NRI: మరణ శయ్యపై ఉన్నట్టు అనిపించింది..సూడాన్‌లో భారతీయులకు షాకింగ్ అనుభవాలు

ABN , First Publish Date - 2023-04-27T16:39:42+05:30 IST

ఘర్షణలతో అట్టుడుకుతున్న సూడాన్‌ నుంచి భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. భారత్‌లో దిగాక తన అనుభవాలను మీడియాతోె పంచుకుంటున్నారు.

NRI: మరణ శయ్యపై ఉన్నట్టు అనిపించింది..సూడాన్‌లో భారతీయులకు షాకింగ్ అనుభవాలు

ఎన్నారై డెస్క్: ఘర్షణలతో అట్టుడుకుతున్న సూడాన్‌(Sudan) నుంచి భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు(Indian Evacuated). సౌదీ అరేబియా సాయంతో భారత ప్రభుత్వం వీరిని సురక్షితంగా స్వదేశానికి తరలిస్తోంది. ఆపరేషన్ కావేరి (Operation Kaveri) పేరిట ఈ తరలింపును నిర్వహిస్తోంది. ఇక బుధవారం తొలి విడతలో 360 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. సొంతగడ్డపై కాలుపెట్టాక అనేక మంది భారతీయులకు టెన్షన్ అంతా తొలగిపోయి ప్రాణాలు లేచివచ్చినట్టైంది. ఈ సందర్భంగా తాము సూడాన్‌లో ఎదుర్కొన్న అనుభవాలను(Recount Sudan terror) మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. దారుణమైన ఘటనలు చూశామని కొందరు చెప్పుకొచ్చారు.

మరణశయ్యపై ఉన్నట్టు అనిపించింది..

సూడాన్‌లో తమకు మరణ శయ్యపై ఉన్నట్టు అనిపించిందని హరియాణాకు చెందిన సుఖ్వీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇంటికి తలుపులు వేసుకుని లోపలే ఉండిపోయామని చెప్పుకొచ్చారు.

తాను మళ్లీ భారత్‌లు కాలుపెడతానని అనుకోలేదని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఛోటూ ఎమోషనల్ అయ్యారు. ‘‘మరణం అంచుల వరకూ వెళ్లి వచ్చినట్టైంది. దేశంలోనే ఏదోకటి చేసుకుని పొట్టపోసుకుంటాంగానీ సూడాన్‌కు మాత్రం తిరిగి వెళ్లం’’ అని తెగేసి చెప్పాడు.

ఛాతిపై తుపాకీ గురిపెట్టి..

పారామిలిటరీ దళాలు తమ ఛాతిపై తుపాకీ గురిపెట్టి మరీ డబ్బు దోచుకున్నాయని మరో వ్యక్తి మీడియాతో వాపోయాడు. ‘‘పారామిలిటరీ దళాల మా కార్యాలయానికి కూత వేటు దూరంలో ఓ గుడారం ఏర్పాటు చేసుకున్నారు. ఓ ఉదయం 9.00 గంటలకు మా ఆఫీసులోకి ప్రవేశించారు. దాదాపు ఎనిమిది గంటల పాటు మమ్మల్ని నిర్బంధించారు. మా ఛాతిపై తుపాకీ గురిపెట్టి డబ్బులు దోచుకున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్నారుల ఉక్కిరిబిక్కిరి అయ్యారు..

‘‘సామాన్య పౌరులుండే ప్రాంతాలపై మిసైళ్ల దాడి జరిగింది. మా పొరుగింట్లో ఉండే మహిళ గర్భవతి. అయితే, ఆమె ఇంటిపై మిసైల్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఆమె ఇల్లు మొత్తం నేలమట్టమైంది. ఆమె ఆనవాళ్లు కూడా లభించనంతగా నాశనమైంది. దీంతో, కిటికీల్లోంచి మిసైళ్లు లోపలికి వస్తాయనే భయంతో మేము ఇంటి తలుపులన్నీ వేసేశాం. దీంతో, పిల్లలు గాలీ, వెలుతురు లేక కొన్ని రోజుల పాటు ఉక్కిరిబిక్కిరయ్యారు’’ అని జ్యోతి అగర్వాల్ అనే భారతీయురాలు చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-04-27T16:49:33+05:30 IST