Deccan Complex: అదుపులోకి రాని మంటలు.. డెక్కన్ కాంప్లెక్స్ ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదం
ABN , First Publish Date - 2023-01-19T18:06:05+05:30 IST
సికింద్రాబాద్ (Secunderabad) రాంగోపాల్‌పేట్‌లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. డెక్కన్ కాంప్లెక్స్ (Deccan Complex)లో మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి.
హైదరాబాద్: సికింద్రాబాద్ (Secunderabad) రాంగోపాల్‌పేట్‌లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. డెక్కన్ కాంప్లెక్స్ (Deccan Complex)లో మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి. భవనం ఐదంతస్తుల వరకూ మంటలు వ్యాపించాయి. ఊహించని విధంగా అగ్నిప్రమాద తీవ్రత పెరుగుతోంది. డెక్కన్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలముకుంది. మంటలార్పేందుకు 6 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. డెక్కన్ కాంప్లెక్స్ ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. భవనంలో భారీగా పేలుడు శబ్దాలు వస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. గాలి దిశ మారుతుండడంతో మంటలు అదుపులోకి రావడం లేదని డీఆర్‌ఎఫ్ అధికారి చెబుతున్నారు. అందుకే రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) ఆలస్యమవుతోందని, భవనం పిల్లర్లు చాలా వీక్ అయినట్లు తెలుస్తోందన్నారు. డెక్కన్ కాంప్లెక్స్ ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదం ఉందని, భవనం పరిసర ప్రాంత వాసులను ఖాళీ చేయిస్తున్నామని డీఆర్‌ఎఫ్ అధికారి తెలిపారు.
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ పీఎస్ పరిధిలోని నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో దుకాణంలో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన రహదారి వైపు వాహనాలను దారి మళ్లించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.
మంటలు అదుపు చేస్తున్నా.. దట్టమైన పొగ వల్ల మంటలు అర్పడం ఫైర్ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. లోపల బట్టల సరుకు ఎక్కువగా ఉండటంతో మంటలను అదుపు చేయడం కష్టమవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా తయారీ యూనిట్ ఇక్కడ పెట్టడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అనుమతులు లేకుండా జనావాసాల్లో నడుస్తున్న తయారీ యూనిట్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని పోలీసులు పేర్కొన్నారు.