Tiruppavai: కృష్ణుడు, వేంకటేశ్వరుడు, మగసింహం... ఏమిటీ పోలిక?

ABN , First Publish Date - 2023-01-06T22:48:04+05:30 IST

కృష్ణుణ్ణి ఇలా అంజనీపుష్పవర్ణుడా అని గొప్పగా ఒక్క ఆణ్డాళ్ మాత్రమే అందేమో? ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన: రోచిష్మాన్

Tiruppavai: కృష్ణుడు, వేంకటేశ్వరుడు, మగసింహం... ఏమిటీ పోలిక?
Andal Tiruppavai Pasuram 23

ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో‌ తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి‌ ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పై రోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం ఇరవైమూడోరోజు; తిరుప్‌పావై ఇరవైమూడో పాసురమ్ రోజు.

పాసురమ్ 23

ఆణ్డాళ్ కృష్ణుణ్ణి అనుగ్రహించమంటూ ఇరవైముడో పాసురాన్ని నినదిస్తోంది ఇదిగో ఇలా‌‌...

మూలం-

మారి మలైముళ్షైఞిల్ మన్నిక్కిడత్తుఱఙ్గుమ్

సీరియ సిఙ్గమ్ అఱివుఱ్ట్రుత్ తీవిళ్షిత్తు

వేరి మయిర్‌పొఙ్గ ఎప్పాడుమ్ పోన్దుదరి

మూరి నిమిర్‌న్దు ముళ్షఙ్గి పుఱప్పట్టుప్

పోదరుమాపోలే నీ పూవైప్‌పూ వణ్ణా! ఉన్

కోయిల్ నిన్ఱిఙ్గణే పోన్దరుళి కోప్పుడైయ

సీరియ సిఙ్గాసనత్తిరిన్దు యామ్‌వన్ద

కారియమ్ ఆరాయ్‌న్దరుళేలోరెమ్‌పావాయ్!

తెలుగులో-

వానాకాలంలో కొండగుహలో పడుకుని నిద్రపోతున్న

గొప్ప సింహం మేలుకుని తీక్ష్ణంగా చూసి

నిక్కబొడుచుకున్న జూలును అటూ, ఇటూ విదిలించి

ఒళ్లు విరుచుకుని గర్జించి కదిలి

సాగినట్లుగా అంజనీపుష్పవర్ణుడా! నువ్వు నీ

కోవెలనుండి ఇక్కడికి వచ్చేసెయ్;

దంతాలు పొదిగిన సింహాసనంలో కూర్చుని మేం వచ్చిన

పనేంటో తెలుసుకుని అనుగ్రహించు; ఓలాల నా చెలీ!

అవగాహన-

ఆణ్డాళ్ తొట్టతొలి పాసురమ్‌లో కృష్ణుణ్ణి యశోదకు సింహకిశోరుడు అని అన్నాక ఈ పాసురమ్‌లో మగసింహంతో పోల్చి చెబుతోంది‌.

అన్నమయ్య కూడా వేంకటేశ్వరుణ్ణి సింహం అంటూ ఇలా అన్నారు:

"మలసీఁ జూడరో మగసింహము

అలవి మీఱిన మాయల సింహము

అదివో చూడరో ఆదిమపురుషుని

పెదయౌభళము మీఁది పెనుసింహము

వెదకి బ్రహ్మాదులు వేదాంతులు

కదిసి కానఁగలేని ఘనసింహము

మెచ్చిమెచ్చి చూడరో మితిమీఱినయట్టి

చిచ్చిఱకంటితోడి జిగిసింహము

తచ్చినవారిధిలోన తరుణిఁ గౌఁగిటఁ జేర్చి

నచ్చినగోళ్ళ శ్రీనరసింహము

బింకమునఁ జూడరో పిరితియ్యక నేఁడు

అంకపుదనుజసంహారసింహము

వేంకటనగముపై వేదాచలముపై

కింక లేక వడిఁ బెరిగినసింహము‌"

"అంజనీపుష్పవర్ణుడా" అని కృష్ణుణ్ణి అంది ఆణ్డాళ్. అంజనీ ఒక అరుదైన పువ్వు. ఇది ముదురు నీలం రంగులో ఉంటుంది.‌ కృష్ణుణ్ణి ఇలా అంజనీపుష్పవర్ణుడా అని గొప్పగా ఒక్క ఆణ్డాళ్ మాత్రమే అందేమో?

నీ అనుగ్రహం పొందడమే మా పని అందుకే వచ్చాం ఆ విషయాన్ని తెలుసుకుని అనుగ్రహించమని కృష్ణుణ్ణి కోరుతోంది ఆణ్డాళ్. క్రితం పాసురమ్‌లో శరణు కోరి వచ్చాం అని చెప్పుకున్నాక ఈ పాసురమ్‌లో అనుగ్రహించమని కోరుతోంది. ఈ సందర్భంలో అన్నమయ్య మాటలు "శరణు చొచ్చుట నాది సరుఁగ గాచుట నీది" కూడా గుర్తుకు వస్తున్నాయి.

ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్

తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి

Rochishmon02.jpeg

రోచిష్మాన్

9444012279

Updated Date - 2023-03-06T15:51:41+05:30 IST