Tilak Varma: తిలక్ వర్మ కళ్లు చెదిరే ఇన్నింగ్స్.. షమీ వేసిన ఒకే ఓవర్లో 24 పరుగులు.. మరికొద్ది సేపు ఉండుంటే..
ABN , First Publish Date - 2023-05-27T08:48:27+05:30 IST
ఈ ఐపీఎల్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టుకు దొరికిన మరో బ్యాటింగ్ సంచలనం తిలక్ వర్మ. ఈ కుర్రాడు ఈ సీజన్ ఆద్యంతం చక్కగా రాణించాడు. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అంచనాల మేరకు సత్తా చాటాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో తిలక్ వర్మ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు
ఈ ఐపీఎల్ (IPL 2023) ద్వారా ముంబై ఇండియన్స్ (MI) జట్టుకు దొరికిన మరో బ్యాటింగ్ సంచలనం తిలక్ వర్మ (Tilak Varma). ఈ కుర్రాడు ఈ సీజన్ ఆద్యంతం చక్కగా రాణించాడు. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా అంచనాల మేరకు సత్తా చాటాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో (GTvsMI) తిలక్ వర్మ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అప్పటికే రెండు వికెట్లు తీయడంతో పాటు ఈ సీజన్‌లోనే అత్యధిక వికెట్లు (28) తీసిన మహ్మద్ షమీకి (Mohammed Shami) చుక్కలు చూపించాడు. షమీ బౌలింగ్‌లో బౌండరీల వర్షం కురిపించాడు.
234 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై టీమ్‌కు గుజరాత్ బౌలర్ షమీ షాకిచ్చాడు. ఓపెనర్లు నేహల్ (4), రోహిత్ (8)లను ఔట్ చేసి గుజరాత్ శిబిరంలో సంతోషం నెలకొల్పాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన తిలక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వస్తూనే పాండ్యా బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన తిలక్ ఆ తర్వాత షమీ ఓవర్లో చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో తొలి నాలుగు బంతులకు నాలుగు ఫోర్లు కొట్టాడు. ఐదో బంతికి రెండు పరుగులు చేసి, ఆరో బంతికి సిక్స్ కొట్టాడు. ఫలితంగా ఆ ఓవర్లో ఏకంగా 24 పరుగులు వచ్చాయి.
ఈ మ్యాచ్‌లో మొత్తం 14 బంతులు ఆడిన తిలక్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు చేసి రషీద్ ఖాన్ (Rashid Khan) బౌలింగ్‌లో అవుటయ్యాడు. తిలక్ మరికొద్ది సేపు ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అప్పటికే రెండు వికెట్లు పడిపోయి నీరసించిన ముంబై ఇన్నింగ్స్‌కు తిలక్ ఊపు తీసుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ముంబై 62 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.