Ambati Rayudu: ఐపీఎల్ ఫైనల్ తర్వాత.. అంబటి రాయుడు భావోద్వేగ లేఖ.. 2013లో జరిగిన ఆ సందర్భం...

ABN , First Publish Date - 2023-05-30T21:50:32+05:30 IST

ఐపీఎల్‌ ప్రత్యేక గెలుపుతో క్రికెట్ కెరియర్ చివరి అంకానికి చేరుకున్న రాత్రి చాలా భావోద్వేగమైనది. విజయాన్ని ముద్దాడిన ఈ ఆనంద సందర్భంలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాలనుకుంటున్నాను...

Ambati Rayudu: ఐపీఎల్ ఫైనల్ తర్వాత.. అంబటి రాయుడు భావోద్వేగ లేఖ.. 2013లో జరిగిన ఆ సందర్భం...

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023లో (IPL2023) గుజరాత్ టైటాన్స్‌పై ఫైనల్ మ్యాచ్‌కు ముందే తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇక సోమవారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై సాధించిన సంచలన విజయం రాయుడు ఐపీఎల్ రిటైర్మెంట్‌‌కు చక్కటి వీడ్కోలుగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మ్యాచ్ కీలక సమయంలో విలువైన పరుగులు రాబట్టి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో సీఎస్కే ట్రోఫీ అందుకునే సమయంలో వేదికపై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజాతోపాటు అంబటి రాయుడు కూడా ఉన్నాడు. ముగ్గురూ కలిసి ట్రోఫీని పైకెత్తారు.

కాగా ఇంత ఘనంగా రిటైర్మెంట్ దక్కడంపై అంబటి రాయుడు భావోద్వేగానికి గురయ్యాడు. సోషల్ మీడియా వేదికగా మంగళవారం ఒక నోట్‌ను విడుదల చేశాడు.

‘‘ఐపీఎల్‌ ప్రత్యేక గెలుపుతో క్రికెట్ కెరియర్ చివరి అంకానికి చేరుకున్న రాత్రి చాలా భావోద్వేగమైనది. విజయాన్ని ముద్దాడిన ఈ ఆనంద సందర్భంలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాలనుకుంటున్నాను. పసిప్రాయంలో బ్యాట్ పట్టుకున్నప్పుడు ఇంటి వద్ద టెన్నీస్ బాల్‌తో ఆడాను. మూడు దశాబ్ధాలపాటు కొనసాగే అద్భుతమైన క్రికెట్ జర్నీ ఉంటుందని అప్పుడు ఊహించలేదు.

దేశం తరపున అండర్-15కు ప్రాతినిధ్యం వహించడం నుంచి కెరియర్‌లో చేరుకున్న అత్యున్నత స్థితితీ గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. 2013లో నా భారత్ క్యాప్ అందుకున్న రోజు ఇంకా గుర్తుంది. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం. నా సామర్థ్యంపై నమ్మకముంచి, మైదానంలో నన్ను నేను నిరూపించుకునేందుకు అవకాశం కల్పించిన బీసీసీఐ, ఏసీఏ (ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్), హెచ్‌సీఏ (ది హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్), విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ), బరోడా క్రికెట్ అసోసియేషన్‌లకు (బీసీఏ) ధన్యవాదాలు.

ఐపీఎల్‌లో నేను ప్రాతినిధ్యం వహించిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు కూడా ధన్యవాదాలు. 6వసారి ఐపీఎల్ విన్నర్‌గా కెరియర్ ముగించడాన్ని గర్వంగా భావిస్తున్నాను. ముంబై ఇండియన్స్ 2013లో తొలిసారి విన్నింగ్ జట్టు సభ్యుడిగా ఉన్నాను. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 2018, 2021, 2023లో టైటిల్ గెలిచిన సందర్భంలో పొందిన జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి.

ధోనీ అన్న నాయకత్వంలో టీమిండియా, ఐపీఎల్‌లో ఆడడం గౌరవంగా భావిస్తున్నాను. గడిచిన 2 దశాబ్దాల్లో మైదానం, మైదానం వెలుపల కొన్ని గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. అవి ఎప్పటికీ మిగిలివుండి పోతాయి. సహచర సభ్యులు, సపోర్ట్ స్టాఫ్, ఫ్యాన్స్, నా తొలి రోజుల నుంచి కోచ్‌లందరికీ నా కృతజ్ఞతలు. మీ ప్రోత్సాహం నాకెంతో విలువైనది. మరో పార్శ్వంలో కలుస్తాను!’’ అంటూ రాయుడు భావోద్వేగానికి గురయ్యాడు.

Updated Date - 2023-05-30T21:56:06+05:30 IST