Green Card: గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు! కారణం ఏంటో చెప్పిన అమెరికా అధికారి
ABN , First Publish Date - 2023-05-19T20:54:14+05:30 IST
అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం విదేశీయులు దశాబ్దాల తరబడి ఎందుకు వేచి చూడాల్సి వస్తోందో అమెరికా అధికారి ఒకరు వివరించారు. గ్రీన్ కార్డుల జారీపై అమెరికా చట్టసభలు విధించిన పరిమితే ఈ పరిస్థితికి కారణమని చెప్పారు.
ఎన్నారై డెస్క్: గ్రీన్ కార్డు సంపాదించి అమెరికాలో స్థిరపడాలనేది ఎందరో ఎన్నారైల కల. కానీ, ఈ అనుమతి కోసం దశాబ్దాల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి ప్రస్తుతం నెలకొంది. దీనిపై అమెరికా పౌరసత్వ వలససేవల శాఖ సలహాదారు డగ్లస్ రాండ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కార్డుల కోసం ఎందుకు ఇంతకాలం వేచి చూడాల్సి వస్తోందో ఆయన వివరించారు. వీసా, దౌత్య సేవల సంబంధిత అంశాలపై అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరణ ఇచ్చారు.
డగ్లస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏటా జారీ చేసే గ్రీన్ కార్డులపై అమెరికా చట్టసభలు పరిమితి విధించాయి. ప్రతి సంవత్సరం 2,26,000 ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్ కార్డులు, 1,40,000 ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులు మాత్రమే జారీ చేసేందుకు అనుమతి ఉంది. ఇక గ్రీన్ కార్డులపై దేశాలవారీగా కూడా పరిమితి అమెరికా కాంగ్రెస్ విధించింది.
‘‘మొత్తం వీసాల్లో ఒక దేశానికి ఏడు శాతం మాత్రమే జారీ చేయాలి. అంటే.. భారత్, చైనా, మెక్సికో దేశాలకు ఏటా 25,620 గ్రీన్ కార్డులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీంతో, ఆయా దేశాల ప్రజలు గ్రీన్ కార్డు కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తోంది. డిమాండ్, సరఫరా మధ్య అంతరం కారణంగా ఈ జాప్యం జరుగుతోంది. గ్రీన్ కార్డుల జారీపై పరిమితి ఉండగా డిమాండ్ మాత్రం నిరంతరంగా పెరుగుతోంది. దీంతో, తగినన్ని కార్డులు జారీ కావట్లేదు. ఒక్క ఇండియా మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది’’ అని డగ్లస్ తెలిపారు.