Suryakumar Yadav: ఆ షాట్ ఎలా సాధ్యం? సూర్య బ్యాటింగ్ చూసి సచిన్ షాక్.. వైరల్ అవుతున్న వీడియో!
ABN , First Publish Date - 2023-05-13T09:25:52+05:30 IST
సూర్య కుమార్ యాదవ్.. మైదానంలో నిప్పులు విరజిమ్ముతున్నాడు. పట్టపగలే బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. లీగ్ తొలి ఐదు మ్యాచ్‌ల్లోనూ మబ్బుల చాటున దాగిన సూర్య.. కీలక దశలో ప్రతాపం చూపిస్తున్నాడు.
సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav).. మైదానంలో నిప్పులు విరజిమ్ముతున్నాడు. పట్టపగలే బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. లీగ్ తొలి ఐదు మ్యాచ్‌ల్లోనూ మబ్బుల చాటున దాగిన సూర్య.. కీలక దశలో ప్రతాపం చూపిస్తున్నాడు. చివరి ఆరు మ్యాచ్‌ల్లోనూ సూర్య నాలుగు అర్ధశతకాలు, ఒక శతకం చేయడం చూస్తే అతడు ఎంత స్థిరంగా ఆడుతున్నాడో స్పష్టమవుతోంది. శుక్రవారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (GTvsMI) సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనకే సాధ్యమైన షాట్లతో విరుచుకుపడ్డాడు.
సూర్య ధాటికి టాప్ బౌలర్లైన రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 17వ ఓవర్ వరకు 53 పరుగులతోనే ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఆఖరి ఓవర్ పూర్తయ్యే సరికి అజేయ శతకం పూర్తి చేయడం విశేషం. అంటే చివరి మూడు ఓవర్లలో 15 బంతుల్లోనే మిగతా ఫిఫ్టీ పూర్తి చేశాడు. చివర్లో సూర్య ఆడిన కొన్ని షాట్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు (Sachin Tendulkar) కూడా విస్మయం కలిగించింది. షమీ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ దిశగా సూర్య కొట్టిన షాట్ చూసి సచిన్ షాకయ్యాడు.
GTvsMI: శుభ్‌మన్ గిల్ వికెట్ చూశారా? ఆకాశ్ దెబ్బకు గాల్లోకి ఎగిరిన వికెట్.. వైరల్ అవుతున్న వీడియో!
సూర్య వీరోచిత బ్యాటింగ్‌తో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. ఇషాన్ (31), విష్ణు వినోద్ (30), రోహిత్ (29) ఫర్వాలేదనిపించారు. రషీద్ ఖాన్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు చేసి ఓడింది. రషీద్ (Rashid Khan) (32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 79 నాటౌట్) అద్వితీయంగా పోరాడినా ఫలితం లేకపోయింది. డేవిడ్ మిల్లర్ (41), విజయ్ శంకర్ (29) ఫర్వాలేదనిపించారు. సూర్యకుమార్‌కు ``ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్`` అవార్డు దక్కింది.