iPhone 15: ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 15 వచ్చేస్తుందోచ్.. ముహూర్తం ఖరారు!

ABN , First Publish Date - 2023-08-31T14:54:37+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్స్‌కి ఎంత ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఖరీదు లక్షల్లో ఉన్నప్పటికీ.. అదేదో కరువులో నీళ్ల కోసం ఎగబడినట్టు కొత్త సిరీస్ వచ్చినప్పుడల్లా ఈ ఐఫోన్‌ని కొనుగోలు చేసేందుకు...

iPhone 15: ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 15 వచ్చేస్తుందోచ్.. ముహూర్తం ఖరారు!

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్స్‌కి ఎంత ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఖరీదు లక్షల్లో ఉన్నప్పటికీ.. అదేదో కరువులో నీళ్ల కోసం ఎగబడినట్టు కొత్త సిరీస్ వచ్చినప్పుడల్లా ఈ ఐఫోన్‌ని కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. తమ పనులన్నీ మానుకొని మరీ క్యూలైన్‌లో నిల్చొని, ఈ ఫోన్లను కొంటుంటారు. దీన్ని బట్టి.. ఈ ఫోన్లకు మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీన్నే ఎన్‌క్యాష్ చేసుకుంటూ.. ఆపిల్ సంస్థ ప్రతీ ఏటా కొత్త ఫీచర్లతో, సరికొత్త డిజైన్లతో ఐఫోన్లను లాంచ్ చేస్తోంది. ఇప్పుడు ఐఫోన్ 15 సిరీస్‌ని కూడా లాంచ్ చేసేందుకు సన్నద్ధమవుతోంది.


ఇన్నిరోజులు ఈ లాంచింగ్ డేట్‌ని సస్పెన్స్‌లో పెట్టిన ఆపిల్ సంస్థ.. ఎట్టకేలకు ఆ సస్పెన్స్‌కి తెరదించింది. సెప్టెంబర్ 12వ తేదీన ఐఫోన్ 15 లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. కాలిఫోర్నియాలోని ‘ఆపిల్ పార్క్’లో ఉదయం 10 గంటలకు (భారత్ కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు) లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్ల ఆవిష్కరణ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ‘వండర్ లస్ట్’ అనే పేరుని ఖరారు చేయడం జరిగింది. ఈ ఈవెంట్‌ని ఆపిల్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో.. అలాగే ఆపిల్.కామ్, ఆపిల్ టీవీ యాప్‌లలో వీక్షించవచ్చు. ఐఫోన్ సిరీస్‌లో భాగంగా.. ఐ-ఫోన్ 15, ఐ-ఫోన్15 ప్లస్, ఐ-ఫోన్ 15 ప్రో, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.

కేవలం ఐఫోన్ 15 సిరీస్ మాత్రమే కాదు.. ఆపిల్ వాచ్ సిరీస్9, ఆపిల్ వాచ్ ఆల్ట్రా2, ఐఓఎస్ 17, వాచ్ ఓఎస్ 10 కూడా ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. గతంలో పోలిస్తే ఈసారి వీటి ధర కొంచెం ఎక్కువగానే ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఐఫోన్ 15 సిరీస్‌లో ఫోన్ల మోడల్ ఎలా ఉంటుందో తెలీదు కానీ.. కొన్ని మార్పులైతే ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. అన్ని మోడల్స్ డైనమిక్ ఐలాండ్ నాచ్ డిజైన్‌ను కలిగి ఉన్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ కూడా అప్‌గ్రేడ్ చేసిన 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వస్తాయని సమాచారం. అలాగే.. ఈసారి ఛార్జింగ్ కోసం లైటెనింగ్ పోర్ట్ స్థానంలో యూఎస్‌బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఇస్తారని తెలిసింది.

Updated Date - 2023-08-31T14:54:37+05:30 IST