Kohli vs Ganguly: చేతులు కలిపిన కోహ్లీ, గంగూలీ.. వివాదం సద్దుమణిగినట్టేనా?
ABN , First Publish Date - 2023-05-07T10:24:41+05:30 IST
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుత ఐపీఎల్‌లో ఆట కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. నిజానికి ఈ సీజన్‌లో కోహ్లీ మెరుగైన ప్రదర్శనే చేస్తున్నా.. ఇతర ఆటగాళ్లతో వివాదాలు అతడి ఆటను డామినేట్ చేస్తున్నాయి.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) ఆట కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. నిజానికి ఈ సీజన్‌లో కోహ్లీ మెరుగైన ప్రదర్శనే చేస్తున్నా.. ఇతర ఆటగాళ్లతో వివాదాలు అతడి ఆటను డామినేట్ చేస్తున్నాయి. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) మెంటార్ గౌతమ్ గంభీర్‌తో (Gautam Gambhir) కోహ్లీ గొడవ గురించి తెలిసిందే. ఈ విషయంపై సీరియస్ అయిన బీసీసీఐ (BCCI) ఏకంగా కోహ్లీ మ్యాచ్ ఫీజు మొత్తాన్ని జరిమానాగా విధించింది.
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ అయిన సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)తో కూడా కోహ్లీకి వివాదాలున్నాయి. గతంలో ఢిల్లీ, బెంగళూరు మధ్య మ్యాచ్ (DCvsRCB) జరిగినపుడు అవి బయటపడ్డాయి. గంగూలీ వైపు కోహ్లీ కోపంగా చూడడం, కోహ్లీతో చేతులు కలిపేందుక గంగూలీ ఇష్టపడకపోవడం, సోషల్ మీడియాలో అన్-ఫాలో చేసుకోవడం వంటివి కొన్ని రోజుల క్రితం బాగా హైలెట్ అయ్యాయి. అయితే శనివారం జరిగిన మ్యాచ్‌లో చేతులు కలపడం ద్వారా ఆ వివాదాలన్నింటికీ గంగూలీ, కోహ్లీ కలిసి చెక్ పెట్టారు (Kohli Shakes Hands With Ganguly).
శనివారం సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య ఢిల్లీలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరుపై ఢిల్లీ టీమ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లూ షేక్‌హ్యాండ్స్ సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గంగూలీ, కోహ్లీ చేతులు కలుపుకున్నారు. అంతేకాదు ఇద్దరూ కొద్ది సేపు మాట్లాడుకున్నారు. దీంతో ఇద్దరూ కలిసి వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారని అందరూ చర్చించుకుంటున్నారు.