CM Chandrababu: గత ప్రభుత్వ భూ కబ్జాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
ABN , Publish Date - Nov 29 , 2024 | 05:49 PM
గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భూ కబ్జాలతోపాటు అవినీతి, అక్రమాలపై సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షలో రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు పలు ప్రశ్నలు సంధించారు.
అమరావతి, నవంబర్ 29: గత జగన్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలతోపాటు భూ కబ్జాలు భారీగా చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో రెవెన్యూ శాఖకు ఫిర్యాదులు సైతం భారీగా అందాయి. ఈ ఫిర్యాదులను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ చొరవ తీసుకుంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన శుక్రవారం అమరావతిలో సమీక్ష నిర్వహించారు.
Also Read: కేసీఆర్ దీక్ష ఫేక్.. విచారణ జరపాలి
ఈ సమీక్షా సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌తోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ శాఖకు సంబంధించి.. ప్రజల నుంచి వస్తున్న వినతులు, వాటి పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను సీఎం చంద్రబాబు.. ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం వివిధ శాఖలకు 1,74,720 వినతులు రాగా.. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 67,928 ధరఖాస్తులు వచ్చాయని సీఎంకు అధికారులు వివరించారు.
Also Read: భారీ వర్షాలు.. ఆ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
అలాగే ఈ శాఖలో రెవెన్యూ రికార్డులు, భూ కబ్జాలు, అసైన్మెంట్ భూములు తదితర సమస్యలపై ఫిర్యాదులు అధికంగా వచ్చాయని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలియజేశారు. ఈ ఫిర్యాదుల పరిష్కారం ఏ దశలో ఉందనే అంశాన్ని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులను సత్వరమే.. అదీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని వారికి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read: విజన్ డాక్యుమెంట్‌పై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
వినతులుపై ప్రజలను అక్కడికి, ఇక్కడికి తిప్పే పరిస్థితి ఇకపై ఉంటే సహించేది లేదని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అలాగే రెవెన్యూ శాఖ పరిధిలో అధిక సంఖ్యలో సమస్యలు, ప్రజలు ఇబ్బందులు పడడానికి గల కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి సమూల మార్పులు చేయాలని అధికారులకు సీఎం సూచించారు.
రెవెన్యూ సేవలు ప్రజలు సులభంగా పొందేందుకు అవసరమైన ప్రక్షాళన చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏ తరహా ఫిర్యాదును ఎలా పరిష్కరిస్తున్నారు.. అందుకోసం ఎంత సమయం తీసుకుంటున్నారంటూ.. అధికారులకు ఈ సందర్భంగా సీఎం ప్రశ్నలు సంధించారు. ఫిర్యాదులు పరిష్కరించే క్రమంలో ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం అవుతుందా? లేదా? అనే అంశాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.
గత జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ పార్టీ నేతలు వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు.. బాధితులుగా మారారు. దీంతో తమ సమస్యలు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో మళ్లీ ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఓటరు కూటమికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో బాధితులుగా మారిన వారంతా.. ఫిర్యాదు చేసేందుకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలు ఎంత వరకు పరిష్కరించారనే అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
For AndhraPradesh news And Telugu News
రెవెన్యూ శాఖ సమూల ప్రక్షాళన...
రెవెన్యూ సేవలు సులభతరం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆన్‌లైన్‌లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలని చెప్పారు. ధ్రువపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. రెవెన్యూ శాఖలో ప్రజల అర్జీల పరిష్కారంపై థర్డ్ పార్టీతో ఆడిట్ చేస్తామని అన్నారు. ఆన్‌లైన్ రికార్డులు మార్చి ప్రజలను భయపెట్టి భూములు కొట్టేసిన వారిపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రెవెన్యూ శాఖ సమూల ప్రక్షాళన....తప్పు చేసే అధికారులకూ శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. రీసర్వేతో తెలెత్తిన 2.29 లక్షల సమస్యల సత్వర పరిష్కారిస్తామని అన్నారు. సమస్యలకు తావు లేకుండా రీ సర్వే చేపట్టాలని కోరారు. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన 7,827 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్‌లపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.