Telugu NRI: నా భార్య మరణానికి వాళ్లే కారణం.. శిక్ష పడాల్సిందే.. అమెరికాలో ఓ తెలుగు ఎన్నారై న్యాయ పోరాటం.. సరిగ్గా ఏడాది క్రితం..!

ABN , First Publish Date - 2023-06-10T19:28:20+05:30 IST

అప్పటిదాకా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతున్న ఓ తెలుగు ఎన్నారై సంసారంలో గత ఏడాది ఊహించని ప్రమాదం సంభవించింది. సెలవుల్లో కుటుంబంతో పారాసెయిలింగ్‌కు వెళ్లిన ఆయన ఓ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తన భార్యను పోగొట్టుకున్నారు.

Telugu NRI: నా భార్య మరణానికి వాళ్లే కారణం.. శిక్ష పడాల్సిందే.. అమెరికాలో ఓ తెలుగు ఎన్నారై న్యాయ పోరాటం.. సరిగ్గా ఏడాది క్రితం..!

ఎన్నారై డెస్క్: అప్పటిదాకా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతున్న ఓ తెలుగు ఎన్నారై సంసారంలో గత ఏడాది ఊహించని ప్రమాదం సంభవించింది. సెలవుల్లో కుటుంబంతో పారాసెయిలింగ్‌కు వెళ్లిన ఆయన ఓ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తన భార్యను పోగొట్టుకున్నారు. తనకు తీరని దుఃఖం మిగిల్చిన కంపెనీపై న్యాయపోరాటం ప్రారంభించారు. తన పరిస్థితి ఇతరులకు రాకూడదనే ఈ పోరాటం ప్రారంభించానని ఇటీవల మీడియాతో చెప్పారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రాణాలతో చెలగాటాలాడుతున్న సంస్థల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరించారు.

అసలు ఏం జరిగిందంటే..

గతేడాది మే 30న శ్రీనివాస రావు ఆలపర్తి, తన భార్య సుప్రజ(33), కుమారుడితో పాటూ తనకు బంధువైన మరో బాలుడిని తీసుకుని పారాసెయిలింగ్(Parasailing) కోసం ఫ్లోరిడా(Florida) కీస్‌కు వెళ్లారు. మొత్తం 11 మంది కుటుంబ సభ్యులు ఈ విహారయాత్రకు వెళ్లారు. సముద్రంపై బోటుకు తాడుతో కట్టి ఉన్న పారాషూట్‌తో గాల్లో ఎగరడమే పారాసెయిలింగ్. లైట్‌హౌస్ పారాసెయిలింగ్ కంపెనీ‌కి చెందిన బోటులో శ్రీనివాస్ కుటుంబం పారాసెయిలింగ్‌కు సిద్ధమయ్యింది. అయితే, వారు బోటులో వెళ్లకమునుపే వాతావరణం ప్రతికూలంగా మారడం ప్రారంభించింది.

1.jpg

కానీ బోటు కెప్టెన్ మాత్రం పారాసెయిలింగ్ చేద్దామని అందరినీ బోటులో ఎక్కించుకుని సముద్రంలోకి వెళ్లాడు. మొదటగా ముగ్గురితో విజయవంతంగా పారాసెయిలింగ్ చేయించాడు. కానీ, శ్రీనివాసరావు భార్య, ఇద్దరు చిన్నారుల వంతు వచ్చేసరికి వాతావరణం భయానకంగా మారింది. సముద్రంలో వేగంగా గాలులు వీస్తుండడంతో సుప్రజ, ఇద్దరు చిన్నారులు ఉన్న పారాషూట్ గాలికి కొట్టుకుపోవడం ప్రారంభించింది. దీంతో, పారాషూట్‌తో పాటూ బోటు కూడా గాలికి కొట్టుకుపోవడం మొదలెట్టింది. బోటును నియంత్రించడం కెప్టెన్‌కు కష్టంగా మారింది.

5.jpg

ఈ క్రమంలో అతడు బోటుకు కట్టిఉన్న పారాషూట్‌ తాడును తెంచేశాడు. దీంతో, సుప్రజా ఇద్దరు పిల్లలూ పారాషూట్‌తో పాటూ గాల్లోకి ఎగిరిపోయారు. చివరకు ఓ బ్రిడ్జీని ఢీకొన్నారు. ఈ క్రమంలో సుప్రజ ఘటనాస్థలంలోనే మరణించగా పిల్లలు మాత్రం తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ విషాద ఘటన శ్రీనివాస రావు జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. దీంతో, అతడు తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగగుండా ఉండేందుకు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. గతేడాదేపారాసెయిలింగ్ కంపెనీపై కేసు వేసిన ఆయన తాజాగా బోటు కెప్టెన్, సిబ్బందితో పాటూ తాను దిగిన రిసార్ట్‌ను నిర్వహించే కెప్టెన్ పిప్స్ హోల్గిండ్ ఎల్ఎల్‌సీపై కూడా కేసు వేశారు.

3.jpeg

ఈ సందర్భంగా నిర్వహించిన పత్రికా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ తమకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ కంపెనీలను మేము నమ్మాము. కానీ వారు మా నమ్మకాన్ని దారుణంగా వమ్ము చేశారు. మా కుటుంబానికి పట్టిన దుర్గతి మరెవరికీ కలగకూడదన్నదే మా లక్ష్యం’’ అని అన్నారు.

ఈ ఘటనపై శ్రీనివాసరావు తరపు లాయర్ కూడా స్పందించారు. బోటు కెప్టెన్ భద్రతా నిబంధనలన్నీ గాలికొదిలేశారని ఆరోపించారు. తమ వెంట లైఫ్ జాకెట్లను కూడా తేలేదని చెప్పారు. పారాషూట్‌ను కిందకు దించేందుకు బోటు దిశను పదే పదే మారుస్తూ ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ఏకంగా బోటుకు కట్టి ఉన్న పారాషూట్ తాడునే తెంపేశారని మండిపడ్డారు. వారు బ్రిడ్జిని ఢీకొన్నారని తెలిసీ అతడు మళ్లీ నీళ్లల్లోకి వెళ్లి వారిని కాపాడేందుకు నిరాకరించాడని, తన వద్ద లైఫ్ జాకెట్లు లేని విషయాన్ని సాకుగా చెప్పాడని పేర్కొన్నారు. కెప్టెన్ అన్ని నియమాలను ఉల్లంఘించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితుల తరపున వాదిస్తున్న మరో లాయర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-06-10T19:28:23+05:30 IST