Kishan Reddy : కట్టుబానిసల్లా వ్యవహరించొద్దు

ABN , First Publish Date - 2023-04-06T03:41:14+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేయడానికి గల కారణమేంటని డీజీపీ అంజనీకుమార్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సంజయ్‌ను అరెస్టు చేశారన్న వార్త తెలిసిన వెంటనే డీజీపీకి ఫోన్‌ చేసి ఈ మేరకు నిలదీశారు. కారణం చూపకుండా ఎలా ..

Kishan Reddy : కట్టుబానిసల్లా వ్యవహరించొద్దు

బండి సంజయ్‌ అరెస్టుకు కారణాలేంటి?

డీజీపీకి ఫోన్‌ చేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ప్రశాంత్‌ బీఆర్‌ఎస్‌ నేతలతో ఉన్న ఫొటోలు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేయడానికి గల కారణమేంటని డీజీపీ అంజనీకుమార్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సంజయ్‌ను అరెస్టు చేశారన్న వార్త తెలిసిన వెంటనే డీజీపీకి ఫోన్‌ చేసి ఈ మేరకు నిలదీశారు. కారణం చూపకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. స్పందించిన డీజీపీ.. కేసు వివరాలను కాసేపటి తర్వాత తెలియజేస్తామన్నారు. ఏ కేసులో బండి సంజయ్‌ను అరెస్టు చేశారో డీజీపీకి కూడా తెలియకపోవడం తెలంగాణ పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనమని కిషన్‌రెడ్డి అన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి కట్టు బానిసల్లా వ్యవహరించవద్దంటూ పోలీసులకు హితవు పలికారు. లక్షలాది మంది నిరుద్యోగులకు బాసటగా నిలుస్తూ టీఎ్‌సపీఎస్సీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు బండి సంజయ్‌ని బీఆర్‌ఎస్‌ సర్కారు టార్గెట్‌ చేసిందని ఆరోపించారు. కేసీఆర్‌ కళ్లలో ఆనందం చూడడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సంజయ్‌ను మానసికంగా వేధించారని, అనేక వాహనాలు మార్చారని, పలు స్టేషన్లకు తిప్పారని.. ఉగ్రవాదుల విషయంలో కూడా ఇలా వ్యవహరించలేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రగతిభవన్‌ డైరక్షన్‌లో పోలీసులు సంజయ్‌ని అక్రమ కేసులో ఇరికించారన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారం ఆయన్ను ఏ1గా పెట్టారని ఆరోపించారు. ‘‘కొత్త జైళ్లు సిద్ధం చేయండి. లక్షల మంది బీజేపీ కార్యకర్తలు జైళ్లకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. బెదిరింపులకు భయపడే వాళ్లం కాదు’’ అని కిషన్‌రెడ్డి ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చర్యలపై న్యాయపరంగా, రాజకీయంగా పోరాటాలు చేస్తామని ప్రకటించారు. జర్నలిస్టులు సమాచారమివ్వడం నేరమా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ప్రశాంత్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు దయాకర్‌రావు, వినయభాస్కర్‌ వంటివారితో ఉన్న ఫొటోలను విలేకరులకు చూపారు.

2-laxman.jpg

ప్రశ్నించే గొంతులను నొక్కే యత్నం: కె.లక్ష్మణ్‌

ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ అన్నారు. లీకేజీలు, ప్యాకేజీల విషయం బయటకు రాకుండా చూసుకునేందుకే కేసీఆర్‌ సర్కారు బండి సంజయ్‌ని అన్యాయంగా అరెస్టు చేసిందని ఆరోపించారు. కేసీఆర్‌ దిగజారుడుతనానికి ఈ అరెస్టు పరాకాష్ఠ అన్నారు. విపక్షాల చైర్మన్‌గా కేసీఆర్‌ రూ.కోట్లు ఖర్చు పెడుతున్నారని వస్తున్న వార్తల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ అరెస్టు అని ధ్వజమెత్తారు.

2arvind.jpg

ప్రధాని పర్యటన ఉందన్న అసహనంతోనే..: అర్వింద్‌

ప్రధాని మోదీ ఈ నెల 8న హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో అసహనంతోనే కేసీఆర్‌ ప్రభుత్వం బండి సంజయ్‌ని అరెస్టు చేసి, ఎమర్జెన్సీ వాతావరణం సృష్టిస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. సీనియర్‌ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ చెప్పినట్లుగా.. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నిటికీ ఎన్నికల ఖర్చు భరించేంత డబ్బులు కేసీఆర్‌కు ఎక్కడి నుంచి వచ్చాయన్న చర్చ జరుగుతోందన్నారు.

Updated Date - 2023-04-06T04:05:19+05:30 IST