TPCC President Revanth Reddy : అదానీ, అంబానీతో కేసీఆర్ పోటీ
ABN , First Publish Date - 2023-03-04T04:41:51+05:30 IST
ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్న అదానీ, అంబానీలతో కేసీఆర్ కుటుంబం పోటీ పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో దోపిడీ, అవినీతి పాలన.. 9 ఏళ్లలో అభివృద్ధి శూన్యం.. దళిత, గిరిజనులను మోసం చేశారు
పార్టీ అధ్యక్షురాలిలా గవర్నర్ మాటలు
కాంగ్రెస్ గెలిచాక ధరణి రద్దు: రేవంత్
ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్: ఠాక్రే
తిమ్మాపూర్/మానకొండూర్, మార్చి3: ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్న అదానీ, అంబానీలతో కేసీఆర్ కుటుంబం పోటీ పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దోపిడీ, అవినీతి పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. వారి దోపిడీ బయటపెడుతున్నందుకే తమపై పోలీసులను ఉసిగొల్పి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హాత్ సే హాత్ జోడోయాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం కరీంనగర్ జిల్లాలోని మొగిళిపాలెం నుంచి పోలంపల్లి వరకు కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన బైక్ ర్యాలీలో రేవంత్ పాల్గొన్నారు. మన్నెంపల్లిలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాత్రి మానకొండూర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులకు నిబంధనల ప్రకారం 4+4 సెక్యూరిటీ ఉండాల్సి ఉండగా, తనకు 2+2 కు కుదించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తల ముసుగులో పోలీసులు సైతం తమపై దాడులకు పాల్పడుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇచ్చినా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని దుయ్యబట్టారు. జోడో యాత్రలో భాగంగా ప్రజలను కలుసుకున్నపుడు పోడు భూములు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ సమస్యపైనే ఎక్కువగా విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ కలిసి కాంగ్రె స్‌ను ఓడించాయని, ఇప్పుడు విడివిడిగా పోటీ చేస్తేనే లాభం ఉంటుందన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నాయని ఆరోపించారు.
రాజ్‌భవన్, ప్రగతిభవన్ ఒక్కటేనని రేవంత్ విమర్శించారు. పోడు భూములకు పట్టాలివ్వని సర్కార్‌పై చర్యలు తీసుకోకుండా.. ఒక పార్టీ అధ్యక్షురాలి తీరులో గవర్నర్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో చేపట్టనున్న దీక్ష.. ఒక పెద్ద డ్రామా అని విమర్శించారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని, ఏ ఒక్క అభివృద్ధి పనీ చేపట్టలేదని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు రసమయి పేదల భూములను లాక్కొని ఫాంహౌ ్‌సలను నిర్మించుకున్నారని ఆరోపించారు. పేదల బతుకులు మారాలంటే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రె్‌సను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఏఐసీసీ నిర్ణయం మేరకు ఏప్రిల్ 6వ తేదీ వరకు 60రోజుల మొదటి విడత పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. పార్టీ అదేశాల మేరకు కొందరు నేతలు ఇప్పటికే వారి ప్రాంతాల్లో జోడో యాత్రలు చేపడుతున్నారని, కార్యక్రమంలో భాగస్వాములు కాని వారిపై ఏప్రిల్ 6 తర్వాత సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీఫామ్ కావాలంటే యాత్రలు చేపట్టాల్సిందేనన్నారు. మానకొండూరు సభలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసిందన్నారు. నిత్యావసర ధరలను పెంచుతూ పేదలను దోచుకుతింటోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు.