NRI: విమాన ప్రయాణికురాలికి ఊహించని షాక్.. మరో రాష్ట్రానికి వెళ్లాలనుకుంటే పొరుగు దేశంలో ల్యాండింగ్.. అసలేం జరిగిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-05-07T19:09:11+05:30 IST

ఇటీవల ఓ అమెరికా మహిళకు ఊహించని పరిణామం ఎదురైంది. పక్క రాష్ట్రం వెళ్లేందుకు విమానం ఎక్కిన ఆమె అనూహ్యంగా మరో దేశంలో ల్యాండయ్యింది.

NRI: విమాన ప్రయాణికురాలికి ఊహించని షాక్.. మరో రాష్ట్రానికి వెళ్లాలనుకుంటే పొరుగు దేశంలో ల్యాండింగ్.. అసలేం జరిగిందో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఓ అమెరికా మహిళకు ఊహించని పరిణామం ఎదురైంది. పక్క రాష్ట్రం వెళ్లేందుకు విమానం ఎక్కిన ఆమె అనూహ్యంగా మరో దేశంలో ల్యాండయ్యింది. న్యూజెర్సీకి చెందిన ఎల్లిస్-హబ్బార్డ్ తరచూ ఫిలడెల్ఫియా(పెన్సిల్వేనియా రాష్ట్రం), జాక్సన్‌విల్(ఫ్లోరిడా) నగరాల మధ్య రాకపోకలు సాగిస్తుంటుంది. జాక్సన్ విల్‌లో ఆమెకు ఓ సొంత ఇల్లు ఉంది. అయితే, ఇటీవల ఆమె జాక్సన్‌విల్ వెళ్లేందుకు ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌లో టిక్కెట్ బుక్ చేసుకుంది.

ప్రయాణ తేదీ రోజున ఎల్లిస్ ఎయిర్‌పోర్టుకు యథావిధిగా చేరుకుంది. తను ఎక్కాల్సిన విమానం.. గేట్ వద్ద సిద్ధంగా ఉంది. అయితే, విమానం బయలుదేరడానికి సరిగ్గా 20 నిమిషాల ముందు ఆమె మూత్ర విసర్జనకు వెళ్లింది. తిరిగొచ్చేసరికి ప్రయాణికులు అంతా దాదాపుగా విమానం ఎక్కేశారు. దీంతో, గేట్ వద్ద ఉన్న సిబ్బంది ఆమెను ఆదరాబాదరాగా విమానంలోకి పంపించేశారు. అంతకు కొద్ది క్షణాల మునుపే, ఆమె ఎక్కాల్సిన విమానం మరో గేటుకు మార్చారు. అయితే, ఈ విషయాలేవీ ఆమెకు తెలియదు. దీంతో, మహిళ తన సీట్లో కులాసాగా కూర్చుంది. అయితే, కంగారుగా ఫ్లైట్ ఎక్కిన ఆమెకు లగేజీ సీటు పైన పెట్టుకునే క్రమంలో చేతికి చిన్న గాయం అయ్యింది. దానికి చికిత్స చేసేందుకు వచ్చిన ఎయిర్ హోస్టస్ ఆమెతో కంగారు పడక్కర్లేదని, కొద్ది గంటల్లో మనం జమైకా దేశంలో దిగిపోతామని చెప్పింది. దీంతో, ఆమె భళ్లున నవ్వింది. ఎయిర్ హోస్టస్ జోక్ చేస్తున్నదని అనుకుంటూ.. నేను వెళ్లా్ల్సింది జమైకా కాదు జాక్సన్ విల్ అని చెప్పింది. దీంతో, ఆమెవైపు సీరియస్‌గా చూసిన ఎయిర్ హోస్టస్ మనం నిజంగానే జమైకా వెళుతున్నామని చెప్పడంతో మహిళ మతి పోయినంత పనయ్యింది. అప్పటికి ఆమె వద్ద తన పాస్‌పోర్టు కూడా లేదు. దీంతో, జమైకా ఎయిర్‌పోర్టులో కాలు పెట్టలేని పరిస్థితి.

విమానం జమైకాలో ల్యాండయ్యాక అక్కడి ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెను ఎయిర్‌పోర్టు గేటు, విమానానికి అనుసంధానంగా ఉండే జెట్‌ బ్రిడ్జి‌లోనే నిలిపేశారు. జెట్ బ్రిడ్జి అమెరికా పరిధిలోనిదే కావడంతో పాస్‌పోర్టు లేకపోయినా ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఆ తరువాత కొద్ది గంటలకు మరో విమానంలో ఆమె ఫిలడేల్ఫియాకు చేరుకుంది. కాగా, ఈ ఘటనపై మహిళకు ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ క్షమాపణ చెప్పింది. ఆమె టిక్కెట్ డబ్బులను తిరిగి చెల్లించడమే కాకుండా పరిహారం కింద 600 డాలర్ల విలువైన గిఫ్ట్ వోచర్‌ను కూడా ఇచ్చింది.

Updated Date - 2023-05-07T19:17:58+05:30 IST