Yashaswi Jaiswal: బట్లర్ త్యాగం.. జైస్వాల్ వీరంగం.. బంతిని ఎంతలా బాదాడో చూశారా.. వైరల్ అవుతున్న వీడియో!
ABN , First Publish Date - 2023-05-12T09:06:03+05:30 IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వస్తోంది. ఈ ఐపీఎల్ ద్వారా ఇండియన్ క్రికెట్‌కు దొరికిన ఆణిముత్యం యశస్వి జైస్వాల్. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వస్తోంది. ఈ ఐపీఎల్ (IPL 2023) ద్వారా ఇండియన్ క్రికెట్‌కు దొరికిన ఆణిముత్యం యశస్వి జైస్వాల్ (Yashaswi Jaiswal). రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడుతున్న జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్ 52.27 సగటుతో 575 పరుగులు చేశాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్న డుప్లెసిస్ (576) కంటే కేవలం ఒక్క పరుగు మాత్రమే వెనుకబడి ఉన్నాడు.
గురువారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (RRvsKKR) ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే జైస్వాల్ విరుచుకుపడ్డాడు. కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా (Nitish Rana) వేసిన తొలి ఓవర్లో 6,6,4,4,2,4 కొట్టి విజయాన్ని ఖరారు చేసేశాడు. అంతేకాదు మూడు ఓవర్లలోపై అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో 50 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే జైస్వాల్ వీరంగం వెనుక బట్లర్ (Jos Buttler) త్యాగం ఉంది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో జైస్వాల్ కోసం బట్లర్ తన వికెట్‌ను త్యాగం చేశాడు.
Andre Russell: మరోసారి చెలరేగిన రస్సెల్, రింకూ.. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌ను ఎలా గెలిపించారంటే..
హర్షిత్ రాణా వేసిన రెండో ఓవర్ నాలుగో బంతిని బట్లర్ పాయింట్ వైపు ఆడాడు. అనంతరం క్రీజు బయటకు వచ్చాడు. అయితే బట్లర్ రన్ కోసం సిద్ధంగా ఉన్నాడేమోనని భావించి జైస్వాల్ పరుగు మొదలుపెట్టేశాడు. అప్పటికే బాల్ ఫీల్డర్ రస్సెల్ దగ్గరకు వెళ్లిపోయింది. జైస్వాల్ వెనక్కి వెళ్లినా ఆవుట్ అవుతాడని భావించిన బట్లర్ తానే నాన్-స్ట్రైకర్ ఎండ్ వైపు పరిగెత్తి రనౌట్ అయ్యాడు. జైస్వాల్ కోసం తను అవుట్ అయ్యాడు. అయితే బట్లర్ త్యాగాన్ని జైస్వాల్ వృథా కానివ్వలేదు. చిచ్చర పిడుగులా చెలరేగి రాజస్థాన్ విజయానికి బాటలు వేశాడు.