India-Pakistan Match : భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో చివరికి ప్రాక్టీసే మిగిలింది..
ABN , First Publish Date - 2023-09-03T03:54:47+05:30 IST
ఊహించినట్టుగానే వరుణుడు దెబ్బకొట్టాడు. నాలుగేళ్ల తర్వాత బరిలోకి దిగిన భారత్-పాకిస్థాన్ జట్ల వన్డే మ్యాచ్ ఫలి తం అభిమానులను నిరాశపరిచింది. భారత్ ఆలౌటయ్యాక రెండున్నర గంటలపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. మధ్యలో కాసేపు తెరిపినిచ్చి మ్యాచ్ సాగుతుందనిపించినా.. మళ్లీ కురిసిన వానతో చేసేదేమీ
పాక్‌తో మ్యాచ్‌కు వరుణుడి బ్రేక్
ఇరు జట్లకు చెరో పాయింట్
సూపర్-4లో బాబర్ సేన
భారత్ 266
నేటి మ్యాచ్
బంగ్లాదేశ్ X అఫ్ఘానిస్థాన్
మ.3.00 గం. @ స్టార్ స్పోర్ట్స్‌లో
క్యాండీ: ఊహించినట్టుగానే వరుణుడు దెబ్బకొట్టాడు. నాలుగేళ్ల తర్వాత బరిలోకి దిగిన భారత్-పాకిస్థాన్ జట్ల వన్డే మ్యాచ్ ఫలి తం అభిమానులను నిరాశపరిచింది. భారత్ ఆలౌటయ్యాక రెండున్నర గంటలపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. మధ్యలో కాసేపు తెరిపినిచ్చి మ్యాచ్ సాగుతుందనిపించినా.. మళ్లీ కురిసిన వానతో చేసేదేమీ లేకపోయింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తూ ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై నెగ్గిన పాక్ జట్టు(3పాయింట్లు) సూపర్ 4కు అర్హత సాధించింది. మరోవైపు ఫలితం ఎలా ఉన్నా భారత్‌కు బ్యాటింగ్.. పాక్‌కు బౌలింగ్ ప్రాక్టీస్ మాత్రం లభించనట్టయ్యింది. ఆసియాకప్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 82), హార్దిక్ (90 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 87) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పాక్ పేస్ త్రయం షహీన్‌షా అఫ్రీదికి నాలుగు, నసీమ్ షా.. హరీస్ రౌఫ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. భారత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనూ వర్షం రెండుసార్లు అడ్డంకిగా నిలిచింది. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌ని నేపాల్‌తో సోమవారం ఆడుతుంది.
ఆదుకున్న ఇషాన్-హార్దిక్: ఆకాశం మేఘావృతంగా ఉండడం.. వర్షం కురిసే అవకాశం ఉందని తెలిసినా టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్‌కు దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అటు పిచ్‌ను సద్వినియోగం చేసుకున్న పాక్ పేసర్లు ఆరంభ, చివరి ఓవర్లలో చెలరేగారు. అయితే టాపార్డర్ విఫలమైనా మధ్య ఓవర్లలో ఇషాన్-హార్దిక్ పరువు నిలిపారు. వారి జోరు చూస్తే ఓ దశలో 300 ఖాయమనిపించింది. కానీ కీలక సమయంలో వీరిని కట్టడి చేసిన పాక్ గట్టి దెబ్బ తీసింది. ఎప్పటిలాగే యువ పేసర్ షహీన్ షా నిప్పులు చెరిగే బంతులకు టాపార్డర్ తడబడింది. చక్కటి వ్యూహంతో తన వరుస ఓవర్లలో ఓపెనర్ రోహిత్ (11), కోహ్లీ (4)లను క్లీన్‌బౌల్డ్ చేయడంతో జట్టు షాక్‌లో మునిగింది. ఇక గాయం తర్వాత తొలిసారి బరిలోకి దిగిన శ్రేయాస్ (14)ను షార్ట్ పిచ్ బాల్‌తో.. అటు పాక్‌పై తొలిసారిగా ఆడిన మరో ఓపెనర్ గిల్ (10)ను ఫుల్లర్ బంతితో స్వల్ప వ్యవధిలోనే హరీస్ రౌఫ్ పెవిలియన్‌కు చేర్చాడు.
అప్పటికి స్కోరు 66/4. ఈ స్థితిలో జట్టును ఆదుకునే బాధ్యతను ఇషాన్-హార్దిక్ తీసుకున్నారు. పాక్ బౌలర్లను ఎదుర్కోవడంలో లెఫ్ట్ హ్యాండర్ ఇషాన్ ఎలాంటి ఇబ్బందీ పడలేదు. పేసర్ నసీమ్ షా నిలకడగా 144 కి.మీ వేగంతో బంతులు వేసినా దీటుగా సమాధానమిచ్చాడు. 12వ ఓవర్‌లో సిక్సర్, 16వ ఓవర్‌లో రెండు ఫోర్లతో తను టచ్‌లోకి వచ్చాడు. హార్దిక్ కూడా రిస్కీషాట్లకు వెళ్లకుండా స్ట్రయిక్‌ను రొటేట్ చేస్తూ ఆడాడు. 54 బంతుల్లో ఇషాన్ వరుసగా నాలుగో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా, కాసేపటికే హార్దిక్ కూడా అర్ధసెంచరీ సాధించాడు. ఇక 37వ ఓవర్‌లో ఇషాన్ 4, హార్దిక్ 6తో జట్టు స్కోరు 200కి చేరింది. అయితే ఇషాన్ మరుసటి ఓవర్‌లో రౌఫ్ చేతికి చిక్కాడు. దీంతో ఐదో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం జోరు పెంచిన పాండ్యా 40వ ఓవర్‌లో మూడు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. ఇక డెత్ ఓవర్లలో తిరిగి పాక్ పేసర్లు వణికించారు. సెంచరీ వైపు సాగుతున్న హార్దిక్‌తో పాటు జడేజా (14)ను 44వ ఓవర్‌లో షహీన్ అవుట్ చేయడంతో భారత్ భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది. నసీమ్ ఆ తర్వాత శార్దూల్ (3), కుల్దీప్ (4), బుమ్రా (16) వికెట్లు తీయడంతో 7 బంతులుండగానే భారత ఇన్నింగ్స్ ముగిసింది.
స్కోరుబోర్డు
భారత్: రోహిత్ (బి) షహీన్ 11; గిల్ (బి) రౌఫ్ 10; విరాట్ (బి) షహీన్ 4; శ్రేయాస్ (సి) ఫఖర్ (బి) రౌఫ్ 14; ఇషాన్ (సి) బాబర్ (బి) రౌఫ్ 82; హార్దిక్ (సి) ఆఘా సల్మాన్ (బి) షహీన్ 87; జడేజా (సి) రిజ్వాన్ (బి) షహీన్ 14; శార్దూల్ (సి) షాదాబ్ (బి) నసీమ్ 3; కుల్దీప్ (సి) రిజ్వాన్ (బి) నసీమ్ 4; బుమ్రా (సి) ఆఘా సల్మాన్ (బి) నసీమ్ 16; సిరాజ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 20; మొ త్తం: 48.5 ఓవర్లలో 266 ఆలౌట్; వికెట్ల పతనం: 1-15, 2-27, 3-48, 4-66, 5-204, 6-239, 7-242, 8-242, 9-261; బౌలింగ్: షహీన్ అఫ్రీది 10-2-35-4; నసీమ్ 8.5-0-36-3; రౌఫ్ 9-0-58-3; షాదాబ్ 9-0-57-0; నవాజ్ 8-0-55-0; ఆఘా సల్మాన్ 4-0-21-0.
సగం స్టేడియం ఖాళీ..
భారత్-పాక్ మ్యాచ్ అంటే అభిమానులు స్టేడియాలకు పోటెత్తడమే ఇప్పటిదాకా చూశాం. కానీ శ్రీలంకలో శనివారం జరిగిన ఈ రెండు జట్ల మ్యాచ్‌లో ఆ సీన్ కనిపించలేదు. శుక్రవారం సాయంత్రం కూడా టిక్కె ట్లు అమ్మకానికి ఉంచామని, అయినా మ్యాచ్ రోజు కూడా స్టేడియం పూర్తిగా నిండలేదని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారి తెలిపాడు. ఆదరణ లేకపోవడంతో కనీస టిక్కెట్ ధర (శ్రీలంక కరెన్సీ) రూ.6429 నుంచి రూ.1500కు తగ్గించినా ఫలితం లేకపోయింది. దీంతో నిర్వాహకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మ్యాచ్ రోజు ఖచ్చితంగా వర్షం కురుస్తుందని భావించినందువల్లే ఫ్యాన్స్ పెద్దగా ఆసక్తి చూపలేదని అంటున్నారు.
ఎంఎస్ ధోనీ తర్వాత వరుసగా నాలుగు అర్ధసెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా ఇషాన్
భారత్-పాక్ మధ్య జరిగిన వన్డేల్లో ఐదు.. ఆ తర్వాతిస్థానాల్లో అత్యధిక భాగస్వామ్యం (138)నమోదు చేసిన రెండో జోడీగా ఇషా న్-హార్దిక్. తొలి స్థానంలో ఇమ్రాన్-మియాందాద్ (142) ఉన్నారు.