామదాసు తనను రక్షించమని రాముడితో చెప్పమని సీతమ్మను అభ్యర్థించారు.
ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్
తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి
రోచిష్మాన్
9444012279