Share News

బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం

ABN , Publish Date - Oct 05 , 2024 | 04:25 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వైభవంగా నాంది పలికారు.

బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం

ధ్వజారోహణంతో నాంది పలికిన అర్చకులు

తొలిరోజు పెద్దశేష వాహనంపై మలయప్ప విహారం

స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు

2025 టీటీడీ క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరించిన చంద్రబాబు

తిరుమల, అక్టోబరు4(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వైభవంగా నాంది పలికారు. తొలిరోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి పెద్దశేష వాహనంలో నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అంతకుముందు ఆలయంలో నిత్యపూజాదికాల అనంతరం ప్రధాన అర్చకులు వరుసగా శ్రీదేవి, భూదేవి, మలయప్ప, ఇతర దేవతలు, కంకణ భట్టాచార్యులైన గోవిందాచార్యులు, టీటీడీ ఈవో శ్యామలరావుకు కంకణ ధారణ చేశారు. మధ్యాహ్నం 3గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని బంగారు తిరుచ్చిలో మాడవీధుల్లో ఊరేగించారు. ధ్వజపటాన్ని కూడా ఊరేగిస్తూ బ్రహ్మోత్సవాలకు దేవతలందరికీ ఆహ్వానం పలికారు. సాయంత్రం 5.45- 6గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

తిరుమలలో గోవింద నామస్మరణే ప్రతిధ్వనించాలి

పవిత్రమైన తిరుమలలో గోవింద నామస్మరణ మాత్రమే ప్రతిధ్వనించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. పట్టువస్త్రాల సమర్పణ అనంతరం ఆయన ఆలయంలోని రంగనాయక మండపంలో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు దాదాపు 15లక్షల మంది భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఇక్కడికి వచ్చేవారితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు కూడా వాహన సేవలు వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అందరికంటే ఎక్కువసార్లు బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే అవకాశం లభించినందుకు గర్వపడుతున్నానన్నారు. అందరూ తిరుమల పవిత్రతను కాపాడాలని చంద్రబాబు కోరారు.


gkb.jpg

విరిగిన ధ్వజస్తంభం కొక్కీ

ధ్వజారోహణానికి కొన్ని గంటల ముందు శుక్రవారం మధ్యాహ్నం ధ్వజస్తంభం పైభాగంలోని కొక్కీ విరగడం అధికారులను, అర్చకులను కలవరపాటుకు గురిచేసింది. వెంటనే ఇంజనీరింగ్‌ అధికారుల ఆధ్వర్యంలో అర్చకులే ధ్వజస్తంభం పైభాగానికి చేరుకుని విరిగిన కొక్కీని తొలగించి కొత్తది ఏర్పాటు చేసి ధ్వజారోహణ కార్యక్రమానికి సిద్ధం చేశారు.

ఎలాంటి అపచారం జరగలేదు: టీటీడీ

ధ్వజస్తంభంపై కొక్కీ విరిగిపోవడంతో తిరుమలలో అపశ్రుతి, అపచారం అంటూ సాగిన ప్రచారంపై టీటీడీ స్పందించింది. ‘ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసే కొక్కీ విరగడం అపచారమని కొన్ని ప్రసార.. సామాజిక మాధ్యమాల్లో వదంతులు వస్తున్నాయి. భక్తులు వీటిని నమ్మొద్దు. సాధారణంగా బ్రహ్మోత్సవాల ముందే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం.. ఏవైనా భిన్నమైన (దెబ్బతిన్న) వస్తువులు ఉంటే వాటిని మార్చి కొత్తవి అమర్చడం సంప్రదాయం. అందులో భాగంగానే ఈ కొక్కీని అర్చకులు తొలగించి, కొత్తదాన్ని ఏర్పాటు చేశారు. అంతలో అపచారం జరిగినట్టుగా కొన్ని మాధ్యమాలు ప్రసారం చేయడం దురదృష్టకరం’ అంటూ టీటీడీ ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది.

పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం

బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీ వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి సాయంత్రం చేరుకున్న ముఖ్యమంత్రి... కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత సంప్రదాయ వస్త్రధారణతో సతీమణి నారా భువనేశ్వరితో కలిసి బేడీఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు సీఎం తలకు పరివట్టం చుట్టి, శేషవస్త్రాన్ని మెడలో ధరింపజేశారు. అనంతరం నూతన పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని భాజాభజంత్రీలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. మూలవర్లను దర్శించుకుని రంగనాయకుల మండపం చేరుకోగా వేదపండితులు ఆశీర్వాదం పలికారు. ఈ సందర్భంగా టీటీడీ ముద్రించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీలను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన వాహన మండపానికి చేరుకుని రాత్రి 9గంటలకు పెద్దశేష వాహనంలో పాల్గొని, ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2024 | 04:26 AM