NRI: సుడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రోడ్డు మార్గంలో తరలింపు?
ABN , First Publish Date - 2023-04-23T17:32:13+05:30 IST
రణరంగంగా మారిన సుడాన్ రాజధాని ఖార్తూమ్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రోడ్డు మార్గంలో తరలించే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎన్నారై డెస్క్: రణరంగంగా మారిన సుడాన్ రాజధాని ఖార్తూమ్‌లో(War torn Kartoum) చిక్కుకుపోయిన భారతీయులను రోడ్డు మార్గంలో తరలించే అవకాశాలను(Evacuating Indians) కేంద్రం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణల కారణంగా ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇక సుడాన్‌లో చిక్కుకుపోయిన సుమారు 150 మంది విదేశీయులు శనివారం సౌదీ అరేబియాకు సురక్షితంగా చేరుకున్నారు. వీరిలో భారతీయలతో సహా మొత్తం 12 దేశాల వారున్నారు. సముద్రం మార్గం ద్వారా సౌదీ ప్రభుత్వం వీరిని జెడ్డా నగరానికి తరలించింది. అక్కడి అధికారులు పుప్షగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
ఇతర దేశాలు కూడా తమ పౌరులను ఖార్తూమ్ నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. పౌరులకు రక్షణ కల్పించేందుకు దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ఇప్పటికే సుడాన్ సమీప దేశాల్లో తమ భద్రతా దళాలను మోహరించాయి. ఐరోపా సమాఖ్య కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది.
కాగా, 2021లో అప్పటి ప్రభుత్వంపై ఇరు దళాలు తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. అనంతరం, రెండు వర్గాలకు పొసగక పరస్పర దాడులకు దిగుతూ రాజధానిని రణరంగంగా మార్చాయి. ఈ ఘర్షణలతో(clashes) సామాన్య ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ఇళ్లల్లోనే గడుపుతున్నారు. ఇప్పటికే పలుప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఎండవేడి తాళలేక అల్లాడుతున్నారు. ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోవడంతో కమ్యూనికేషన్ సమస్యగా మారింది.