US Open Champ Novak : జొకో
ABN , First Publish Date - 2023-09-12T01:38:34+05:30 IST
సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఏకైక ఆటగాడిగా టెన్నిస్ చరిత్రలో తనపేరును సువర్ణాక్షరాలతో లిఖించుకొన్నాడు
యూఎస్ ఓపెన్ చాంప్ నొవాక్
అత్యధిక టైటిళ్ల వీరునిగా చరిత్ర
నొవాక్ జొకోవిచ్.. ప్రపంచ టెన్ని్‌సలో అతడే ఓ చరిత్ర. ఇప్పటి వరకు మరొకరి రికార్డులను బద్దలు కొడుతూ సాగిన జొకో.. ఇప్పుడు తానే వాటిని సెట్ చేశాడు. యూఎస్ ఓపెన్‌తో కెరీర్‌లో 24వ టైటిల్ నెగ్గిన జొకో.. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల వీరుడిగా శిఖరాగ్రాన నిలిచాడు.
న్యూయార్క్: సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఏకైక ఆటగాడిగా టెన్నిస్ చరిత్రలో తనపేరును సువర్ణాక్షరాలతో లిఖించుకొన్నాడు. యూఎస్ ఓపెన్‌లో ఆదివారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6-3, 7-6(5), 6-3తో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు. కెరీర్‌లో నాలుగోసారి ఫ్లషింగ్ మెడో్‌సలో టైటిల్‌ను సొంతం చేసుకొన్నాడు. దీంతో మళ్లీ టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు.
సమయస్ఫూర్తితో ఆడి..: 3 గంటలా 16 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో మెద్వెదెవ్ కూడా పాయింట్ల కోసం హోరాహోరీగానే పోరాడాడు. భారీగానే ర్యాలీలు సాగినా.. జోకో అనుభవం, వ్యూహ చతురత ఇక్కడ పైచేయిగా నిలిచింది. డానిల్ ఎక్కువగా బేస్‌లైన్ గేమ్‌పై ఆధారపడగా.. అతడి బలాన్ని గుర్తించిన నొవాక్ బుర్రకు కూడా పని చెప్పాడు. శరీరంలోని శక్తినంతా కూడదీసుకొని ర్యాలీలు ఆడుతూనే.. నెట్ వద్దకు వచ్చి వాలీలు, డ్రాప్ షాట్లతో మెద్వెదెవ్‌ను అసహనానికి గురి చేశాడు. తొలి సెట్ ఆరంభం నుంచే జొకో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండో గేమ్‌లోనే డానిల్ సర్వీ్‌సను బ్రేక్ చేసిన జొకో 3-0తో పైచేయిగా నిలిచాడు. ఆ తర్వాత తన సర్వీ్‌సలను నిలబెట్టుకొన్న మెద్వెదెవ్ 2-4తో ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. ఆపై ఇద్దరూ తమ సర్వీ్‌సలను నిలబెట్టుకొంటూ సాగారు. 5-3తో ఉన్న సమయంలో 9వ గేమ్‌ను సునాయాసంగా నెగ్గిన జొకో.. తొలి సెట్‌ను కైవసం చేసుకొన్నాడు. కానీ, రెండో సెట్‌లో డానిల్ నుంచి గట్టిపోటీ ఎదురుకావడంతో.. ఏకంగా 1 గంటా 44 నిమిషాలపాటు సాగింది. 3-3తో ఉన్నప్పుడు ఏడో గేమ్‌లో మెద్వెదెవ్ సర్వీ్‌సను బ్రేక్ చేసేందుకు జోకర్ తీవ్రంగా పోరాడినా సఫలం కాలేకపోయాడు. 5-6తో ఉన్న సమయంలో కష్టంగా సర్వీస్‌ను నిలబెట్టుకొన్న నొవాక్ సెట్ ఫలితాన్ని టైబ్రేక్‌కు తీసుకెళ్లాడు. అయితే, టైబ్రేక్‌లో షాట్లలో వేగం తగ్గించడంతోపాటు జొకో కాళ్లను టార్గెట్ చేయడంలో సఫలమైన మెద్వెదెవ్ 4-4తో నిలిచాడు. అయితే, 5-4తో ఉన్నప్పుడు బ్యాక్ హ్యాండ్ తప్పిదంతో నొవాక్ 5-5తో స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత వరుసగా రెండు పాయింట్లు సాధించిన జొకో రెండో సెట్‌ను కూడా సొంతం చేసుకొన్నాడు. ఇక, మూడో సెట్‌లో నాలుగో, ఆరో గేముల్లో బ్రేక్ పాయింట్లు సాధించిన నొవాక్ 4-2తో ముందంజ వేశాడు. అదే ఆధిక్యాన్ని నిలబెట్టుకొంటూ 5-3తో నిలిచాడు. 9వ గేమ్‌లో 40-30తో మ్యాచ్ పాయింట్‌పై నిలిచిన జొకో.. డానిల్ తప్పిదంతో చాంపియన్‌గా నిలిచాడు.
బ్రయాంట్‌కు నివాళిగా ‘24’..
24వ గ్రాండ్‌స్లామ్ విజయం తర్వాత తన మెంటార్, స్నేహితుడు అయిన దిగ్గజ బాస్కెట్‌బాల్ ప్లేయర్ కోబి బ్రయాంట్‌కు జొకో నివాళులర్పించాడు. తాను, బ్రయాంట్ ఫొటోను ముద్రించిన టీషర్ట్‌ను ధరించాడు. దానిపై ‘బ్లాక్ మాంబ’ అని రాసి ఉంది. అంతేకాకుండా అతడు వేసుకొనే జెర్సీ నెం:24 ముద్రించిన జాకెట్‌ను వేసుకొన్నాడు. తాను మానసికంగా కుంగుబాటుకు గురైనప్పుడు బ్రయాంట్ ఎంతో అండగా నిలిచాడని జొకో చెప్పాడు. అతడికి తగిన నివాళులర్పించడానికి ఇదే తగిన సమయమని భావించానన్నాడు. 2020లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బ్రయాంట్ మరణించాడు.
ఎదురు లేని మొనగాడు
‘నాకు అప్పుడు ఏడు లేదా ఎనిమిదేళ్లనుకుంటా. ప్రపంచంలోనే అత్యుత్తమ టెన్నిస్ ఆటగాడిని కావాలని, వింబుల్డన్ గెలవాలని కలలు కనేవాణ్ని’
ఈ మాటలు అన్నది నొవాక్ జొకోవిచ్.
కానీ అతను తన చిన్ననాటి స్వప్నాన్ని సాకారం చేసుకోవడమే కాదు.. వింబుల్డన్‌ను ఏకంగా ఏడుసార్లు సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌నైతే పదిసార్లు ముద్దాడాడు. ఫ్రెంచ్ ఓపెన్‌ను మూడుసార్లు, యూఎస్ ఓపెన్ ట్రోఫీని నాలుగుసార్లు కైవసం చేసుకొన్నాడు. తద్వారా మొత్తం 24 గ్రాండ్‌స్లామ్‌లతో పురుషుల్లో మరెవరూ సాధించని ఘనతను జొకో అందుకున్నాడు. 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో అతడు గ్రాండ్‌స్లామ్ బోణీ కొట్టి నేటికి 15 ఏళ్లు అయింది. ఇప్పుడు నొవాక్‌కు 36 ఏళ్లు. కానీ ఇప్పటికీ ఆటలో తగ్గని వేగం. వరుసగా మ్యాచ్‌లు ఆడినా, అవి గంటలకొద్దీ సాగినా జొకో మొహంలో అలసటే కనిపించదు. నేటి కుర్ర ప్లేయర్లు కూడా జొకోలా కోర్టులో అంతవేగంగా కదల్లేరంటే అతిశయోక్తి కాదు! ఈసారి యూఎస్ ఓపెన్ ఫైనల్లో జొకో ఆడిన తీరు చూస్తే వయస్సు కేవలం ఓ సంఖ్య మాత్రమేనని అనిపిస్తుంది. సెమీ్‌సలో డిఫెండింగ్ చాంపియన్ అల్కరా్‌సకు మెద్వెదెవ్ షాకిచ్చి ఉండడంతో జొకో-మెద్వెదెవ్ ఫైనల్ నువ్వానేనా అనేలా జరుగుతుందని అంతా అంచనా వేశారు. అందుకు అనుగుణంగానే..మ్యాచ్‌లో మొదటి పాయింట్ 19 షాట్ల అనంతరంకానీ రాలేదంటే ఇద్దరూ ఎంత హోరాహోరీగా తలపడ్డారో అర్థమవుతుంది. మరో రెండు పాయింట్ల తర్వాత..ఇంకో ర్యాలీ 23 షాట్లపాటు సాగింది. అయితే జొకో ర్యాలీలను అడ్డుకొనేందుకు 27 ఏళ్ల మెద్వెదెవ్ తీవ్రంగానే శ్రమించాల్సి వచ్చింది. మొత్తంగా రెండో సెట్లో మినహా మిగిలిన రెండు సెట్లలో జొకో ఎదుట డానిల్ తేలిపోయాడు. అసలు ఈ సీజన్‌లో 27-1తో ఉన్న రికార్డు చూస్తే జొకో ఎంత అద్భుత ఫామ్‌లో ఉన్నాడో అర్థమవుతుంది. ఆ ఒక్క ఓటమి కూడా వింబుల్డన్ ఫైనల్లో అల్కరాస్ చేతిలో ఎదురైంది. ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్, ఆటపట్ల అనురక్తి, పోరాటతత్వం గమనిస్తే మరికొన్ని గ్రాండ్‌స్లామ్‌లు జొకోవిచ్ గెలుస్తాడనడంలో సందేహం లేదు.
ఆడుతూనే ఉంటా
కల నిజమవుతుందని.. 24 గ్రాండ్‌స్లామ్‌లు సాధిస్తానని ఎన్నడూ అనుకోలేదు. కెరీర్‌లు ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో ఆటకు దూరం కాను. కొన్నేళ్లపాటు ఆడే సత్తా నాకుంది. శరీరం సహకరించినంత వరకూ గెలుస్తూనే ఉంటా. - జొకోవిచ్