Set top Box: ఇక టీవీకి సెట్‌ టాప్‌ బాక్స్‌ అక్కర్లేదా?

ABN , First Publish Date - 2023-02-15T16:02:03+05:30 IST

ఇక టీవీల్లోనే ట్యూనర్స్‌ వచ్చేస్తున్నాయి... జనం సెట్‌ టాప్‌ బాక్స్‌లకి గుడ్ బై చెప్పేయచ్చు - అన్నంత స్థాయిలో ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.....

Set top Box: ఇక టీవీకి సెట్‌ టాప్‌ బాక్స్‌ అక్కర్లేదా?

ఇక టీవీల్లోనే ట్యూనర్స్‌ (Tv Tuners) వచ్చేస్తున్నాయి... జనం సెట్‌ టాప్‌ బాక్స్‌ (Set top box)లకి గుడ్ బై చెప్పేయచ్చు - అన్నంత స్థాయిలో ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఈ దిశలో కేంద్రం ప్రేక్షకులకు భరోసా ఇస్తోందంటూ చెబుతున్నారు. టీవీలు తయారుచేసే కంపెనీలన్నీ - ఇకపైన తమ టీవీల్లో ఇన్‌బిల్ట్‌గా శాటిలైట్ ట్యూనర్స్ (Inbuilt satellite tuner) ని అమర్చి తీరాలనీ... సమాచార మంత్రిత్వ శాఖవాళ్లు ఆ విధంగా ఆదేశాలు ఇస్తోందనీ.. అదే జరిగితే... టీవీ పక్కన సెట్‌ టాప్ బాక్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోతుందనీ చర్చలు నడుస్తున్నాయి.

నిజమే. టీవీ కొనగానే దాంతోపాటు సెట్‌ టాప్‌ బాక్స్ కూడా తీసుకోవడం ఈ కాలంలో తప్పనిసరి అయిపోయింది. అయితే మరి - కేంద్రంవారి కొత్త నిర్ణయంతో సెట్‌ టాప్ బాక్స్ లకి గుడ్ బై చెప్పేసే కాలం నిజంగానే వచ్చేసిందా? ఇదో అద్భుత నిర్ణయమా?. అంటే.. అంత సీన్ లేదని చెప్పాల్సి ఉంటుంది.

1.jpg

ప్రస్తుతం ఫ్రీ టు ఎయిర్ చానల్స్ (Free to air channels) పేరుతో.. జనానికి 200 పైగా ఉచిత చానల్స్ లభిస్తున్నాయి. వాటికి మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళ కోసం ఈ సౌకర్యాన్ని ఏర్పరచబోతున్నారట. అందుకోసం టీవీ మోడల్స్‌నే రిడిజైన్‌ చేయాలంటూ టీవీ కంపెనీల్ని ఆదేశించబోవడం ఇక్కడ విశేషం. అయితే - టీవీ డిజైన్‌లోనే అంతర్గతంగా ట్యూనర్‌‌ని పెట్టేసినా.. కలిగే లాభం ఏంటి? దేనికైనా యాంటెనా తప్పనసరి. కాబట్టి - కేవలం టీవీ పక్కన ఒక బాక్స్‌ పెట్టుకునే బాధ తప్పుతుందంతే!

ఇందులో మరో కోణం ఏంటంటే - ఈ బిల్టిన్‌ ట్యూనర్‌ వాడాలనుకునేవాళ్లు... రాబోయే కొత్త టీవీ మోడల్స్‌ని మాత్రమే కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే - మంత్రిత్వ శాఖ ఆదేశాన్నిబట్టి తయారు కాబోయే సరికొత్త టీవీ మోడల్స్ లో మాత్రమే ఈ బిల్డింగ్ శాటిలైట్ ట్యూనర్‌ ఉంటుంది.

2.jpg

సరే. ప్రతి టీవీలోనూ శాటిలైట్‌ ట్యూనర్‌ తప్పనిసరి అయినప్పుడు... మరి ఇప్పటివరకూ మార్కెట్లో ఉన్న పాత మోడల్స్‌ని ఏం చేస్తారు? అన్నది మరో ప్రశ్న. ఆ మోడల్స్‌ అన్నిటినీ తిరిగి ఫ్యాక్టరీకి తెచ్చి రీ-డిజైన్‌ చేస్తారా? లేక ఇకనుంచి తయారుచేసే కొత్త మోడల్స్‌‌లో మాత్రం ట్యూనర్‌ పెడితే చాలని ప్రభుత్వం మినహాయింపు ఇస్తుందా? - అన్నది తేలాల్సి ఉంది.

ఏమైనా ఇది చాలామంది అనుకునేంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే ఇప్పుడు టీవీ తయారీ పరిశ్రమలో ఎంతో కాంపిటీషన్‌ ఉంది. ప్రసిద్ధ కంపెనీలు పోటాపోటీగా ఎన్నెన్నో స్మార్ట్‌ టీవీ మోడల్స్ తయారుచేస్తున్నాయి. వాటిలో అనేక రకాల ఇంటర్నల్‌ డిజైన్లు ఉంటాయి. చెప్పాలంటే - ప్రతి మోడల్‌కీ ప్రత్యేకమైన డిజైన్‌, ఆర్కిటెక్చర్‌ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా శాటిలైట్ ట్యూనర్‌ని కూడా టీవీలో అమర్చాలీ అంటే ... ప్రతి మోడల్‌ తాలూకు బోర్డ్‌ నిర్మాణాన్ని రీ-డిజైన్ చేయాల్సి ఉంటుంది.

3.jpg

ఈ కారణంగా - ట్యూనర్‌ అన్నది తప్పనిసరి అయితే... టీవీ కంపెనీల వాళ్లు మార్కెట్లో యాక్టివ్‌గా ఉన్న టీవీ మోడల్స్‌ అన్నిటినీ యథాతథంగా అలాగే వదిలేసి - కేవలం రాబోయే కొత్త మోడల్స్ లో మాత్రమే ఈ ట్యూనర్స్ ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

అదీ కాక - ఇటీవలి కాలంలో వినోదరంగం బాగా మారింది. నిత్యం ఎంతో క్వాలిటీ కంటెంట్ లభిస్తోంది. అందువల్ల జనంలో కూడా చాలామంది ఫ్రీ చానల్స్‌తో తృప్తిపడడం లేదు. తమ తమ బడ్జెట్‌లో ఫిట్‌ అయ్యేలా తక్కువ ప్యాకేజ్ అయినా తీసుకుని ఇష్టమైన కొన్ని పెయిడ్‌ ఛానెల్స్‌ చూడాలనుకుంటున్నారు తప్ప – పూర్తిగా ఫ్రీ ఛానెల్స్‌ మీద ఆధారపడుతున్నవాళ్ల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. కాబట్టి - క్వాలిటీ కంటెంట్‌ కోరుకునేవాళ్లు ప్రైవేట్ సెటప్ బాక్స్ ల్ని ఎప్పటిలాగే వాడక తప్పదు.

ప్రైవేట్ సెట్‌ టాప్‌ బాక్స్ లో కూడా ఫ్రీ చానల్స్ ఎలాగైనా లభిస్తాయి. కాబట్టి - ఇప్పుడు టీవీలో కొత్తగా అదనంగా ట్యూనర్ రావడం వల్ల – చాలామంది జనానికి ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా... ప్రైవేట్ సెట్‌ టాప్‌ బాక్సుకి సంబంధించిన డిష్‌తో బాటు... ఈ అదనపు యాంటెనాని కూడా ఇంటిపైన పెట్టుకోవాల్సి వస్తుంది.

4.jpg

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మార్కెట్లో ఇప్పటికే స్మార్ట్‌టీవీల సంఖ్య బాగా పెరిగింది. కొన్ని స్మార్ట్‌ టీవీలు అందుబాటు ధరల్లో కూడా లభిస్తున్నాయి. వాటిలో ఆండ్రాయిడ్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ బిల్ట్‌ ఇన్‌గా ఉంటున్నాయి. ఇంట్లో ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉంటే... స్మార్ట్‌ టీవీ ని డైరెక్ట్ గా దానికి కనెక్ట్ చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు - మామూలు టీవీ చానల్స్ తో సంబంధం లేకుండా జనం ఇంటర్‌నెట్లోనే టీవీ ఛానెల్స్‌ చూస్తున్నారు. యూట్యూబ్ ఓటీటీల్లాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అసలు శాటిలైట్‌ టీవీకే ప్రాధాన్యం తగ్గిపోయిన ఈ కాలంలో - ప్రత్యేకంగా ఇన్‌-బిల్ట్‌ ట్యూనర్‌ వల్ల లాభం ఏముంటుంది?

ఏమైనా - బిల్టిన్‌ ట్యూనర్ అన్నది.. టీవీ ఇంటర్నల్ నిర్మాణం మొత్తాన్ని ప్రభావితం చేసేంత పెద్ద నిర్ణయం! తీరా చూస్తే - ప్రాక్టికల్‌గా మరీ గొప్ప ప్రయోజనకారి కాదు అని చెప్పవచ్చు. అసలు నిజం ఏంటంటే - దూరదర్శన్ చానల్స్ ని ప్రమోట్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు - అనేది!

"సెట్‌టాప్‌ బాక్సులకి ఖర్చుచేయలేనివాళ్లకోసమే మా ఈ నిర్ణయం" అంటూ ప్రభుత్వం పైకి చెబితే చెప్పవచ్చు. కానీ ఇదంతా దూరదర్శన్‌ ఛానెల్స్‌ ప్రమోషన్‌ కోసమే అన్నది తెలుస్తూనే ఉంది. ఈ కాలంలో పల్లెటూళ్లలో జనం కూడా మొబైల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీదే ఎక్కువ ఆధారపడుతున్నారు. నిత్యం క్వాలిటీ కంటెంట్‌ చూస్తున్నారు. వినోదాత్మకమైన ఎన్నో ఆప్షన్స్ పెరిగి, జనం క్వాలిటీకి ప్రాధాన్యం ఇస్తూ ప్రతీదీ ఎంచుకుని చూస్తున్నారు. మరి ఈ రోజుల్లో- దూరదర్శన్ చానల్స్‌ ని అభివృద్ధి చేయాలంటే.. వాటి కంటెంట్‌లో క్వాలిటీ పెంచే దిశగా కృషి చేయాలిగానీ.. ఏదో విధంగా వాటిని జనం మీద రుద్దాలని ప్రయత్నించడం కరెక్టా? ఏకంగా మీ టీవీ డిజైన్లే మార్చేయండి అంటూ కంపెనీల్ని ఆదేశించడం కరెక్టా? - అన్నది ఆలోచించాల్సిన విషయం.

5.jpg

క్వాలిటీ లేని ఏవో కొన్ని ఛానెల్స్‌ని ప్రమోట్‌ చేయడం కోసం... ఇన్బిల్ట్ ట్యూనర్ పెట్టాలనడం ... కేవలం టీవీ కంపెనీలకి తలనొప్పి వ్యవహారమే తప్ప ... మరేం కాదు.

కాకపోతే - దీని వల్ల కాస్త మేలు కలిగేది ఎప్పుడూ అంటే ... ఆల్రెడీ మనం ఒక సెట్‌ టాప్ బాక్స్ కలిగి ఉండి, దాని బిల్లు కట్టడం లేట్ అయినప్పుడో... ఆ బాక్స్‌ పనిచేయనప్పుడో... ఈ అదనపు యాంటినా వల్ల ఫ్రీ చానల్స్ చూడగలుగుతాం. అంతకి మించి పెద్దగా లాభం కనిపించడం లేదు.

Updated Date - 2023-02-15T16:27:01+05:30 IST