ధాన్యం కొనుగోళ్లలో జాప్యం

ABN , First Publish Date - 2023-04-07T03:15:35+05:30 IST

రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రస్తుతం పంటలు కోస్తున్న రైతులకు తిప్పలు తప్పడం లేదు.

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం

ఈ నెల 15 నుంచి సేకరించాలని ఎఫ్‌సీఐ ఆదేశాలు

21 నుంచి కేంద్రాలను తెరవాలని సర్కారు యోచన

ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రారంభమైన వరి కోతలు

మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొంటున్న మిల్లర్లు

అవసరమైన చోట కేంద్రాలు తెరవాలని రైతుల డిమాండ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రస్తుతం పంటలు కోస్తున్న రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు ధాన్యాన్ని నిల్వచేసే సదుపాయాలు లేకవడంతో పంటను తక్కువ ధరకే రైస్‌మిల్లర్లకు అమ్మేస్తున్నారు. దీంతో అన్నదాతలకు కనీస మద్దతు ధర అందటంలేదు. ఈ నెల 21 నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కానీ అంతకంటే ముందే అవసరమైన చోట కేంద్రాలను ప్రారంభించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎఫ్‌సీఐ మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్‌ 15 నుంచి సేకరణ మొదలుపెట్టవచ్చు. ఒకవేళ ముందే కొనుగోలు కేంద్రాలు తెరవాలనుకుంటే కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలి. గతేడాది ఏప్రిల్‌ 21న రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పుడు కూడా అదే తేదీన కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం సేకరణ, ఇతరత్రా ప్రణాళికలు, ఏర్పాట్లపై సమీక్షించటానికి ఈ నెల 10న మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, నిరంజన్‌రెడ్డిలు హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో సమావేశం నిర్వహించనున్నారు. ఆ భేటీలో ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం తీసుకుంటారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో కొనుగోలు కేంద్రాలను తెరవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నిజామాబాద్‌, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, జనగామ.. తదితర ప్రాంతాల్లో వరికోతలు జరుగుతున్నాయి. అక్కడి రైతులు మార్కెట్‌లో ధాన్యం అమ్ముకుంటున్నారు. కోతలు జరుగుతున్న ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నదాత లు డిమాండ్‌ చేస్తున్నారు. పదో తేదీన మంత్రులు సమీక్ష నిర్వహించినా.. కనీసం 15 నుంచైనా సెంటర్లు తెరవాలని కోరుతున్నారు.

ఎమ్మెస్పీ కంటే తక్కువ ధర..

కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) సాధారణ రకానికి క్వింటాకు రూ. 2,040.. ఏ-గ్రేడ్‌ ధాన్యానికి రూ.2,060 ఉంది. రైస్‌ మిల్లర్లు, ట్రేడర్లు.. రైతులకు ఎమ్మెస్పీ చెల్లించటంలేదు. కొద్ది రోజుల క్రితం క్వింటాకు రూ.2వేల వరకు చెల్లించారు. ఇప్పుడు రూ.1,700- 1,725కు కొనుగోలు చేస్తున్నారు. ధర తగ్గించటానికి ప్రధాన కారణం రైతులకు ప్రత్యామ్నాయం లేకపోవటమే. రాష్ట్ర ప్రభు త్వం ఇప్పట్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే పరిస్థితి లేదని, ఏప్రి ల్‌ మూడో వారం వరకు వేచి చూడాల్సిందేనని.. ఈ నేపథ్యంలో తమకే అమ్మటం తప్ప ప్రత్యామ్నాయం లేదని రైస్‌మిల్లర్లు ధరలు తగ్గించారు.

సీఎంఆర్‌ ఇవ్వని మిల్లర్లకు 25 శాతం జరిమానా..

ఎఫ్‌సీఐకి నిర్ణీత గడువులో బియ్యం ఇవ్వని రైస్‌ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు. ‘సివిల్‌ సప్లయ్స్‌పై రూ.845 కోట్ల భారం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన కథనంపై ఆయన వివరణ ఇచ్చా రు. ధాన్యం సేకరణ పాలసీ జీవో-13 ప్రకారం.. సదరు రైస్‌ మిల్లులను డిఫాల్టర్ల జాబితాలో చేరుస్తామని, 25 శాతం జరిమానా విధించి.. 125 శాతం బియ్యం వసూలు చేస్తామని తెలిపారు.

Updated Date - 2023-04-07T03:15:35+05:30 IST