Virat Kohli: విరాట్ విశ్వరూపం.. కోహ్లీ కొట్టిన ఆ సిక్స్ చూసి డుప్లెసి షాక్.. వీడియో వైరల్!
ABN , First Publish Date - 2023-05-19T10:17:04+05:30 IST
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. ``కింగ్`` పరుగుల ప్రవాహం హైదరాబాద్‌ను ముంచెత్తింది. సెంచరీతో కోహ్లీ కదం తొక్కాడు. అవసరమైన దశలో బ్యాట్ ఝుళిపించి సులభంగా తన జట్టును గెలిపించాడు.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సూపర్ ఫామ్ కొనసాగుతోంది. ``కింగ్`` పరుగుల ప్రవాహం హైదరాబాద్‌ను ముంచెత్తింది. సెంచరీతో కోహ్లీ (Kohli Century) కదం తొక్కాడు. అవసరమైన దశలో బ్యాట్ ఝుళిపించి సులభంగా తన జట్టును గెలిపించాడు. ప్లేఆఫ్స్ రేసులో చోటు దక్కించుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు (RCB) మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు అత్యంత అవసరం. ఈ దశలో కోహ్లీ విజృంభించాడు. 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. తొలిబంతి నుంచే బాదుడు ఆరంభించిన కోహ్లీ సెంచరీ సాధించేవరకు ఆగలేదు.
గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ (RCBvsSRH) జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. క్లాసెన్ (Heinrich Klaasen) (51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 104) అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. ఛేజింగ్‌ను బెంగళూరు అద్భుతంగా ఆరంభించింది. కోహ్లీ ఇన్నింగ్స్‌కు డుప్లెసి (Faf du Plessis) (47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 71) మెరుపు ఆట కూడా తోడవడంతో ఆర్‌సీబీ 8 వికెట్లతో హైదరాబాద్‌ను ఓడించింది. 19.2 ఓవర్లలో 2 వికెట్లకు 187 రన్స్ చేసి నెగ్గింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కోహ్లీ నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ కొట్టిన సిక్స్‌లు హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా నితీష్ వేసిన 8వ ఓవర్ మొదటి బంతికి కోహ్లీ కొట్టిన భారీ సిక్స్ ఫ్యాన్స్‌నే కాదు నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న డుప్లెసీని కూడా మురిపించింది. కోహ్లీ లెగ్ సైడ్ కొట్టిన ఆ సిక్స్ 103 మీటర్లు వెళ్లింది. ఇక, భువి వేసిన 15వ ఓవర్లో కోహ్లీ నాలుగు ఫోర్లు కొట్టాడు. ఛేజింగ్‌లో తాను మాస్టర్‌నని మరోసారి నిరూపించుకున్నాడు.