India-Australia Test : మనోళ్లు మొదలెట్టారు

ABN , First Publish Date - 2023-02-04T04:31:59+05:30 IST

సై అంటే సై.. పట్టు వదలని నైజం.. కడదాకా పోరాటం.. అనూహ్యమైన మలుపులు.. తీవ్ర ఉత్కంఠతో అసలు సిసలు మజా అందించే క్రికెట్‌ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎత్తుకు పైఎత్తులతో సాగే భారత్‌-ఆస్ట్రేలియా టెస్ట్‌

India-Australia Test : మనోళ్లు మొదలెట్టారు

ఆసీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ నెట్స్‌లో జడేజా

నాగ్‌పూర్‌: సై అంటే సై.. పట్టు వదలని నైజం.. కడదాకా పోరాటం.. అనూహ్యమైన మలుపులు.. తీవ్ర ఉత్కంఠతో అసలు సిసలు మజా అందించే క్రికెట్‌ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎత్తుకు పైఎత్తులతో సాగే భారత్‌-ఆస్ట్రేలియా టెస్ట్‌ సమరానికి కౌంట్‌ డౌన్‌ మొదలైంది. ఆస్ట్రేలియా రూపంలో స్వదేశంలో ఎదురుకానున్న కఠిన సవాల్‌ను ఎదుర్కోవడానికి టీమిండియా సన్నాహకాలను ఆరంభించింది. నాలుగు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా ఈనెల 9 నుంచి నాగ్‌పూర్‌లో తొలి టెస్ట్‌ జరగనుంది. అయితే, వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోవడానికి టీమిండియాకు ఇదే చివరి అవకాశం. డబ్ల్యూటీసీ తుది పోరులో వరల్డ్‌ నెం:1 ఆసీ్‌సకు స్థానం దాదాపుగా ఖాయం కాగా.. ఈ సిరీ్‌సను భారత్‌ 4-0తో క్లీన్‌స్వీ్‌ప చేస్తే దర్జాగా ఫైనల్లోకి అడుగుపెట్టొచ్చు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో పోల్చితే టీమిండియాపైనే అధిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కానీ, స్వదేశంలో టీమిండియాను ఓడించడం కష్టసాధ్యమనే విషయం ప్యాట్‌ కమిన్స్‌ సేనకు అవగతమే. సిరీస్‌ ప్రాముఖ్యతను గుర్తించిన భారత్‌ శుక్రవారం నుంచి నాగ్‌పూర్‌లో నెట్‌ప్రాక్టీ్‌సను షురూ చేసింది. చటేశ్వర్‌ పుజార, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు నెట్స్‌లో ముమ్మరంగా సాధన చేస్తున్న ఫొటోలను బీసీసీఐ ట్వీట్‌ చేసింది. రంజీ మ్యాచ్‌తో ఫిట్‌నెస్‌ నిరూపించుకొన్న ఆల్‌రౌండర్‌ జడేజా కూడా ప్యాడ్‌లు కట్టుకొని షాట్లు ఆడుతూ కనిపించాడు. నలుగురు స్పిన్నర్లు వాషింగ్టన్‌ సుందర్‌, సౌరభ్‌ కుమార్‌, రాహుల్‌ చాహర్‌, సాయి కిషోర్‌లను నెట్‌బౌలర్లుగా బోర్డు ఎంపిక చేసింది. సొంతగడ్డపై ఆడిన గత మూడు సిరీ్‌సల్లో భారత్‌దే తిరుగులేని ఆధిపత్యం కాగా.. దాన్ని బ్రేక్‌ చేయాలని ఆసీస్‌ పట్టుదలతో ఉంది.

ఇదిగో.. అశ్విన్‌ ‘డూప్లికేట్‌’

పర్యాటక ఆస్ట్రేలియా.. బెంగళూరులో ప్రత్యేకంగా రూపొందించిన పిచ్‌పై గురువారం నుంచే సాధన ఆరంభించింది. కంగారూ బ్యాటర్లకు ఉప ఖండ పిచ్‌లపై స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం పెను సవాల్‌. పైగా టీమిండియాలో అశ్విన్‌ లాంటి ప్రమాదకర స్పిన్నర్‌ ఉండడంతో.. ఆసీస్‌ అందుకు తగ్గట్టుగానే ముందస్తు ప్రాక్టీ్‌సకు నడుం బిగించింది. అందుకోసం అశ్విన్‌ తరహా యాక్షన్‌తో బౌలింగ్‌ చేస్తున్న ‘డూప్లికేట్‌ అశ్విన్‌’ 21 ఏళ్ల మహీష్‌ పితియాను నెట్‌ బౌలర్‌గా ప్రత్యేకంగా నియమించుకొంది. బరోడా తరఫున ఆడుతున్న పితియా.. అచ్చం అశ్విన్‌లా ఫ్లయిటెడ్‌ డెలివరీలు వేయగలడు. నెట్‌లో అతడి వీడియోలను చూసిన ఆసీస్‌ సహాయ సిబ్బంది.. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాక్టీస్‌ క్యాంప్‌లో అతడి సేవలను వినియోగించుకొంటోంది. అశ్విన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు కొంత ఉపయోగపడవచ్చని ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

కోహ్లీ స్థానానికి త్రిపాఠి సరి

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో ఫియర్‌లెస్‌ బ్యాటింగ్‌ చేసిన రాహుల్‌ త్రిపాఠిపై టీమిండియా ఆటగాడు దినేష్‌ కార్తీక్‌ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ అందుబాటులో లేకపోతే.. ఆ స్థానానికి త్రిపాఠి తగిన వాడని అన్నాడు. పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా ఆడే రాహుల్‌ తరహా బ్యాటర్‌ జట్టులో ఉండడం ఎంతో అవసరమన్నాడు. మ్యాచ్‌లను మలుపు తిప్పగల ఆటగాడని చెప్పాడు. విఫలమైతే అవకాశాలు రావడం కష్టమని తెలిసినా.. రిస్కీ క్రికెట్‌ ఆడాడని కార్తీక్‌ అన్నాడు.

Updated Date - 2023-02-04T04:32:00+05:30 IST