IPL 2023 SRH vs PK : వావ్.. రైజర్స్
ABN , First Publish Date - 2023-04-10T00:54:10+05:30 IST
ఇది కదా సన్‌రైజర్స్ నుంచి అభిమానులు ఆశిస్తున్న ఆట.. వరుసగా రెండు ఓటములతో నిరాశపరిచిన ఈ జట్టు ఎట్టకేలకు సొంతగడ్డపై జూలు విదిల్చింది. ముందుగా తమ ప్రధాన
ఆల్‌రౌండ్ షోతో అదుర్స్
బోణీ కొట్టిన హైదరాబాద్
పంజాబ్‌కు ఝలక్
ధవన్ పోరాటం వృథా
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఇది కదా సన్‌రైజర్స్ నుంచి అభిమానులు ఆశిస్తున్న ఆట.. వరుసగా రెండు ఓటములతో నిరాశపరిచిన ఈ జట్టు ఎట్టకేలకు సొంతగడ్డపై జూలు విదిల్చింది. ముందుగా తమ ప్రధాన ఆయుధమైన బౌలింగ్‌తో జోరు మీదున్న పంజాబ్‌ను వణికించగా.. తర్వాత స్వల్ప ఛేదనను రాహుల్ త్రిపాఠి (48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 నాటౌట్), కెప్టెన్ మార్‌క్రమ్ (37 నాటౌట్) అండతో సునాయాసంగా పూర్తి చేసింది. దీంతో హైదరాబాద్ 8 వికెట్లతో గెలిచి బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. స్పిన్నర్ మయాంక్ మార్కండే (4/15) ధాటికి.. ఓపెనర్ ధవన్ (66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 99 నాటౌట్), కర్రాన్ (22) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. ఉమ్రాన్, జాన్సెన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో హైదరాబాద్ 17.1 ఓవర్లలో 145/2 స్కోరు చేసి నెగ్గింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ధవన్ నిలిచాడు.
శతక భాగస్వామ్యం: పంజాబ్ పరుగుల కోసం కష్టపడిన చోట సన్‌రైజర్స్ సులువుగా ఛేదన ముగించింది. త్రిపాఠి, మార్‌క్రమ్ మూడో వికెట్‌కు అజేయంగా 100 పరుగులు అందించారు. ఓపెనర్లు మయాంక్ (21), బ్రూక్ (13) నిరాశపరిచినా, త్రిపాఠి-మార్‌క్రమ్ జోడీ చివరికంటా నిలిచింది. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు బాదుతూ బౌలర్లను దీటుగా ఎద ుర్కొంది. త్రిపాఠి భారీ సిక్సర్‌తో 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. 15వ ఓవర్‌లో త్రిపాఠి 6,4,4.. మార్‌క్రమ్ 4తో 21 రన్స్ వచ్చాయి. ఇక 17వ ఓవర్‌లో మార్‌క్రమ్ 4 ఫోర్లతో చెలరేగడంతో రైజర్స్ విజయం ఖాయమైంది.
వన్ మ్యాన్ షో..: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఇన్నింగ్స్‌లో ధవన్ అసాధారణ ఆటను ప్రదర్శించాడు. ఓవైపు బౌలర్లు వికెట్ల వేట సాగిస్తున్నా.. మరో ఎండ్‌లో మొక్కవోని పట్టుదల ప్రదర్శించాడు. అలాగే చివరి వికెట్‌ను ఆసరా చేసుకుని 55 పరుగులు జోడించాడు. తన మూడు క్యాచ్‌లను భువనేశ్వర్ వదిలేయడం కూడా ధవన్‌కు కలిసొచ్చింది. మిగతా వారు ఇలా వచ్చి అలా వెళ్లడంతో ఓ దశలో వంద స్కోరు కూడా కష్టమే అనిపించింది. మొదటి బంతికే ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్‌ను భువీ ఎల్బీ చేశాడు. తర్వాత జాన్సెన్ వరుస ఓవర్లలో వికెట్లు తీయడంతో పంజాబ్ 22/3 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ స్థితిలో ధవన్-కర్రాన్ జోడీ నాలుగో వికెట్‌కు 41 రన్స్ అందించింది. 9వ ఓవర్ నుంచి స్పిన్నర్ మార్కండే మ్యాజిక్ ఆరంభమవడంతో కష్టాలు రెట్టింపయ్యాయి. అటు ఉమ్రాన్ బౌలింగ్ కూడా జతవడంతో 15 ఓవర్లలో పంజాబ్ స్కోరు 88/9. ఈ దశలో ఆఖరి వికెట్ మోహిత్ రాఠీ (1 నాటౌట్) అండతో ధవన్ పోరాడాడు. ఎక్కువగా తనే స్ట్రయిక్‌ను తీసుకుని 16వ ఓవర్‌లో 2వరుస సిక్సర్లతో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తర్వాతి ఓవర్లలోనూ బౌండరీల మోతతో సెంచరీకి చేరువయ్యాడు. ఆఖరి ఓవర్‌లో మూడంకెల స్కోరు కోసం ప్రయత్నించినా వరుసగా 3 సింగిల్స్ ను వదిలేసి చివరిబంతికి సిక్సర్ బాదడంతో 99 వద్దే ఆగిపోయాడు. పదో వికెట్‌కు ఈ జోడీ మధ్య వచ్చిన 55 పరుగుల్లో 54 ధవన్ సాధించినవే కావడం విశేషం.
స్కోరుబోర్డు
పంజాబ్: ప్రభ్‌సిమ్రన్ (ఎల్బీ) భువనేశ్వర్ 0, ధవన్ (నాటౌట్) 99, మాథ్యూ షార్ట్ (ఎల్బీ) జాన్సెన్ 1, జితేశ్ (సి) మార్‌క్రమ్ (బి) జాన్సెన్ 4, సామ్ కర్రాన్ (సి) భువనేశ్వర్ (బి) మార్కండే 22, సికందర్ (సి) మయాంక్ (బి) ఉమ్రాన్ 5, షారుక్ (ఎల్బీ) మార్కండే 4, హర్‌ప్రీత్ (బి) ఉమ్రాన్ 1, రాహుల్ చాహర్ (ఎల్బీ) మార్కండే 0, నాథన్ ఎలిస్ (బి) మార్కండే 0, మోహిత్ రాఠీ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 143/9; వికెట్లపతనం: 1-0, 2-10, 3-22, 4-63, 5-69, 6-74, 7-77, 8-78, 9-88; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-33-1, జాన్సెన్ 3-1-16-2, నటరాజన్ 4-0-40-0, సుందర్ 1-0-6-0, మయాంక్ మార్కండే 4-0-15-4, ఉమ్రాన్ 4-0-32-2.
సన్‌రైజర్స్: హ్యారీ బ్రూక్ (బి) అర్ష్‌దీప్ 13, మయాంక్ అగర్వాల్ (సి) కర్రాన్ (బి) చాహర్ 21, రాహుల్ త్రిపాఠి (నాటౌట్) 74, మార్‌క్రమ్ (నాటౌట్) 37, ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: 17.1 ఓవర్లలో 145/2; వికెట్లపతనం: 1-27. 2-45; బౌలింగ్: సామ్ కర్రాన్ 3-0-14-0, అర్ష్‌దీప్ 3-0-20-1, హర్‌ప్రీత్ 3.1-0-26-0, నాథన్ ఎలిస్ 3-0-28-0, రాహుల్ చాహర్ 3-0-28-1, మోహిత్ రాఠీ 2-0-29-0.