మనోడు.. పట్టు వదల్లేదు

ABN , First Publish Date - 2023-08-24T04:05:06+05:30 IST

వరల్డ్‌ కప్‌ చెస్‌ ఫైనల్‌ ఫలితం టై బ్రేకర్‌కు మళ్లింది. వరల్డ్‌ నెం.1 మాగ్నస్‌ కార్ల్‌సన్‌, భారత టీనేజ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద మధ్య జరుగుతున్న ఈ టైటిల్‌ ఫైట్‌లో బుధవారంనాటి రెండో గేమ్‌ కూడా డ్రా అయింది...

మనోడు..  పట్టు వదల్లేదు

కార్ల్‌సన్‌తో ఫైనల్లో రెండో గేమ్‌నూ డ్రా చేసిన ప్రజ్ఞానంద

నేడు టై బ్రేకర్‌తో తేలనున్న ఫలితం

చెస్‌ ప్రపంచ కప్‌

బాకు: వరల్డ్‌ కప్‌ చెస్‌ ఫైనల్‌ ఫలితం టై బ్రేకర్‌కు మళ్లింది. వరల్డ్‌ నెం.1 మాగ్నస్‌ కార్ల్‌సన్‌, భారత టీనేజ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద మధ్య జరుగుతున్న ఈ టైటిల్‌ ఫైట్‌లో బుధవారంనాటి రెండో గేమ్‌ కూడా డ్రా అయింది. ఇరువురి మధ్య మంగళవారంనాటి మొదటి గేమ్‌ 35 ఎత్తుల్లోనే ఫలితం లేకుండా ముగిసిన విషయం విదితమే. అయితే రెండో గేమ్‌ అంతకన్నా ముందే..అంటే కేవలం 30 ఎత్తుల్లోనే డ్రా అయింది. ఈ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన నార్వే గ్రాండ్‌మాస్టర్‌ కార్ల్‌సన్‌ దూకుడుగా ఎత్తులు వేయలేదు. ఈనేపథ్యంలో నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానందకు ఎలాంటి సమస్యలూ ఎదురుకాలేదు. దాంతో గంటన్నరసేపే సాగిన గేమ్‌లో ఇద్దరు ఆటగాళ్లు పాయింట్లు పంచుకొనేందుకు అంగీకరించారు. ఇక విజేతను నిర్ణయించేందుకు గురువారం టైబ్రేకర్‌ నిర్వహించనున్నారు. అయితే సెమీ్‌సలో ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఫాబియానో కరౌనాకు టైబ్రేకర్‌లో 18 ఏళ్ల ప్రజ్ఞానంద షాకిచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు క్వార్టర్స్‌లోనూ సహచరుడు అర్జున్‌ ఇరిగేసిని సడన్‌ డెత్‌లో ప్రజ్ఞానంద ఓడించడం విశేషం.

భారత చెస్‌కు స్వర్ణయుగం

భారత్‌లో ప్రస్తుతం చెస్‌ క్రీడకు సంబంధించి స్వర్ణయుగమని దిగ్గజ గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ అభివర్ణించాడు. ప్రస్తుతం దేశం నుంచి ఎందరో గ్రాండ్‌మాస్టర్లు ఆవిర్భవిస్తుండడమే అందుకు కారణమన్నాడు. ‘ఇప్పుడిప్పుడే దేశం నుంచి ఎందరో గ్రాండ్‌మాస్టర్లు తయారవుతున్నారు. అంతా 2700 ఎలో రేటింగ్‌ కలిగిన వారే. వారి వయస్సు కూడా 20 ఏళ్ల లోపే. అందుకే ప్రస్తుతం భారత్‌కిది స్వర్ణయుగం’ అని విషీ చెప్పాడు.

Updated Date - 2023-08-24T04:30:44+05:30 IST