Moxie AI Robot: ఈ రోబోట్‌ని ఇష్టపడని పిల్లలుండరు!
ABN , First Publish Date - 2023-05-04T17:51:46+05:30 IST
చిన్నపిల్లలు పుస్తకాలు చదివి నేర్చుకోరు... వాళ్లకి ఏది చెప్పినా నేరుగా చెప్పాలి
చిన్నపిల్లలు పుస్తకాలు చదివి నేర్చుకోరు... వాళ్లకి ఏది చెప్పినా నేరుగా చెప్పాలి. వాళ్ల మూడ్‌ని దృష్టిలో పెట్టుకుని ముచ్చటగా చెప్పాలి. ఈ ఇంటరాక్టివిటీ ఉన్నప్పుడే .. పిల్లలు ఏ విషయాలనైనా తొందరగా నేర్చుకోగలుగుతారు. అందుకే - వాళ్లతో లైవ్‌గా మాట్లాడుతూ విషయాలు నేర్పేందుకు - ఇప్పుడు ఏఐ సపోర్టుతో కొన్ని చిన్న చిన్న రోబోట్ తయారవుతున్నాయి. అలాంటి వాటిలో ఒక ఆసక్తికరమైన రోబోట్ గురించి ఇప్పుడు పరిచయం చేసుకుందాం.
దీని పేరు మోక్సీ... Embodied సంస్థ వాళ్లు పిల్లల కోసం తయారు చేసిన ఒక చిన్న రోబట్ ఇది. దీన్ని వాళ్లు World's First Emotional Support Robot For Kids అని అంటున్నారు. చిన్నపిల్లలకి ఎమోషనల్‌గా సపోర్ట్ ఇచ్చేందుకూ, ఫీలింగ్స్ పరంగా లెర్నింగ్ పరంగా హెల్ప్ చేసేందుకూ ఈ రోబోట్ ఉపయోగపడుతుందని వాళ్లు అంటున్నారు.
నిజంగా ఈ రోబోట్ ఎంతో ముచ్చటగా ఉంది. చిన్న పిల్లలకి ఒక చిన్న స్నేహితుడిలా కనిపిస్తూ చేతులు కదుపుతూ... కళ్ళు ఆర్పుతూ సహజంగా కనిపించే ఈ రోబోట్ ... పిల్లలకి విద్య నేర్పడమే కాదు... ఎమోషనల్‌గా కూడా సపోర్ట్ అందించడమే వెరైటీ. ఇంతకీ ఈ ఎమోషనల్ సపోర్ట్ ఏంటి? పిల్లలకి ఏదైనా నేర్పేటప్పుడు - వాళ్లు వెంటనే క్యాచ్ చేయలేకపోయినా.. తప్పుగా అర్థం చేసుకున్నా.. కొందరు సహనం కోల్పోయి చిరాకుపడతారు. అందువల్ల పిల్లలు చదువన్నా.. నేర్చుకోవడం అన్నా కొంత విసుగునీ చిరాకునీ భయాన్నీ కూడా ఏర్పరచుకుంటారు. అయితే ఈ మోక్సీ రోబోట్ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటుంది. పిల్లలు నేర్చుకునే వేగాన్ని బట్టి... తను నేర్పే వేగం మార్చుకుంటుంది. పిల్లల గురించి అర్థం చేసుకుని... కేవలం వాళ్లకే సూట్ అయిన కస్టమైజ్డ్ విధానంతో విషయాల్ని చక్కగా నేర్పుతుంది. ఈ మోక్సీ మంచి టీచర్. ముఖ్యంగా సోషల్ స్కిల్స్ విషయంలో గానీ, పిల్లలు చక్కగా ఎలా ప్రవర్తించాలనే విషయంలో కానీ ... ఈ రోబోట్ ఉపయోగించిన తరవాత ... ఎంతో మెరుగుదల కనిపిస్తోందని తల్లితండ్రులు అంటున్నారు.
మోక్సీ రోబోట్‌కి మొబైల్ యాప్ ద్వారా కంట్రోల్ చేయచ్చు. దీనికి ఒక పేరెంటల్ కంట్రోల్ యాప్ ఉంది. ఈ రోబోట్ ద్వారా నేర్చుకుని పిల్లలు ఎలా అభివృద్ధి చెందుతున్నారో... ఆ విషయాలన్నీ ఆ పేరెంటల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
మోక్సీ ఎంతో డైనమిక్. స్టాటిక్‌గా ఎప్పుడూ ఒకే సమాచారాన్ని అందించే డంబ్ రిజిడ్ రోబోట్ కాదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్, యాక్టివిటీస్ దీంట్లో యాడ్ అవుతూ ఉంటాయి. ప్రతివారం ఇది కొత్త విషయాలతో కొత్త టాలెంట్‌తో, సమాచారంతో అప్‌డేట్ అవుతూ ఉంటుంది.
అయితే మోక్సీ ఎడ్వాన్స్‌డ్ ఎఐ టూల్ కావడం వల్ల.. ప్రస్తుతానికి కొంత ఖర్చుతో కూడుకున్నది. దీనికి లైఫ్ టైమ్ సబ్స్క్రిప్షన్ ... 15 వందల డాలర్లు... అంటే దాదాపు లక్షా పాతికవేల రూపాయల వరకు దీని కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా... ఇది నేర్పించే విద్యతో పోలిస్తే ఇది తక్కువే అని అంటున్నారు మోక్సీని వాడి చూసిన కొందరు పేరెంట్స్.
ఎంతో ముచ్చటైన రంగుతో ఒక చిట్టి స్నేహితుడి లాగా కనిపిస్తూ ఉండే రోబోట్... చిన్నపిల్లలతో మాట్లాడుతూ వాళ్ళ కాన్ఫిడెన్స్‌నీ, తెలివితేటల్నీ కూడా పెంచుతూ... వాళ్ల ప్రవర్తన కూడా సరిచేస్తూ... ఉంటుంది. ఒక మంచి టీచర్లా మాత్రమే కాదు. మంచి ఫ్రెండ్‌లా కూడా అనిపిస్తుంది.
క్లాసులో అనేకమందితో కలిపి... ఒకేసారిగా విద్యార్థులందరికీ ఒకే రకమైన విద్య ఇవ్వడం అన్నది పాత పద్ధతి. అలా కాకుండా... ఒకే విద్యార్థి మీద మనసంతా పెట్టి అతని ఎదుగుదలే లక్ష్యంగా... ఈ చిట్టి రోబోట్ పనిచేస్తుంది. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న రోబోట్స్ ఎడ్యుకేషన్ రంగంలో ఎంతో అవసరం. విద్యారంగంలో ఏఐ సాధిస్తున్న ప్రగతికి... ఇలాంటి చిట్టి రోబోట్స్ ప్రత్యక్ష ఉదాహరణలు అని చెప్పాల్సి ఉంటుంది.