IPL2023 Rahane: నిన్న రాత్రి ముంబైపై రహానే అదరగొట్టాడు.. కానీ టాస్‌కు కొన్ని నిమిషాల ముందు ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-04-09T14:26:19+05:30 IST
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానే శనివారం జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టాడు. రుతురాజ్, జడేజా, ధోనీ, కాన్వే వంటి వారి కోసం ముంబై బౌలర్లు ప్రణాళికలు రచించుకుంటే ఉరుముల్లేని పిడుగులా రహానే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి విరుచుకుపడ్డాడు.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానే (Ajinkya Rahane) శనివారం జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టాడు. రుతురాజ్, జడేజా, ధోనీ, కాన్వే వంటి వారి కోసం ముంబై (MI) బౌలర్లు ప్రణాళికలు రచించుకుంటే ఉరుముల్లేని పిడుగులా రహానే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి విరుచుకుపడ్డాడు. అర్షద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వరుసగా 6,4,4,4,4 కొట్టి ఆ ఓవర్లో ఏకంగా 23 పరుగులు చేశాడు. అంతేకాదు ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు వేగవంతమైన హాఫ్ సెంచరీ (19 బంతుల్లో) రికార్డును రహానె నెలకొల్పాడు (Fastest fifty in IPL 2023). మొత్తానికి ఈ మ్యాచ్‌లో 27 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు.
నిజానికి చివరి నిముషం వరకు చెన్నై తుది జట్టులో రహానేకు స్థానం లేదు. టాస్‌కు ముందు అసలేం జరిగిందో మ్యాచ్ అనంతరం రాహానే పంచుకున్నాడు. ``నిజానికి ఈ మ్యాచ్‌లో నాకు స్థానం లేదు. అయితే మొయిన్ అలీ (Moeen Ali) అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో టాస్‌కు ముందు కోచ్ ఫ్లెమ్మింగ్ నా దగ్గరకు వచ్చి ``నువ్వు ఆడుతున్నావు``అని చెప్పారు. నిజంగా అంతా అద్భుతంగా జరిగింది. ఈ మ్యాచ్‌ను చాలా ఎంజాయ్ చేశాన``ని రహానే చెప్పాడు.
IPL 2023: సూర్యకుమార్ యాదవ్‌కు ధోనీ టిప్స్.. మ్యాచ్ అనంతరం మీటింగ్.. వైరల్ అవుతున్న ఫొటో!
కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రహానేను ఐపీఎల్ 2023 మెగా వేలంలో నామమాత్రపు ధరకు చెన్నై దక్కించుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో రహానేకు ఆడే అవకాశం రాలేదు. బెన్ స్టోక్స్, మొయిన్ ఆలీ గాయపడడంతో మూడో మ్యాచ్‌లో (MIvsCSK) తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా అందిపుచ్చుకుని చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.