తెలంగాణ అభివృద్ధి తెలియాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లండి!
ABN , First Publish Date - 2023-01-06T04:01:35+05:30 IST
తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకోవాలంటే ఇతర రాష్ట్రాల్లో పర్యటించాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
కేంద్ర అవార్డుల్లో అత్యధికం మనకే.. అభివృద్ధి లేకుంటే ఎలా ఇస్తున్నారు?
ప్రజల సమస్యల పరిష్కారానికి వినూత్నంగా ఆలోచించండి
సమీక్షలో పురపాలక మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకోవాలంటే ఇతర రాష్ట్రాల్లో పర్యటించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పుడే ఇక్కడ జరిగిన అభివృద్ధి అర్థమవుతుందని చెప్పారు. ఓవైపు రాష్ట్రంలో అభివృద్ధే జరగలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. మరోవైపు ఇక్కడి అభివృద్ధిని గుర్తించిన కేంద్రం అత్యధిక అవార్డులు తెలంగాణకే అందిస్తోందని తెలిపారు. ఇక్కడ అభివృద్ధి లేకుంటే కేంద్రం అవార్డులు ఎందుకు ఇస్తోందని పరోక్షంగా బీజేపీ నేతలను ప్రశ్నించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లతో గురువారమిక్కడ నిర్వహించిన వర్క్‌షా్‌పలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ప్రజల సమస్యలకు వినూత్న పరిష్కారాలు ఆలోచించాలన్నారు. పౌరులు కేంద్రంగా పాలన జరగాలని.. ఆ దిశగా మరింత మెరుగైన విధానాలు అమలు చేసేందుకూ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అవసరమైతే మునిసిపల్ చట్టంలోనూ మార్పులు చేస్తామని, ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యత తానే తీసుకుంటానని తెలిపారు. చట్టాలు చేయడం ఎమ్మెల్యేల బాధ్యతే కాదని, క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన అధికారులూ భాగస్వామ్యం కావాలని అన్నారు. రాష్ట్రంలోని పట్టణాల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్ చెప్పారు. పురపాలక శాఖ, దాని అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో హైదరాబాద్ కాకుండా మిగతా పట్టణాల్లో అభివృద్ధి పనుల కోసం ఎనిమిదేళ్లలో సుమారు రూ.16 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అందుకే కేంద్ర ప్రభుత్వ సర్వేల్లో ఎంపికయ్యే పంచాయతీలు, పట్టణాలు, జిల్లాలన్నీ తెలంగాణలోనే ఉంటున్నాయని చెప్పారు.
మంచి పనులు చేయండి
తెలంగాణ పురపాలక శాఖను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్నది తన లక్ష్యమని కేటీఆర్ అన్నారు. పనిచేస్తున్న సంస్థలో, విభాగంలో ఏదో ఒక మార్పును తీసుకొచ్చామన్న సంతృప్తిని రిటైర్మెంట్ రోజు పొందినప్పుడే జీవితంలో అసలైన విజయం సాధించినట్లని కేటీఆర్ చెప్పారు. ‘రేపు రిటైర్ అవుతాం. తర్వాత పైకెళ్లి పోతాం. అలా పోయేలోపు మంచి పనులు చేయాలి. ప్రజలకు సేవ చేశామన్న తృప్తి ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. త్వరలోనే వార్డుకో పురపాలక అధికారిని ఏర్పాటు చేయబోతున్నామని కేటీఆర్ తెలిపారు.
ఐదేళ్లలో 50 శాతం జనాభా పట్టణాల్లోనే..
ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో 46ు మంది పట్టణాల్లో నివసిస్తుండగా, వచ్చే ఐదేళ్లలో ఇది 50శాతానికి మించిపోతుందని కేటీఆర్ తెలిపారు. వినూత్న ఆలోచనలతో ముందుకెళితేనే పట్టణాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. టీఎ్‌సబీపాస్ ద్వారా నిర్ణీత గడువులోగా భవనాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని తెలిపారు. టీఎ్‌సబీపాస్ ద్వారా హైదరాబాద్ కాకుండా దాదాపు 1,78,000 దరఖాస్తులకు పురపాలక శాఖ అనుమతులు ఇచ్చిందని కేటీఆర్ వెల్లడించారు. ఇక నుంచి ఫిబ్రవరి 24న పట్టణ ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించనున్నామని ప్రకటించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులకు ఆ రోజు అవార్డులు ప్రదానం చేస్తామన్నారు.
అవసరమైతే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ మార్పు..
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ నిరసనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేవలం మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమే ఇచ్చారని తెలిపారు. ప్రజల కోణంలోనే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యంతరాలు ఉంటే ముసాయిదాలో మార్పులు చేస్తామని ప్రకటించారు. ప్రజలకు అన్ని విషయాలు వివరించాలన్నారు. ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టదని స్పష్టం చేశారు. నిర్మాణాత్మక నగరాలు, పట్టణాల అభివృద్ధి కోసమే మాస్టర్ ప్లాన్ వేశామని చెప్పారు. అది ప్రజలకు అనుకూలంగా ఉండాలని, వ్యతిరేకంగా ఉండరాదని కేటీఆర్ పేర్కొన్నారు.